AP Police Jobs : ఏపీ పోలీస్ శాఖలో 20 వేల ఖాళీలు, త్వరలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన!-ap police department 20 thousand posts vacant dgp home minister says notification soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Police Jobs : ఏపీ పోలీస్ శాఖలో 20 వేల ఖాళీలు, త్వరలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన!

AP Police Jobs : ఏపీ పోలీస్ శాఖలో 20 వేల ఖాళీలు, త్వరలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన!

Bandaru Satyaprasad HT Telugu
Aug 12, 2024 06:37 PM IST

AP Police Jobs : ఏపీలో పోలీస్ శాఖలో 20 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీపై హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక ప్రకటనలు చేశారు. త్వరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

ఏపీ పోలీస్ శాఖలో 20 వేల ఖాళీలు, త్వరలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన!
ఏపీ పోలీస్ శాఖలో 20 వేల ఖాళీలు, త్వరలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన!

AP Police Jobs : ఏపీలో నిరుద్యోగులకు పోలీస్ శాఖ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీపై హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఒకే రోజు కీలక ప్రకటనలు చేశారు. పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో సోమవారం డీజీపీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డీజీపీ మాట్లాడుతూ...రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని డీజీపీ స్పష్టం చేశారు.

ఏపీలో పోలీస్ ఉద్యోగాల ప్రకటన కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. పోలీస్ శాఖలో 19 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 31, 2023 నాటికి పోలీస్ శాఖలో 19,999 ఖాళీలు ఉన్నట్లు హోంమంత్రి అనిత ఇటీవల ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే 6100 పోస్టుల భర్తీ ప్రక్రియ కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిందన్నారు. నిరుద్యోగులు ఇప్పటికే పోలీస్ శాఖలో పలు ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై తదుపరి ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు.

త్వరలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ - హోంమంత్రి అనిత

త్వరలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది పోలీసుల కొరత ఉందన్నారు. గత ప్రభుత్వం పోలీస్ శాఖలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. సరిగ్గా ఎన్నికల ముందు నోటిఫికేషన్ పేరిట హడావుడి చేసిందన్నారు. ఉద్యోగాల భర్తీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైందన్నారు. పోలీసులకు ఉద్యోగ ఒత్తిడి తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

20 వేల పోలీస్ సిబ్బంది కొరత

వైసీపీ అధినేత జగన్ సెక్యూరిటీని తగ్గించలేదని అనిత అన్నారు. జగన్ కావాలనే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని పరిశీలించిన అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు దాడి చేస్తారని జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 20 వేల మంది పోలీసుల కొరత ఉంటే, జగన్ ఒక్కరికే 900 మంది సెక్యూరిటీ కావాలా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోయినా 53 రోజులు అన్యాయంగా జైలులో పెట్టిందన్నారు. రాజమండ్రి జైలులోని స్నేహ బ్లాక్‌ చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. జైలులో ఖైదీల సౌకర్యాలపై ఆరా తీసినట్లు చెప్పారు.

జైలు సిబ్బంది ఈఎల్స్

వైసీపీ పాలనలో అక్రమ కేసులకు చంద్రబాబు కూడా బాధితుడని అనిత అన్నారు. చంద్రబాబును అన్యాయంగా జైలులో పెట్టినందుకు వైసీపీని ప్రజలు పాతాళానికి తొక్కి, బలమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది తరహాలో జైలు సిబ్బందికి కూడా ఈఎల్స్ అడిగారని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సెంట్రల్ జైల్ లో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.

సంబంధిత కథనం