Sake Sailajanath: పాపం శైలజానాథ్‌, ఎటూ తోచని స్థితిలో మాజీ మంత్రి-many former ministers in ap have not been able to digest the latest political developments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sake Sailajanath: పాపం శైలజానాథ్‌, ఎటూ తోచని స్థితిలో మాజీ మంత్రి

Sake Sailajanath: పాపం శైలజానాథ్‌, ఎటూ తోచని స్థితిలో మాజీ మంత్రి

HT Telugu Desk HT Telugu
Sep 25, 2023 06:28 AM IST

Sake Sailajanath: మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌ రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆయన అంచనాలన్నీ తలకిందులై పోవడంతో మరికొన్ని రోజులు ఎదురు చూడాలనే భావనకొచ్చేశారు.

మాజీ మంత్రి శైలజానాథ్‌
మాజీ మంత్రి శైలజానాథ్‌

Sake Sailajanath: రాష్ట్ర విభజన తర్వాత ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన చాలామంది నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది. ఈ కోవలో అన్ని స్థాయిల నాయకులు ఉన్నారు. మాజీ మంత్రులు కూడా ఉన్నారు. పార్టీలు మారిన వారి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా, ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేకుండా ఉన్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

yearly horoscope entry point

ఏపీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. శైలజా నాథ్‌ కొంత కాలంగా ఏదొక ప్రత్యామ్నయం చూసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటంతో మళ్లీ యాక్టివ్‌ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రఘువీరా రెడ్డి తర్వాత ఏపీ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా నిర్వహించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటం, బలమైన నాయకులు ఎవరు పార్టీలో మిగలకపోవడంతో శైలజానాథ్ కూడా తన దారి తాను చూసుకోవాలని భావించారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో రెండుసార్లు శైలజా నాథ్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో వైఎస్‌ క్యాబినెట్‌లో మంత్రి పదవి కూడా దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు.

శైలజానాథ్‌ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా గ్రౌండ్‌ ప్రిపేర్ చేసుకుంటున్న సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది. రెండువారాలు చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో గత వారం శైలజానాథ్‌ చంద్రబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజమండ్రి వచ్చారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో మాట్లాడిన తర్వాత శైలజానాథ్‌ ఆలోచనలు మారిపోయినట్లు తెలుస్తోంది.

రాజమండ్రి వెళ్లి మరీ చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన తర్వాత శైలజానాథ్‌కు తత్వం బోధపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో తాను అందులో చేరడంపై శైలజానాథ్ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. చంద్రబాబు జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియకపోవడం, ఏపీలో రాజకీయంగా నెలకొన్ని ఉన్న పరిస్థితుల మధ్య టీడీపీలోకి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయాన్ని శైలజానాథ్‌ సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. మరికొన్ని రోజుల పాటు ఎదురు చూడటం తప్ప చేయగలిగిందేమి లేదని తేల్చేశారు.

ప్రస్తుతం టీడీపీని ముందుండి నడిపించే నాయకత్వం లేకపోవడం, చంద్రబాబు కుటుంబ సభ్యులకు, ప్రధానంగా ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిలు పార్టీని ముందుండి నడిపించే పరిస్థితులు లేకపోవడంతో డైలామాలో పడ్డట్టు తెలుస్తోంది. శైలజానాథ్‌.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని పరామర‌్శించే క్రమంలో మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించడంతో ఆయన ఖంగుతిన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు బయటకు వచ్చే వరకు పార్టీలో ఇలాంటి పరిస్థితులు తప్పవని టీడీపీలోకి వెళ్లాలనుకున్న శైలజానాథ్‌ వంటి నేతలు భావిస్తున్నారు.

Whats_app_banner