YSRCP : వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో మరో కీలక నేత.. ఆ నియోజకవర్గంలో దిక్కెవరు?-bhimavaram former mla grandhi srinivas is likely to resign from ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp : వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో మరో కీలక నేత.. ఆ నియోజకవర్గంలో దిక్కెవరు?

YSRCP : వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో మరో కీలక నేత.. ఆ నియోజకవర్గంలో దిక్కెవరు?

Basani Shiva Kumar HT Telugu
Sep 21, 2024 04:35 PM IST

YSRCP : వైసీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను వైసీపీకి రాంరాం చెప్పగా.. తాజాగా మరో నేత పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ నియోజవర్గంలో పార్టీకి దిక్కెవరు అనే చర్చ జరుగుతోంది.

ఎన్నికల ప్రచార సభలో జగన్‌తో గ్రంధి శ్రీనివాస్
ఎన్నికల ప్రచార సభలో జగన్‌తో గ్రంధి శ్రీనివాస్

గ్రంధి శ్రీనివాస్.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేత. అందుకు కారణం 2019 ఎన్నికల్లో ఆయన పవన్ కళ్యాణ్‌పై గెలవడమే. అలాంటి నేత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. బయట ఎక్కడా కనిపించడం లేదు. అటు పార్టీలోనూ యాక్టివ్‌గా లేరనే టాక్ ఉంది. దీంతో గ్రంధి శ్రీనివాస్ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తే.. భీమవరం నియోజకవర్గంలో పార్టీకి దిక్కెవరు అనే చర్చ నడుస్తోంది.

గ్రంధి అసంతృప్తి..

గ్రంధి శ్రీనివాస్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పుడే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా శ్రీనివాస్ అసంతృప్తితో రగిలిపోయారని చెబుతున్నారు. అందుకు కారణం మంత్రి పదవేనట. పవన్ కళ్యాణ్‌పై గెలిచిన తనకు మంత్రి పదవి ఇస్తారని గ్రంధి శ్రీనివాస్ ఆశించారు. కానీ.. రాలేదు. రెండో దఫా అయినా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అప్పుడు కూడా రాలేదు. దీంతో ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వెళ్లగక్కినట్టు తెలిసింది.

'ఇంత డబ్బు, సమయం ఖర్చు చేసి పవన్ కళ్యాణ్‌పై గెలిచాను. నాకే మంత్రి పదవి ఇవ్వలేదు. కనీసం పార్టీలో గౌరవం లేకుండా పోయింది. నా మాట కొందరు అధికారులు వినడం లేదని చెప్పాను. వారిని కూడా మార్చలేదు. భీమవరం వైసీపీలో వేరే ప్రాంతాల వారి పెత్తనం పెరిగిపోయింది. ఎవ్వరి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీలో ఉండటం అవసరమా' అని గ్రంధి శ్రీనివాస్ 2024 అసెంబ్లీ ఎన్నికల ముందే తన సన్నిహితులతో అన్నట్టు తెలిసింది.

పార్టీలోని కీలక నేతలు గ్రంధికి సర్ధిచెప్పి 2024 ఎన్నికల్లో నిలబెట్టారు. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి గ్రంధి ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇటీవల జగన్ పశ్చిమగోదావరి జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి కూడా గ్రంధి శ్రీనివాస్ రాలేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది. అటు క్యాడర్‌కు అందుబాటులో ఉండటం లేదనే టాక్ నడుస్తోంది.

టీడీపీలో చేరే అవకాశం..

ఒకవేళ గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేస్తే.. ఏ పార్టీలో చేరతారనే చర్చ కూడా జరుగుతోంది. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు గ్రంధీ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశం లేదని తెలుస్తోంది. ఆయన వెళ్దామని ట్రై చేసినా.. జనసైనికులు సపోర్ట్ చేసే అవకాశం లేదు. దీంతో గ్రంధి సైకిల్ ఎక్కుదామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ కూడా వీలుకాకపోతే.. బీజేపీలో చేరే అవకాశం అందని ఆయన ఫాలోవర్స్ కొందరు చెబుతున్నారు.

Whats_app_banner