Sharmila Warning: ఆడపిల్లల బాత్ రూముల్లో రహస్య కెమెరాలపై షర్మిల ఆగ్రహం.. వ్యక్తిగత గొడవలేనంటోన్న పోలీసులు
Sharmila Warning: ఆడపిల్లల బాత్ రూముల్లో రహస్య కెమెరాలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు ఈ వివాదానికి వ్యక్తిగత గొడవలే కారణమని పోలీసులు చెబుతున్నారు.విద్యార్థుల మధ్య నెలకొన్న వ్యక్తిగత వివాదాలతోనే రహస్య కెమెరాల ప్రచారం జరిగిందని ప్రచారం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
Sharmila Warning: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో పోలీసులు, విద్యార్థులు పరస్పర విరుద్ధమైన అంశాలను చెబుతుండటంతో గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంలో 300మంది విద్యార్థినుల వీడియోలను చిత్రీకరించారని ప్రచారం జరగడంతో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్‌లు కాలేజీ ప్రాంగణానికి చేరుకుని విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు.
మరోవైపు గుడ్లవల్లేరు ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 3వందలకు పైగా వీడియోలు సేకరించిన వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు.
ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని, చదవు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందని ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే… వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనమని, కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి సజీవ సాక్ష్యమన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు నిదర్శనమని, కాసుల కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
ఈ ఘటనపై సాధారణ విచారణ కాకుండా ఫాస్ట్రాక్ విచారణ జరగాలన్నారు. తక్షణం ఉన్నతస్థాయి కమిటి వేయాలి. సీనియర్ ఐపిఎస్ అధికారులతో విచారణ జరగాలన్నారు. బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలన్నారు.
రాజకీయ నాయకుడి కొడుకా..కూతురా కాదని, కెమెరాలు పెట్టింది ఎవరైనా..ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేనని షర్మిల డిమాండ్ చేశారు. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తానని ప్రకటించారు. విద్యార్థినిలతో మాట్లాడుతానని వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చారు.
కాలేజీలో జిల్లా కలెక్టర్ విచారణ…
కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమేరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో పాటు, ఎస్పీ గంగాధర్ రావు విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించారు. విద్యార్థినుల ఆందోళనపై వాస్తవ పరిస్థితులను విచారిస్తున్నారు. జోరు వానలో విద్యార్థినులు నిరసన కొనసాగించడంతో ప్రభుత్వంవ వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
వ్యక్తిగత వివాదమంటోన్నపోలీసులు…
మరోవైపు గుడ్లవల్లేరు కాలేజీలో జరిగిన ఘటన ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన వ్యక్తిగత వివాదంగా పోలీసులు చెబుతున్నారు. కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు లేవని కృష్ణా జిల్లా పోలీసులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో ఐదుగురు విద్యార్థులు కేంద్రంగా నెలకొన్న వివాదామే విద్యార్థుల ఆందోళనకు కారణమని చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రమేయమున్న వారిలో ఓ ప్రేమ జంట ఉంది.
- వారితో కలిసి చదువుకుంటున్న బిటెక్ ఫైనలియర్ విద్యార్థికి ఓ సోదరి ఉంది.
- మొదటి జంటలో ఉన్న యువకుడు తరచూ తన స్నేహితుడి ఇంటికి వెళ్లే వాడు. అక్కడ అతని చెల్లెలితో కూడా స్నేహం పెంచుకున్నాడు.
- ఈ ఇద్దరు యువకులకు మరో స్నేహితుడు కూడా ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
- ఇద్దరు యువతులతో ఏకకాలంలో ప్రేమ వ్యవహారం నడిపిన యువకుడు, వారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను తన ఫోన్లో రికార్డ్ చేసుకున్నట్టు చెబుతున్నారు.
- ఈ క్రమంలో తన సోదరితో మిత్రుడు సన్నిహితంగా ఉంటున్న విషయం గుర్తించడంతో స్నేహితుల మధ్య వివాదాలు తలెత్తాయి. గతంలో ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్న సమయంలో ప్రేమికురాలితో గడిపిన వీడియోలను తన మిత్రుడికి షేర్ చేసినట్టు చెబుతున్నారు. ప్రియురాలు ఉండగా తన సోదరితో కలిసి తిరుగుతుండటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది.
- సోదరి విషయంలో స్నేహితుడికి వార్నింగ్ ఇచ్చే క్రమంలో వీడియోలు బయట పడతానని హెచ్చరించడంతో, అతని చెల్లెలికి సంబంధించిన వీడియోలు బయటపెడతానని నిందితుడు బెదిరించినట్టు తెలుస్తోంది. కాలేజీలో ఈ వ్యవహారంపై సీనియర్లతో పంచాయితీ జరిగింది. వారం రోజుల క్రితమే కాలేజీ యాజమాన్యం దృష్టికి వచ్చినా వారు పట్టించుకోలేదు. ఈ వ్యవహారం కాస్త కాలేజీలో విద్యార్థులు గ్రూపులుగా చీలిపోయి పుకార్లు పుట్టించారని చెబుతున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్లో వందలాది వీడియోలు ఉన్నాయని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఆందోళన కొనసాగిస్తున్నారు.