Ysrcp : వైసీపీ ఇన్ ఛార్జుల తుది జాబితాపై సీఎం జగన్ కసరత్తు-శింగనమల ఎమ్మెల్యే వీడియోపై ఆగ్రహం
Ysrcp : వైసీపీలో అసమ్మతి స్వరాలు పెరుగుతుండడంతో... వాటిని కట్టడి చేస్తూ తుది జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అసమ్మతి నేతలను తాడేపల్లికి పిలిచి మాట్లాడుతున్నారు. ఫేస్ బుక్ లైవ్ లో పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసిన శింగనమల ఎమ్మెల్యేకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది.
Ysrcp : వైసీపీలో ఇన్ ఛార్జ్ ల రగడ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు జాబితాల్లో 38 మందిని ఇన్ ఛార్జ్ లను వైసీపీ అధిష్టానం నియమించింది. ఇందులో కొందరి ఎమ్మెల్యేలకు స్థానచలనం, వారసులకు టికెట్లు, ఎంపీలకు అసెంబ్లీ బాధ్యతలు... ఇలా మార్పుచేర్పులు చేసింది వైసీపీ. అయితే ఇన్ ఛార్జ్ ల మార్పులతో వైసీపీ ఎమ్మెల్యేలు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నిన్న శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఆమెకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఎమ్మెల్యే పద్మావతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్... వీడియోపై వివరణ ఇవ్వాలని కోరారు.
ఎమ్మెల్యే పద్మావతికి తాడేపల్లి నుంచి పిలుపు
శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ అధిష్టానంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో ఆమెను వెంటనే తాడేపల్లి రావాలని సీఎంవో అధికారులు సూచించారు. దీంతో ఎమ్మె్ల్యే మంగళవారం తాడేపల్లి క్యాంపు ఆఫీసుకు వచ్చారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసిన అనంతరం ఆమె సీఎం జగన్‌ను కలవనున్నారు. మరోవైపు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా సీఎం జగన్ ను కలవనున్నారు. సీట్ల మార్పుచేర్పుల విషయంపై సీఎం జగన్‌తో చర్చించనున్నారు.
శింగనమల ఎమ్మెల్యే ఏమన్నారంటే?
వైసీపీలో టికెట్ల రగడ జరుగుతోంది. అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అధిష్టానంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫేస్ బుక్ లైవ్ ద్వారా పార్టీలో తన పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి రావాల్సిన నీటి కోసం యుద్ధం చేయాల్సి వస్తోందని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. తమ నియోజకవర్గంలో ఏనాడు నీటి సమస్యను పరిష్కరించలేదని, 2024 ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలని నిలదీశారు. ఎస్సీలకే ఎందుకు అన్యాయం జరుగుతోందని, ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని ఉండాలా అని ప్రశ్నించారు. చేతులు కట్టుకుని నిలబడితేనే నిధులు విడుదల చేస్తారా? అని ప్రశ్నించారు. తన నియోజక వర్గంలో రెడ్డి సామాజికవర్గం ఓట్లు వేస్తే మాత్రమే తాను ఎమ్మెల్యే కాలేదని చెప్పారు. కులమతాలకు అతీతంగా శింగనమల ప్రజలు గెలిపించారని, తాను మాట తప్పను.. మడమ తిప్పనన్న సీఎం జగన్… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే నడుస్తున్నారని ఆరోపించారు.
తుది జాబితాపై సీఎం జగన్ కసరత్తు
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ల మార్పు తుది జాబితాపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువులు ఎమ్మెల్యేలు, ఎంపీలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వీరితో సీఎం జగన్ స్వయంగా మాట్లాడుతున్నారు. అమలాపురం ఎంపీ చింత అనురాధ, చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, ఎంపీ గోరంట్ల మాధవ్ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మంత్రి బొత్స సత్య నారాయణ కూడా తన సతీమణి బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి తాడేపల్లి క్యాంపు ఆఫీసుకి వచ్చారు. డోన్ నుంచి పోటీ చేసేందుకు మంత్రి బుగ్గన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు.