AP Police: పుష్పను మించిన స్మగ్లర్.. లారీ క్యాబిన్ చూసి షాకైన పోలీసులు-ap police caught people smuggling ganja like pushpa movie ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Police: పుష్పను మించిన స్మగ్లర్.. లారీ క్యాబిన్ చూసి షాకైన పోలీసులు

AP Police: పుష్పను మించిన స్మగ్లర్.. లారీ క్యాబిన్ చూసి షాకైన పోలీసులు

Basani Shiva Kumar HT Telugu
Aug 31, 2024 04:23 PM IST

AP Police: తొందరగా డబ్బు సంపాదించడానికి చాలామంది గంజాయి స్మగ్లింగ్‌ను ఎంచుకుంటున్నారు. ఎన్ని కొత్త ప్లాన్‌లు వేసి స్మగ్లింగ్ చేసినా దొరికిపోతున్నారు. తాజాగా.. తూర్పు గోదావరి జిల్లాలో లారీలో గంజాయి తరలిస్తున్న వారిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. లారీ క్యాబిన్ చూసి పోలీసులు షాకయ్యారు.

లారీ క్యాబిన్‌లో గంజాయి ప్యాకెట్లు
లారీ క్యాబిన్‌లో గంజాయి ప్యాకెట్లు

తూర్పు గోదావరి జిల్లాలో లారీలో అక్రమంగా వందలాది గంజాయి బ్యాగులు తరలిస్తున్న ముఠాను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకేసారి భారీ మొత్తంలో గంజాయి తరలించడం సంచలనంగా మారింది. అయితే.. స్మగ్లర్లు గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. కానీ.. గంజాయి స్మగ్లర్ల ప్లాన్ చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

పుష్ట సినిమా తరహాలో..

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేయడానికి వివిధ ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగా.. వాహనాలకు అదనపు ట్రాకులు ఏర్పాటు చేసించి.. తన పనిని సాఫీగా సాగిస్తుంటాడు. తాజాగా.. గంజాయి స్మగ్లర్లు కూడా అచ్చం అలాగే ప్లాన్ చేశారు. కానీ.. ఏం లాభం.. పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఇంత పక్కాగా ప్లాన్ చేసినా ఎలా దొరికిపోయామని స్మగ్లర్లు ఆశ్చర్యపోతున్నారు.

లారీ క్యాబిన్‌లో..

లారీల్లో డ్రైవర్ కోసం ప్రత్యేక క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్‌లో గంజాయి స్మగ్లర్లు ప్రత్యేక రాక్ ఏర్పాటు చేశారు. డ్రైవర్ సీటు వెనకాల రాక్ ఏర్పాటు చేసి అందులో గంజాయి ప్యాకెట్లు నింపారు. అంతేకాకుండా.. డ్రైవర్ సీటు పైనా సెపరేట్ రాక్ పెట్టించి దాంట్లోనూ గంజాయి ప్యాకెట్లను నింపారు. మొత్తం వందకు పైగా గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీటి విలువ లక్షల్లో ఉంటుంది.

అనుమానం వచ్చి..

సాధారణంగా లారీల క్యాబిన్‌ల లెన్త్ పోలీసులకు తెలుసు. కానీ.. ఈ లారీ క్యాబిన్ తేడాగా కనిపించింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. లారీ అంతా ఖాళీగానే ఉంది కానీ.. క్యాబిన్ తేడా ఉందని అనుమానించారు. వారి డౌట్ నిజమైంది. పోలీసులు లారీ క్యాబిన్ ఓపెన్ చేశారు. అంతే.. గుట్టలుగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. కాస్త గట్టిగా లారీ డ్రైవర్‌ను విచారించగా.. డ్రైవర్ సీటుపై ఉన్న విషయాన్ని కూడా చెప్పాడు.

గతంలోనూ..

తూర్పు గోదావరి జిల్లాలోని అడవి ప్రాంతం గుండా గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతోంది. గతంలోనూ నల్లజెర్ల, రంపచోడవరం ప్రాంతాల్లో కార్లలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏవోబీ నుంచి తూర్పు గోదావరి అడవి మార్గం గుండా.. గంజాయిని తెలంగాణకు తరలిస్తున్నారు. భద్రాచలం నుంచి పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లందు, పాకాల మార్గంలో వరంగల్, ములుగు తరలించి.. అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు సులువుగా తరలిస్తున్నారు. కానీ.. వారికి పోలీసులు చెక్ పెడుతున్నారు.