Onion Rates : టామాటా దారిలోనే ఉల్లి, సెప్టెంబర్ నాటికి గరిష్ఠ ధరలు!
Onion Rates : టమాటా మార్గంలో ఉల్లి పయనిస్తోందని తెలుస్తోంది. వచ్చే నెలకు ఉల్లి ధరలు గరిష్ఠానికి చేరతాని క్రిసిల్ నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ లో కిలో ఉల్లి ధరలు రూ.60-70 మధ్య ఉంటాయని తెలిపింది.
Onion Rates : టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డబుల్ సెంచరీ క్రాస్ చేసి ట్రిపుల్ సెంచరీ వైపు టమాటా దూసుకుపోతుంది. ఈ సమయంలో వినియోగదారుడికి మరో షాకింగ్ న్యూస్ చెప్పింది క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్. సెప్టెంబర్ నాటికి ఉల్లి ధరలు అమాంతం పెరిగి రూ.70 వరకు చేరొచ్చని బాంబ్ పేల్చింది. అయితే 2020 నాటి గరిష్ఠ ధరల కన్నా తక్కువ స్థాయిలో ఉల్లి ధరలు కొనసాగుతాయని తెలిపింది. సరఫరా-గిరాకీ మధ్య తేడాలతో ఆగస్టు చివరికి ఉల్లి ధరలు పెరుగుతాయని పేర్కొంది. రబీ ఉల్లి నిల్వలు ఆగస్టు చివరికి తగ్గుముఖం పట్టనున్నాయి. దీంతో సెప్టెంబరు నాటికి ఉల్లి సరఫరాలు తగ్గి ధరలు పెరుగుతాయని క్రిసిల్ తెలిపింది. అయితే అక్టోబరు నుంచి ఖరీఫ్ పంట దిగుబడి ప్రారంభం కావడంతో ఉల్లి ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని తన నివేదికలో స్పష్టం చేసింది.
2020 రేట్లకు దిగువనే
ఉల్లి ధరలు పెరుగుతాయని షాక్ ఇచ్చిన క్రిసిల్... 2020 నాటి గరిష్ట స్థాయి రూ. 200 కన్నా దిగువనే ఉల్లి రేటు ఉంటుందని స్పష్టం చేసింది. సాధారణంగా రబీ ఉల్లి స్టాక్ సెప్టెంబరు చివరి వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈసారి రబీ ఉల్లి నిల్వ 1-2 నెలలు తగ్గడంతో... ఫిబ్రవరి, మార్చి నెలల్లో అమ్మకాలు మొదలవ్వడంతో మార్కెట్‌లో రబీ ఉల్లి స్టాక్ బాగా తగ్గింది. దీంతో ఆగస్టు చివరి నాటికి ఉల్లి నిల్వలు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల ఆగస్టు చివరి నాటికి క్రమంగా రేట్లు పెరిగి సెప్టెంబర్‌లో గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు కూరగాయలు, పప్పులు, తృణధాన్యాల రేట్లు గరిష్ఠ ధరలు నమోదు చేశాయి. ఈ సమయంలో ఉల్లి ధరలు సాధారణంగా ఉన్నాయి. జనవరి నుంచి మే వరకు ఉల్లి తక్కువ ధరలలో లభ్యమయ్యాయి. టమాటా రేటు పెరగడం, ఉల్లికి రేటు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్ లో రైతులు ఉల్లిని తక్కువగా సాగు చేశారు. దీంతో సాగు విస్తీర్ణం కూడా 8 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొత్తం ఉత్పత్తి 29 మిలియన్ టన్నులకు చేరొచ్చని గణాంకాలు చెబుతున్నాయి.
తగ్గిన సాగు విస్తీర్ణం
అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఉల్లి, కూరగాయల ధరలు స్థిరంగా ఉండొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ధర లేనందున ఉల్లిని ఖరీఫ్ లో తక్కువగా సాగుచేశారు. దీంతో ఈ ఏడాది 8 శాతం మేర పంట విస్తీర్ణం తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. ఖరీఫ్ సీజనులో ఉల్లి ఉత్పత్తి ఐదు శాతం తగ్గడంతో.... వార్షిక ఉత్పత్తి 29 మిలియన్ టన్నులకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది గత అయిదేళ్ల సగటు కంటే ఇది 7 శాతం అధికమని క్రిసిల్ నివేదిక తెలిపింది. ఉల్లి సరఫరాపై అంతగా ప్రభావం పడకపోవచ్చు కానీ, ఆగస్టు, సెప్టెంబరులో వర్షపాతాన్ని బట్టి ఉల్లి ధరలు ఉంటుందని క్రిసిల్ పేర్కొంది.