AP TET Results 2024 : ఆ తర్వాతే ఏపీ 'టెట్' ఫలితాలు - విద్యాశాఖ నుంచి తాజా అప్డేట్ ఇదే
AP TET Results 2024 Updates: ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ విద్యాశాఖ. ఈసీ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతే ఫలితాలను విడుదల చేస్తామని తెలిపింది.
AP TET Results 2024 Updates:ఏపీ టెట్ ఫలితాలకు(AP TET Results 2024) సంబంధించి అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 14వ తేదీనే రావాల్సి ఉన్నప్పటికీ ప్రకటించలేదు. మరోవైపు డీఎస్సీ(AP DSC 2024) పరీక్షల గడువు కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో… ఫలితాల విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో… ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఫలితాల విడుదలకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే ప్రకటిస్తామని పేర్కొంది.
ఏపీ విద్యాశాఖ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి 14వ తేదీనే ఫలితాలు రావాల్సి ఉంది. కానీ ఫలితాలు వెల్లడికాలేదు. అయితే మార్చి 13వ తేదీన రావాల్సిన ఫైనల్ కీ లను మాత్రం… మార్చి 14వ తేదీన అందుబాటులోకి తీసుకువచ్చింది విద్యాశాఖ. ముందుగా ప్రకటించిన తేదీ దాటిపోవటంతో…. ఫలితాల కోసం చాలా మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలను బట్టి డీఎస్సీ(AP DSC Exams 2024) సన్నద్ధతతో పాటు దరఖాస్తు చేసుకునే విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలోని ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంది. దీంతో ఫలితాల విడుదల విషయంలో ఎన్నికల సంఘం నుంచి స్పష్టత రావాల్సి ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో…. ఇవాళ ప్రకటన విడుదల చేశారు. ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు విడుదల కానున్నాయి.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో… బుధవారం ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై స్పందించిన ఆయన… డీఎస్సీ పరీక్షలపై కూడా రియాక్ట్ అయ్యారు. ఈసీ అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్షలు(DSC Exams) నిర్వహించాలని చెప్పారు డీఎస్సీ నియామకాలకు సంబంధించిన వివరాలను ఈసీకి పంపిస్తామని, అనుమతి ఇస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతోందని స్పష్టం చేశారు. దీంతో డీఎస్సీ పరీక్షల నిర్వహణపై డైలామా నెలకొన్నట్లు అయింది. ఈసీ అనుమతి ఇస్తే… డీఎస్సీ పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ కానుండగా…. మరోవైపు టెట్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
Download AP TET Score Card 2024 : టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
- అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే AP TET Feb-2024 Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
- మీ టెట్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
- డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ టెట్ స్కోర్ కీలకం కాబట్టి... స్కోరు కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి.
మరోవైపు ఏపీ డీఎస్సీ (AP DSC 2024) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 30వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇందులో భాగంగా… మార్చి 20వ తేదీ నుంచి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.ఈ మేరకు వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మార్చి 25 నుంచి అభ్యర్థులు డీఎస్సీ హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. మార్చి 30వ తేదీ నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అవుతుండగా… ఏప్రిల్ 3వ తేదీ వరకు జరుగుతాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో ఎస్జీటీ పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.
ఒకవేళ డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఈసీ అనుమతి ఇవ్వకపోతే… మరోసారి డీఎస్సీ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఎన్నికల నిర్వహణ తర్వాతనే ఎగ్జామ్స్ జరిగుతాయి. టెట్ ఫలితాలు కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీనిపై రేపోమాపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.