Chittoor : చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ.. మంటల్లో ఒకరు సజీవ దహనం
Chittoor : చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మొగలి ఘాట్ రోడ్డు మళ్లీ నెత్తురోడింది. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు- చెన్నై జాతీయ రహదారిలో.. మొగలి ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో బుధవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు వి.కోట నుంచి తెలంగాణ భద్రాచలం వెళ్లాల్సిన యూకలిప్టస్ లోడ్ లారీ.. మొగలి ఘాట్ వద్ద ఇంజన్ పాడైపోవడంతో డ్రైవర్ పక్కన నిలిపేసి రిపేర్ చేస్తున్నాడు. అదే సమయంలో కర్ణాటకలోని హుబ్లీ నుంచి చిత్తూరు వైపు వస్తున్న షుగర్ లోడ్ లారీ.. వెనుక నుంచి అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. మరో రెండు నిమిషాల్లో షుగర్ లారీ గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. ఈ లోపే అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా కలప లారీలో మంటలు చెలరేగాయి.
కలప లోడు లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా.. క్లీనర్ గాయపడ్డాడు. అదే సమయంలో ఢీ కొట్టిన లారీ క్యాబిన్‌లో ఇరుకున్నపోయి క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్ గాయపడ్డాడు. స్థానికులు డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకు తీశారు. కలప లారీలో తీవ్రంగా గాయపడిన క్లీనర్‌తో పాటు, షుగర్ లారీ డ్రైవర్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్‌ల సహాయంతో మంటల్ని అదుపు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు.
విశాఖ జిల్లాలో..
విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై రోదిస్తున్నారు.
నక్కపల్లి మండలం ఉద్దండపురం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నక్కపల్లి మండలం గొడిచెర్లకు చెందిన కిల్లాడ నాగేశ్వరరావు (24), ఆవాల నవీన్ (18), దేవవరానికి చెందిన దమ్ము సీతయ్య ద్విచక్ర వాహనంపై బుధవారం రాత్రి వేంపాడ వద్ద ఓ దాబాలో టిఫిన్ చేసేందుకు వెళ్లారు.
టిఫిన్ చేసి.. కాసేపు మాట్లాడుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. నక్కపల్లి మండలంలోనే ఉద్దండపురం గ్రామానికి సమీపానికి చేరుకోగానే జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నుజ్జునుజ్జు అయింది. నాగేశ్వరరావు, నవీన్ అక్కడికక్కడే చనిపోయారు. సీతయ్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే నక్కపల్లి సీఐ కె.కుమారస్వామి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రుడు దమ్ము సీతయ్యను వైద్యం నిమిత్తం జాతీయ రహదారి (హైవే) అంబులెన్స్‌లో తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నాగేశ్వరరావు, నవీన్‌ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు రోధనలు అందరినీ కంటతడి పెట్టించింది. యువకుల మృతితో గొడిచెర్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.కుమారస్వామి తెలిపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)