Singanamala Politics: పేరుకే రిజర్వుడు అభ్యర్థులు.. అక్కడ పెత్తనమంతా ఆ కులాలదే…! శింగనమలలో అంతే..-candidates are reserved by caste but no powers in shinganamala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Singanamala Politics: పేరుకే రిజర్వుడు అభ్యర్థులు.. అక్కడ పెత్తనమంతా ఆ కులాలదే…! శింగనమలలో అంతే..

Singanamala Politics: పేరుకే రిజర్వుడు అభ్యర్థులు.. అక్కడ పెత్తనమంతా ఆ కులాలదే…! శింగనమలలో అంతే..

Sarath chandra.B HT Telugu
Feb 16, 2024 11:30 AM IST

Singanamala Politics: రాయలసీమలోని అనంతపురం జిల్లా శింగనమల రిజర్వుడు నియోజక వర్గాల్లో ఒకటి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అక్కడ అభ్యర్థి ‎ఎవరైనా పెత్తందారుల చెప్పు చేతల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీల్లో ఇదే రకమైన పరిస్థితి ఉంది.

శింగనమలలో రాజకీయాలు అంతేనా
శింగనమలలో రాజకీయాలు అంతేనా

Singanamala Politics: శింగనమల రాజకీయాలు ఎన్నికల నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. రిజర్వుడు నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలను పేరుకు పరిమితం చేసి స్థానిక పెత్తందారులు పెత్తనం చెలాయించడం ఇక్కడ సాధారణ అయిపోయింది.

yearly horoscope entry point

20219 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ Jonnalagadda పద్మావతి శింగనమల ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అభ్యర్ధి బండారు శ్రావణిపై 46,242ఓట్ల మెజార్టీ సాధించారు. 2014లో కూడా పద్మావతి పోటీ చేసినా టీడీపీ అభ్యర్ధి యామినీ బాల చేతిలో ఓడిపోయారు.

రిజర్వుడు ఎమ్మెల్యే… భర్తదే పెత్తనం…

వైసీపీ తరపున గెలిచిన జొన్నలగడ్డ పద్మావతి ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమె భర్త ఆలూరి Aluri సాంబశివారెడ్డి వైసీపీలో కీలకంగా వ్యవహరించారు.పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ కమిటీ కీలక బాధ్యతలు అప్పగించారు.

ఇటీవల సమన్వయకర్తల మార్పులు చేర్పుల్లో భాగంగా సింగనమలలో అభ్యర్ధి మార్పు ఖాయమని సిఎం జగన్మోహన్ రెడ్డి YS Jagan స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే పద్మావతి తనను స్థానిక నేతలు ఇబ్బంది పెట్టారంటూ వీడియో విడుదల చేశారు. స్థానికంగా తనను అసలు పని చేసుకోనివ్వలేదని వాపోయారు.

దళితురాలిని కాబట్టే తనను అవమానించారంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత రెండ్రోజులకు తన వ్యాఖ్యలను వక్రీకరించారని మరో ప్రకటన విడుదల చేశారు. పద్మావతి ఎన్ని ప్రయత్నాలు చేసినా నియోజక వర్గంలో అభ్యర్థి మార్పు ఖాయమని తేలిన తర్వాత స్థానికంగా పెత్తనం చెలాయించే ఎమ్మెల్యే భర్త మరో అభ్యర్ధిని ప్రతిపాదించారని ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యే భర్త అనుచరుడికి బాధ్యతలు…

స్థానికంగా ఇసుక క్వారీల్లో గుమస్తాగా పనిచేసే ఆంజనేయులు అనే వ్యక్తిని రానున్న ఎన్నికల్లో శింగనమల అభ్యర్ధిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నియోజక వర్గంలో పట్టు జారిపోకుండా ఉండటానికి తన వద్ద పనిచేసే వ్యక్తికి సిట్టింగ్ ఎమ్మెల్యే భర్త.. తాజాగా సమన్వయకర్త పదవి ఇప్పించినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు రిజర్వుడు నియోజక వర్గం కావడంతో రెండు ప్రధాన సామాజిక వర్గాల Caste Equations మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లలో దాదాపు 13శాతం ఎస్సీ మాదిగ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. మాలలు రెండు శాతంలోపే ఉన్నారు. 2019లో మాల సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించడంతో మాదిగ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

దీంతో ఈ సారి ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలని సిఎం జగన్ భావించారు. అభ్యర్థి మార్పు సమయంలో కూడా ఆలూరి సాంబశివరెడ్డి చక్రం తిప్పడంతో పార్టీ క్యాడర్ గుర్రుగా ఉంది. తన చెప్పు చేతల్లో ఉంటూ, ఇసుక క్వారీలో గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తిని అభ్యర్ధిగా తెచ్చుకోవడంపై రగలిపోతున్నారు. ఇన్నేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని అధికారం తమ చేయి దాటిపోకుండా జాగ్రత్త పడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

టీడీపీలో కూడా అదే పరిస్థితి....

టీడీపీలో 2019లో బండారు శ్రావణి శింగనమలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆమె పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శింగనమలలో పార్టీ సమన్వయం కోసం ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.

నియోజక వర్గంలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన నర్సా నాయుడు, కేశవరెడ్డిలకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. వారిద్దరు బండారు శ్రావణికి వ్యతిరేకంగా జట్టు కట్టడంతో ఆమె ఒంటరి పోరాటం చేస్తోంది.

కొద్ది రోజుల క్రితం సొంత మండలంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించడంపై కూడా పార్టీకి తెలియకుండా కార్యక్రమాలు నిర్వహిస్తోందని బండారు శ్రావణిపై ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో స్థానిక దళిత నాయకుడు కంభగిరి రాములు తనకు అవకాశం కల్పించాలంటూ చంద్రబాబును కలిశారు. టీడీపీ ద్విసభ్య కమిటీ శ్రావణతో కలిసి పనిచేసేది లేదని చెప్పడంతో స్థానికంగా తలోదారి అయ్యారు.

శైలజానాధ్‌ వస్తారనుకుని....

మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో శైలజానాథ్ వెనక్కి తగ్గారు.

బాబు జైల్లో ఉన్న సమయంలో రాజమండ్రిలో భువనేశ్వరిని సైతం పరామర్శించారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించడంతో శైలజానాథ్ సైలంట్ అయ్యారు.

టీడీపీ కూడా ఆయన గురించి పట్టించుకోవడం మానేసింది. 1978 నుంచి రిజర్వుడు నియోజక వర్గంగా ఉన్న శింగనమలలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల్లో నెలకొన్న పరిస్థితుల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner