APSRTC Special Services : శబరిమలకు ప్ర‌త్యేక బ‌స్సులు - ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీలు-apsrtc special buses from visakhapatnam to sabarimala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Special Services : శబరిమలకు ప్ర‌త్యేక బ‌స్సులు - ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీలు

APSRTC Special Services : శబరిమలకు ప్ర‌త్యేక బ‌స్సులు - ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీలు

HT Telugu Desk HT Telugu
Oct 16, 2024 10:21 AM IST

అయ్య‌ప్ప స్వామి భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. శ‌బ‌రిమ‌ల‌కు ప్ర‌త్యేక బ‌స్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు ర‌కాల ప్యాకేజీల‌ను నిర్ణ‌యించింది. ఇందులో ఇంద్ర‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ, అల్ట్రా డీల‌క్స్ బ‌స్సుల‌ు ఉన్నాయి. వాటి వివరాలను ఇక్కడ చూడండి…

శబరిమలకు ప్ర‌త్యేక బ‌స్సులు
శబరిమలకు ప్ర‌త్యేక బ‌స్సులు

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. విశాఖపట్నం రీజియన్ విశాఖపట్నం నుండి శబరిమల వరకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను నిర్వహిస్తుంది. ప్ర‌తి ఏడాది విశాఖ‌ప‌ట్నం నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు శ‌బ‌రిమ‌ల‌కు వేస్తున్నారు.

ఈ ఏడాది కూడా శబరిమలకు ప్రత్యేక 5, 6, 7 రోజుల టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఆయా ప్యాకేజీల‌ను బ‌ట్టీ బ‌స్సులు ప్ర‌యాణించే మార్గంలో ఉన్న ఆలయాల కవరేజీలో వ్యత్యాసం ఉంటుంది. భక్తులు సందర్శించడానికి ఎంచుకున్న దేవాలయాల ఆధారంగా వారి అవసరాలను తీర్చడానికి ఈ యాత్రలు చేప‌డుతున్నారు.

ప్యాకేజీలివే….

  • ఐదు రోజుల ప్యాకేజీలో విజయవాడ, మేల్మరువాటూరు, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడలను కవర్ చేస్తుంది. ఒక్కొక్క‌రి టిక్కెట్ ధ‌ర రూ.6,600 (సూపర్ లగ్జరీ), రూ. 6,600 (అల్ట్రా డీలక్స్), రూ.8,500 (ఇంద్ర) ఉంటుంది.
  • ఆరు రోజుల ప్యాకేజీలో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. తిరిగి ప్ర‌యాణంలో తిరుపతి, శ్రీ కాళహస్తి, విజయవాడ, అన్నవరం ఆలయాలలో దర్శనం లభిస్తుంది. ఒక్కొక్క‌రి టిక్కెట్ ధ‌ర రూ. 7,000 (సూపర్ లగ్జరీ), రూ. 7,000 (అల్ట్రా డీలక్స్), రూ. 9,000 (ఇంద్ర) ఉంటుంది.
  • ఏడు రోజుల ప్యాకేజీలో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. తిరిగి ప్ర‌యాణంలో మదురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీ కాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరంలలో దర్శనం చేసుకోవచ్చు. ఒక్కొక్క‌రి టిక్కెట్ ధ‌ర రూ. 7,600 (సూపర్ లగ్జరీ), రూ.7,600 (అల్ట్రా డీలక్స్), రూ.10,000 (ఇంద్ర)గా నిర్ణయించబడింది.
  • వివరాలకు మొబైల్ నంబర్లు: 9052227083, విశాఖపట్నం డిపో మేనేజర్ 9959225594, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, ద్వారకా బస్ స్టేషన్, వైజాగ్ 9100109731, కోఆర్డినేటర్ పీవీఎన్‌ రావు 7382914219ల‌ను సంప్ర‌దించాలి.

అయ్యప్ప భక్తులకు సేవలందించడంలో అనుభవం ఉన్న, రూట్ తెలిసిన నిష్ణాతులైన డ్రైవర్లు బస్సులను నడుపుతారు. విశాఖపట్నం ప్రాంతం నుంచే కాకుండా పొరుగున ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోని నౌరంగ్‌పూర్, కోరాపుట్, జైపూర్ నుంచి కూడా భక్తులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించినట్లు విశాఖ‌ప‌ట్నం ప్ర‌జా ర‌వాణా అధికారి అప్ప‌ల‌రాజు తెలిపారు. 2003 నుండి ఆర్టీసీ విశాఖపట్నం రీజియన్ ద్వారా నిర్వహించబడుతున్న శబరిమల ప్రత్యేక బస్సులు చాలా మంచి ఆదరణ పొందుతున్నాయి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner