AP Pensioners Problems: జూన్ నెలలో కూడా బ్యాంకు ఖాతాల్లోనే సంక్షేమ పెన్షన్లు, వృద్ధులకు తప్పని ఇబ్బందులు
AP Pensioners Problems: రాష్ట్రంలో వృద్ధులకు ఈసారీ కూడా తిప్పలు తప్పేట్టు లేదు. సంక్షేమ పథకాల పెన్షన్ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లోనే వేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. దీంతో ముసలివాళ్లు ఇక బ్యాంకుల చుట్టు ప్రదక్షిణాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
AP Pensioners Problems: ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇంటింటి పెన్షన్ పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేసింది. పెన్షన్ సొమ్ము కోసం మెజార్టీ పెన్షనర్లు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో కొంత మంది వడదెబ్బ సొమ్మసిల్లి పడిపోగా, మరికొంత మంది ఏకంగా మృత్యువు చేతులోకి వెళ్తున్నారు. ఇదీ రాష్ట్రంలో పెన్షనర్ల పరిస్థితి.
పెన్షన్ నగదును సొంత అవసరాలు, వైద్య ఖర్చులు, మెడిసిన్ కు ఎక్కువ శాతం వృద్ధులు వినియోగిస్తారు. ఆ నెల పెన్షన్ డబ్బులు అయిపోతే, మళ్లీ వచ్చే నెల పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువు ఎదురుచూస్తారు. పెన్షన్ నగదును తీసుకొని వారివారి అవసరాలను తీర్చుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక, వలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి పెన్షన్ నగదు ఇంటికే పంపుతున్నారు. తెల్లారిన వెంటనే వాలంటీర్లు పెన్షన్ నగదును ఇంటి తెచ్చి లబ్ధిదారులకు ఇస్తున్నారు.
కానీ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ నిలిపివేయాలని ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసి, పంపిణీని నిలిపి వేశారు. దీనిపై రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు జరిగాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.
అయితే ఏదీఏమైనా ఇంటింటికీ పెన్షన్ పంపిణీ నిలిపివేయడంతో పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రభుత్వం బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ నగదును జమ చేసింది. దీంతో వృద్దులు, వికలాంగులు ఎదుర్కొన్న ఇక్కట్లకు అంతులేదు.
ఎప్పుడూ నెల మొదటి రోజునే పెన్షన్ పంపిణీ జరిగేది. అయితే ఏప్రిల్ నెల నుంచి వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ నిలిపివేశారు. ఆ నెలలో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 నుంచి 6 వరకు పెన్షన్ పంపిణీ జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ పెన్షన్ పంపిణీ ఆశించినట్లు జరగలేదు. అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. దీంతో ఏప్రిల్ నెలలో తలెత్తిన సమస్యల వల్ల మే నెలలో పెన్షన్ నగదును బ్యాంక్ ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. అయితే బ్యాంకు ఖాతాల్లో జమ అయిన నగదును తీసుకోవడానికి వృద్దులు, వికలాంగులు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కాదు. క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంత మంది లబ్ధిదారులకు విచిత్రమైన సమస్యను ఎదుర్కొన్నారు. ఎప్పుడో ఏళ్ల కింద ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్లు మైనస్ లోకి వెళ్లడంతో, పెన్షన్ నగదు ఖాతాల్లో పడిపడగానే నదగు కట్ అయింది. దీంతో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ ఏడు వందలు, ఎనిమిది వందలే అందిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
మెజార్టీ బ్యాంకులకు వెళ్లాల్సిందే…
రాష్ట్రంలో మొత్తం 65.49 లక్షల మంది పెన్షన్ దారులు ఉన్నారు. వీరులో 63.31 లక్షల మందికి బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేస్తారు. 74,399 మందికి మాత్రం ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాల్సిందే. వారంతా నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఇంటికి వెళ్లే ఇవ్వడం తప్పమరో మార్గం లేదు. అయితే ఈ కేటగిరీలోకి వచ్చే వారిని గుర్తించడంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదు. చాలా మంది మంచానికే పరిమితమైన వృద్ధులను ఈ కేటగిరీ కింద గుర్తించలేదు. దీంతో మంచానికి పరిమితమైన అనేక మంది వృద్ధులను ఆటో కట్టించుకొని బ్యాంకులకు తీసుకెళ్లిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
అయితే పెన్షన్ తీసుకోవడానికి బ్యాంకుల 40 డిగ్రీల ఎండలో చుట్టు తిరగడంతో దాదాపు 50 మంది వృద్ధులు చనిపోయారు. ఇటీవలి టీడీపీ రాజ్యసభ మాజీ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసి రాష్ట్రంలో పెన్షన్ కోసం వెళ్లిన వృద్ధులు దాదాపు 50 మంది చనిపోయారని, వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా జూన్ నెల పెన్షన్ 1 తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో వృద్దులకు, వికలాంగులకు తిప్పలు తప్పవు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం