Jagan With Students: బతుకుల్ని మార్చేది చదువొక్కటే, అమెరికా వెళ్లిన విద్యార్ధులకు జగన్ అభినందనలు
Jagan With Students: బతుకులు మారాలంటే విద్య ఒక్కటే సాధనమని సిఎం జగన్ అమెరికా నుంచి తిరిగొచ్చన విద్యార్ధులకు సూచించారు. విద్య అనే సాధనం ద్వారా మనం పెద్ద పెద్ద కలలను కనాలని…ఆ కలలనుంచే వాస్తవాలు సాకారం అవుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అమెరికా పర్యటనకు అర్హత సాధించినందుకు అభినందించారు.
Jagan With Students: అమెరికాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందాన్ని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు.సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు అమెరికాలో పర్యటించిన విద్యార్ధులు శివలింగమ్మ, చంద్రలేఖ, గణేష్, జ్యోత్స్న, రాజేశ్వరి, గాయత్రి, రిషితారెడ్డి, యోగీశ్వర్, షేక్ అమ్మాజాన్, మనస్వినిలను సిాఎం జగన్ అభినందించారు.
వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో వాళ్లు పాల్గొని వచ్చారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ వాళ్లతో ముచ్చటించారు. వాళ్ల టూర్ అనుభవాల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు బాగోగులు మాట్లాడారు.
అమెరికాలో పర్యటించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సిఎం జగన్ భేటీ అయ్యారు. అమెరికాలో పర్యటించిన ప్రభుత్వ విద్యార్థుల బృందం తమ అనుభవాలను సిఎంతో పంచుకున్నారు. అమెరికా పర్యటన ఎలా జరిగింది అంటూ పిల్లలను అడిగి తెలుసుకున్నారు.
ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎప్, కొలంబియా యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లలో విద్యార్థులు పాల్గొన్నారని అధికారులు వివరించారు.
ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 126 మందిి విద్యార్థులను గుర్తించి వారికి పోటీపరీక్ష నిర్వహించామని, వారి భాషాపరిజ్ఞానాన్నికూడా పరిశీలించి చివరకు 10 మందిని ఎంపిక చేశామని అధికారులు సిఎంకు తెలిపారు.
ప్రపంచం ఎలా ఉంది? మనం ఎక్కడ ఉన్నాం? ఎంత వెనకబడి ఉన్నాం? మనకు అర్థం అవుతుందనేది గుర్తించాలన్నారు. ప్రపంచం వేగంగా పరుగులు తీస్తుందని… మనం చాలా వెనకబడి ఉన్నామని సిఎం అభిప్రాయ పడ్డారు. ప్రపంచంతో మనం పోటీపడాలి, మనం నిలబడగలగాలని అప్పుడే మన బతుకులు మారుతాయన్నారు.
జగనన్న విదేశీ దీవెన అమలు చేస్తున్నామని, కొలంబియా యూనివర్శిటీ లాంటి 21 కోర్సుల్లో ప్రపంచప్రఖ్యాతి చెందిన 350 కాలేజీల్లో సీటు సాధిస్తే మీకు ఉచితంగా ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.
సంబంధిత కాలేజీల్లో ఫీజులు చూస్తే రూ.80 నుంచి రూ.1 కోటి వరకూ ఉంటాయని, విదేశీ విద్యాదీవెన కార్యక్రమం కింద ఈ కాలేజీల్లో మీకు సీటు వస్తే చాలు రూ.1.2 కోట్ల వరకూ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఒక్క రూపాయికూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగా చదవిస్తామన్నారు. అలాంటి ప్రపంచస్థాయి కాలేజీలనుంచి నుంచి బయటకు వస్తే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓ కావాలన్న మీ కలలు నిజం అవుతాయన్నారు.
సీఈఓ లాంటి స్థాయికి వెళ్లాలి అంటే, మనలో ప్రతిభ, నైపుణ్యం ఉండాలని, మనం చదివే చదువుల వల్లే ప్రతిభ, మంచి నైపుణ్యాలు వస్తాయన్నారు. ప్రపంచపు అత్యుత్తమ కాలేజీల్లో మీరు విద్యను అభ్యసించడం ద్వారా మీ నైపుణ్యానికి మంచి ఆమోదం లభిస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలు మీకు మంచి స్థానాల్లో ఉద్యోగాలు కల్పిస్తాయని, మీ జీవితాలు పూర్తిగా మారడం మొదలవుతుందని జగన్ పేర్కొన్నారు.
అలాంటి కాలేజీల్లో విద్యాభ్యాసకోసం, సీటు సాధించడానికి మీరు ఇవ్వాళ్టినుంచే సన్నద్ధం కావాలన్నారు. ఆసక్తి ఉన్న ఉన్న కోర్సు ఏంటి? ఈ కోర్సును అందిస్తున్న ప్రపంచంలోనే అత్యుత్తమ కాలేజీలు ఏంటి? అన్నదానిపై ఇప్పటినుంచే ఆలోచన మొదలు కావాలన్నారు. ఆ కాలేజీల్లో సీటు రావాలంటే… మనకు ఏయే పరీక్షల్లో ఎంతెంత మార్కులు రావాలి? అన్నదికూడా తెలుసుకోవాలన్నారు.
జీమ్యాట్, జీఆర్‌ఈ, టోఫెల్ ఇలాంటి పరీక్షలు ఏమి ఉన్నాయో తెలుసుకోవాలని, వీటికి ఎలా సన్నద్ధంకావాలని అన్నదానిపై ఆలోచనలు చేయాలన్నారు. జీఆర్‌ఈ, జీ మ్యాట్ లాంటి పరీక్షలు కూడా ప్రభుత్వ విద్యార్ధులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. టోఫెల్ ఎలా తీసుకువచ్చామో, అలాగే జీఆర్‌ఈ, జీమ్యాట్‌కూడా ఇక్కడున్న పిల్లలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సంబంధి మెటరీయల్‌ను, శిక్షణను ఇక్కడున్న పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
కొలంబియా యూనివర్శిటీ, వార్టన్, ఎల్‌ఎస్‌ఈ, ఇన్సియార్డ్.. ఇలా ఎక్కడికి వెళ్లాలన్నదానిపై విజన్ పెట్టుకోవాలి. ఇలాంటి కాలేజీలు 350 ఉన్నాయి. వీటిలో సీటు సాధించడం అన్నది మీ విజన్ కావాలి, మీ లక్ష్యం కావాలని వారికి సూచించారు. అమెరికా పర్యటనకు వెళ్లిన పిల్లలకు మార్గనిర్దేశం చేయడానికి ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని అక్కడే అధికారులను ఆదేశించారు.