Pension Accounts Freeze: పెన్షన్లపై ఐటీ పిడుగు.. స్తంభించిన బ్యాంకు ఖాతాలు…
Pension Accounts Freeze: సాంకేతిక సమస్యలతో సర్వీస్ పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు భారీగా స్తంభించిపోయాయి. ఆధార్ - పాన్ లింకింగ్‌తో పాటు ఇతర సాంకేతిక కారణాలతో ఖాతాలు నిలిపివేయడంతో పెన్షనర్లు లబోదిబో మంటున్నారు.
Pension Accounts Freeze: సర్వీస్ పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు రకరకాల కారణాలతో ఐటీ శాఖ నిలిపివేయడంతో లబోదిబో మంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పెన్షన్లను తీసుకోడానికి బ్యాంకు శాఖలకు వెళ్లిన వారికి సిబ్బంది చావు కబురు చల్లగా చెబుతున్నారు. పెన్షనర్ల ఖాతాలను స్తంభింప చేయడంతో పాటు ఏటిఎం కార్డులు సహా అన్ని రకాల యూపిఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్ని నిలిపి వేశారు.
ఆధార్ లింకింగ్ అసలు సమస్య
పాన్ కార్డుల్ని ఆధార్ కార్డులతో లింక్ చేయడానికి గడువు 2022లోనే ముగిసింది. ఆ తర్వాత పాన్ కార్డుల్ని లింక్ చేయని వారికి గత ఏడాది మార్చిలో ఐటీఆర్ ఫైలింగ్‌కు అనుమతించ లేదు. ఆధార్ లింక్ తప్పని సరి చేయడంతో గత ఏడాది ఐటీ రిటర్నులు ఫైల్ చేసే సమయంలో చాలా మంది జరిమానాలు కట్టి ఆధార్ లింక్ చేశారు.
గత ఏడాది వెయ్యి రుపాయలు జరిమానా చెల్లించిన తర్వాతే ఐటీఆర్ ఫైలింగ్‌కు అనుమతించారు. ఈ మేరకు ఆధార్-పాన్ లింక్ జరిగిన తర్వాతే ఫైలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశారు. గడువులోగా లింక్ చేయని ఖాతాలను స్తంభింప చేస్తామని చెబుతున్నా చాలామంది లింక్ చేయలేకపోయారు. దీనికి రకరకాల సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.
గతంలో బ్యాంకు ఖాతాల నిర్వహణకు గుర్తింపు పొందిన ఏదొక ప్రభుత్వ ధృవీకరణ పత్రాన్ని అనుమతించేవారు. ఇప్పుడు కేవలం ఆధార్ కార్డును మాత్రమే ప్రమాణికంగా తీసుకుంటున్నారు. ఆధార్ లేకుంటే ఆధార్‌తో అనుసంధానించిన పాన్ కార్డును అనుమతిస్తున్నారు.
ప్రభుత్వం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకున్న ఈ రకమైన నిర్ణయంతో సర్వీస్ పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన స్త్రీలకు ప్రధానంగా ఈ రకమైన సమస్య ఎదురవుతోంది. భర్త కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగం చేసి ఉంటే డిపెండెంట్ పెన్షన్‌కు కూడా ఆమె అర్హురాలు అవుతుంది.
అదే సమయంలో సదరు మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయితే సర్వీస్ పెన్షన్‌కు అర్హత పొందుతారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ ద్వారా జారీ చేసే సర్వీస్ పెన్షన్లను ఇప్పటి వరకు ఒకే బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెన్షన్లను వారి ఆప్షన్ బట్టి బ్యాంకుల్లో జమ చేస్తున్నారు.
సర్వీస్ పెన్షన్ పేర్లతో తిప్పలు…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసిన పురుషుడు మరణిస్తే వారి పెన్షన్ భార్యకు అందుతుంది. ఈ క్రమంలో ఉద్యోగి ఇంటి పేరునే పెన్షనర్‌కు వర్తింప చేస్తారు. అదే సమయంలో సదరు మహిళ కూడా ఉద్యోగి అయ్యుంటే ఆమె సర్వీస్ రికార్డుల్లో విద్యార్హతల్లో ఉన్న పేర్లే సర్వీస్ రికార్డుల్లో కూడా కొనసాగుతున్నాయి.
ఆధార్ కార్డులో ఉన్న పేరును మాత్రమే ప్రమాణికంగా తీసుకుని పాన్ లింక్ చేస్తే ఏదో ఒక ఖాతాను నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. రెండు ఖాతాలను ఒకే పేరుకు మార్చాలంటే స్తిరాస్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తున్నాయి. భర్త నుంచి సంక్రమించిన ఆస్తులలో కొనసాగే ఇంటి పేర్లు, మహిళల పుట్టింటి పేర్లతో సరిపోలడం లేదు.
బ్యాంకుల్లో రగడ….
మరోవైపు జనవరి నెలాఖర్లో జమ చేసిన పెన్షన్లలో చాలామందికి భారీగా ఆదాయ పన్ను కోతలు విధించారు. గతంలో ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం, పాన్ కార్డుల్ని ఆధార్ లింక్ చేయక పోవడం వంటి కారణాలతో ఖాతాల్లో లావాదేవీలు చేయకుండా చేశారు. ఇక ఆధార్‌లో ఉన్నపేరుతో బ్యాంకు ఖాతాలు సరిపోలని వారు పేరు మార్చుకోడానికి అవసరమైన ధృవీకరణలు లేకపోవడంతో మరికొంత మంది ఇబ్బంది పడుతున్నారు.
వృద్ధాప్యంలో పెన్షన్లపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల ఇంటి పేర్ల విషయంలో ఐటీ శాఖ సరైన మార్గదర్శకాలు జారీ చేయకుండా ఇబ్బందులకు గురి చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బ్యాంకుల్లో సిబ్బంది మాత్రం తాము చేయగలిగిందేమి లేదని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలని సర్దిచెబుతున్నారు.