టార్గెట్ ద్వారంపూడి...! కాకినాడలో తొలి పర్యటనలు అందుకేనా...?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో పాటు జనసేన నుంచి మంత్రిగా ఉన్న నాదెండ్ల తొలి పర్యటనలు కాకినాడలోనే చేశారు. వీరిద్దరి రివ్యూలు ఇక్కడ్నుంచే షురూ కావటం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాకినాడ జిల్లాల్లో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తల నోట ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరే వినబడుతుంది. గత ప్రభుత్వం హయాంలో ఆయన డైరెక్షన్ లో జరిగిన వ్యవహారాలన్నింటిపై ఫోకస్ పెట్టేస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.
గత ప్రభుత్వ హయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్‌కు చేతనైతే కాకినాడ సిటీలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. అంతే కాకుండా పవన్‌కళ్యాణ్‌పై వ్యక్తిగతంగా విమర్శలు చేశారు.
దీంతో జనసేనకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య వైరం పెరిగింది. పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసం ఎదుట ఆందోళనకు యత్నించిన జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలపై ఆయన అనుచరులు దాడి చేశారు. దీంతో అప్పట్లో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వివిధ సభల్లో ద్వారంపూడిపై జనసేననాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చీడపురుగు మదమెక్కి మాటలాడుతోందంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. దీనికి ద్వారంపూడి కూడా స్పందించి… అదే రీతిలో కౌంటర్ ఇచ్చేవారు. ఇలా ఎన్నికల వరకు ఈ తంతు కొనసాగింది.
అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టును అడ్డా పెట్టుకొని ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. కాకినాడలో ఆయన అనుచరుల రౌడీయిజం, కబ్జాలు వంటి ఆరోపణలు అనేకం ఉన్నాయి. జిల్లాల్లో మొత్తం ఆయన పెత్తనమే ఉండేది. కలెక్టర్, ఎస్పీ నుంచి అందరు అధికారులు ఆయన చెప్పుచేతుల్లోనే ఉండేవారన్న టాక్ ఉండేది.
తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ కాకినాడలో జరిగిన వ్యవహారాల్లో తలదూర్చేవారు కాదు. అందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే కారణంగా చెబుతుంటారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కూరసాల కన్నబాబు మంత్రిగా ఉండి, కాకినాడ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆయన జోక్యాన్ని చంద్రశేఖర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య కూడా కొంత కాలం జగడం నడిచింది. మళ్లీ జగన్మోహన్ రెడ్డి జోక్యంతో అది సమిసిపోయింది.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి బాస్కర్ రెడ్డి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్‌గానూ, తమ్ముడు వీరభద్రరెడ్డి రాష్ట్ర రైసు మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో అక్రమ బియ్యం తరలింపు చంద్రశేఖర్ రెడ్డి సులువుగా చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచింది. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఓటమి చెందారు. దీంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లెక్కలు తీసే పని షురూ అయిందన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న తరువాత తొలి పర్యటన కాకినాడలోనే చేశారు. మూడు రోజుల పాటు ఆయన కాకినాడ సిటీ, పిఠాపురంలోనే పర్యటించారు. చంద్రశేఖర్ రెడ్డి చిట్టా మొత్తం తీశారు.
అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా తొలి పర్యటన కాకినాడలోనే చేశారు. అంతకు ముందు కృష్ణా జిల్లాలో అడపదడపా చేసినా… రెండు రోజుల పాటు సుధీర్ఘంగా పర్యటించింది మాత్రం కాకినాడలోనే..! నాదెండ్ల మనోహర్ రెండు రోజుల పాటు కాకినాడ సిటీలో పర్యటించి ద్వారంపూడి చంద్రశేఖర్ లెక్కలతో పాటు మరికొన్ని అంశాలపై ఆరా తీశారు. దీంతో ద్వారంపూడే వ్యవహారాలను బయటికి తీయటంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి లెక్కలను బయటికి తీయటమే టార్గెట్ అని స్పష్టం అయింది.
తన పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ…. పేదలకు అందాల్సిన బియ్యం విదేశాలకు తరలించారని వ్యాఖ్యానించారు. కాకినాడలో విశ్వప్రియ ఎక్స్‌పోర్ట్స్ గోడన్‌లో అక్రమంగా నిల్వ చేసిన 4,700 టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేయించారు. దీంతో ద్వారంపూడిని జైలుకు పంపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని జిల్లాలో చర్చ జరుగుతుంది. జనసైనికులు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అన్న మాట నిలబెట్టుకున్నారని తెగ పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా ఎన్నికల తర్వాత కూడా కాకినాడ రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి…!