రేషన్‌ కార్డుపై రూ. 110కే పామాయిల్‌ - రైతు బజార్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి - మంత్రి మనోహర్-civil supplies and consumer affairs minister nadendla manohar inspected the rythu bazars ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రేషన్‌ కార్డుపై రూ. 110కే పామాయిల్‌ - రైతు బజార్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి - మంత్రి మనోహర్

రేషన్‌ కార్డుపై రూ. 110కే పామాయిల్‌ - రైతు బజార్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి - మంత్రి మనోహర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 11, 2024 06:49 PM IST

విజయవాడలోని రైతు బజార్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ తనిఖీ చేశారు. వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. పామాయిల్ రూ.110కే విక్రయించాలని మంత్రి స్పష్టం చేశారు.

రైతు బజార్ ను తనిఖీ చేస్తున్న మంత్రి మనోహర్
రైతు బజార్ ను తనిఖీ చేస్తున్న మంత్రి మనోహర్

విజయవాడ నగరంలో ఆకస్మికంగా రెండు రైతు బజార్లను పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ తనిఖీ చేశారు. వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై ఆరా తీశారు. వినియోగదారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. గురునానక్ కాలనీ సహా, పంటకాలువ రోడ్ లో ఉన్న రైతు బజార్లను తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి మనోహర్… పామాయిల్ రూ.110కే విక్రయించాలని స్పష్టం చేశారు. సన్ ఫ్లవర్ ఆయిల్ ను రూ.124కు విక్రయించాలని, అదేవిధంగా అందరికీ కనబడేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకమైన ధరల్ని అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.

ప్రతి రేషన్‌ కార్డుపై రిఫైండ్‌ ఆయిల్‌ను గరిష్టంగా రూ.124కు, పామాయిల్‌ను రూ.110కు విక్రయించాలన్నారు. రాష్ట్రంలోని కోటి 49 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డు సదుపాయం ఉండటంతో వారికి సబ్సిడీ ధరలపై వంట నూనె అందనుందని వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా రైతుబజార్లలోని దుకాణాల వద్ద ధరలు సూచించే బోర్డులను ఏర్పాటు చేయించారు. ప్రజలకు విక్రయించే ఉల్లి, టామాటా నాణ్యతనూ మంత్రి మనోహర్ పరిశీలించారు. నాణ్యత లేని ఉత్పత్తులు విక్రయిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని కోటి 49లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డు సదుపాయం ఉండటంతో వారికి సబ్సిడీ ధరలపై వంట నూనె అందనుంది. మరోవైపు రేషన్‌ కార్డులు లేని కుటుంబాల విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు వంట నూనెల ధరల నియంత్రణ, కృత్రిమ కొరత, నిల్వలను దాచి పెట్టడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాపారులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులు వంట నూనెల ధరల విధానాల వల్ల ఎదురవుతున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 

 

Whats_app_banner