AP TET Syllabus 2024 : ఏపీ 'టెట్'కు దరఖాస్తు చేశారా..? తాజా 'సిలబస్' ఇదే
AP TET 2024 Latest News: ఏపీ టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈసారి విడుదలైన నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ వివరాలను ఇక్కడ చూడండి…..
AP TET Syllabus 2024: ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19వ తేదీన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు కూడా అవకాశం కల్పించారు అధికారులు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ మధ్యలో పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో టెట్ 2024 పరీక్ష విధానమేంటి..? సిలబస్ లో ఎలాంటి అంశాలు ఉంటాయి...? అర్హత మార్కుల కటాఫ్ వివరాలు చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి….
ముఖ్య వివరాలు
టెట్‌ను పేపర్–1ఎ, 1బి, పేపర్–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు. పేపర్–1ఎ చూస్తే ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునే వారు రాయాల్సిన పరీక్ష.. కాగా పేపర్–1బి అనేది ఒకటి నుంచి 5వ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేయాలనుకునే వారు రాయాల్సి ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో టీచర్లకు ఈ పేపర్ ఉత్తీర్ణత తప్పనిసరి అనే ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా దీన్ని ప్రవేశ పెట్టారు. ఇక పేపర్–2ఎ చూస్తే….. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్‌గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్ ఇది. ఇక పేపర్–2బి చూస్తే ఆరు నుంచి 8వ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌గా బోధించాలనుకునే వారు అర్హత సాధించాల్సి ఉంటుంది.
సిలబస్, పరీక్షా విధానం….
AP TET Syllabus 2024 PDF: టెట్ పేపర్–1ఎ, 1బి, పేపర్–2ఎ, 2బిలను 150 మార్కులకు నిర్వహిస్తారు. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఏపీ టెట్‌లోని అన్ని పేపర్లలోనూ అభ్యర్థులు తప్పనిసరిగా కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.
పేపర్–2ఎ చూస్తే… ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి నుంచి 30 మార్కులు వస్తాయి. ఇక లాంగ్వేజ్ 1 నుంచి 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ నుంచి 30 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్ నుంచి 60 మార్కులు ఇస్తారు. మొత్తం 150 మార్కులకు గానూ పరీక్ష నిర్వహిస్తారు.నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్ విషయంలో..మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్, సైన్స్ విభాగాన్ని, సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పేపర్–2బిలో(AP TET Syllabus) చూస్తే చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి నుంచి 30 మార్కులు, లాంగ్వేజ్1 నుంచి 30, గ్వేజ్ 2(ఇంగ్లిష్)-30, డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాజి నుంచి 60 మార్కులు ఇస్తారు. మొత్తం 150 మార్కులకుగానూ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్–2బిలో నాలుగో విభాగంలో అభ్యర్థులు స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో చదివిన సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు టెట్ రాసే అభ్యర్థుల అర్హతలపై కీలక ఉత్తర్వులను ఇచ్చింది ఏపీ సర్కార్. గతంలో ఉన్న పలు నిబంధనలను మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 5 వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహించే టెట్-1 పేపర్‌కు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ) చేసిన వారే అర్హులని తెలిపింది. అంతేకాకుండా…. పేపర్ 1 రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించి, డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. టీజీటీ వారికి ఇంగ్లిష్ లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు.
ఏపీ టెట్ 2024 ముఖ్య తేదీలు:
ఏపీ టెట్ నోటిఫికేషన్ - ఫిబ్రవరి 7, 2024.
దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 8,2024.
దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి 18 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు.
ఫీజు చెల్లించేందుకు ఫిబ్రవరి 17 చివరి తేదీ.
ఈ నెల 19వ తేదీన అభ్యర్థులు మాక్ టెస్ట్ రాసేందుకు అవకాశం కల్పించారు.
ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేస్తారు.
ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు.
టెట్ తుది కీని మార్చి 13న రిలీజ్ చేస్తారు.
మార్చి 14న టెట్ తుది ఫలితాలు విడుదల చేస్తారు.
డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
టెట్, డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహించనున్నారు.
సంబంధిత కథనం