Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, ఆరోజు అదేదో ప్లోలో అలా మాట్లాడేశారు.. పుష్ప నిర్మాత క్లారిటీ-pushpa movie producer ravi shankar clarification on pawan kalyan comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, ఆరోజు అదేదో ప్లోలో అలా మాట్లాడేశారు.. పుష్ప నిర్మాత క్లారిటీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, ఆరోజు అదేదో ప్లోలో అలా మాట్లాడేశారు.. పుష్ప నిర్మాత క్లారిటీ

Galeti Rajendra HT Telugu
Aug 31, 2024 07:36 AM IST

Allu Arjun: మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్‌ వార్ గత కొన్ని రోజులుగా పతాక స్థాయికి చేరుకుంది. ఏపీ ఎన్నికల సమయంలో మొదలైన రగడ, మధ్యలో నాగబాటు ట్వీట్, పవన్ కళ్యాణ్ కామెంట్స్, అల్లు అర్జున్ రియాక్షన్‌‌తో నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లిపోయింది.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ (HT_PRINT)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల బెంగళూరు పర్యటనలో చేసిన కామెంట్స్ మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఎవరూ ఊహించనిరీతిలో చిచ్చు రేపింది. అడవుల సంరక్షణ గురించి బెంగళూరులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘40 సంవత్సరాల క్రితం సినిమాల్లోని హీరోలు అడవులను కాపాడేవారు. కానీ ఇప్పుడు ఆ హీరోనే అడవులను నరికేసి స్మగ్లింగ్‌ చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్‌ను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ చేశాడని భావించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ కామెంట్స్‌కి ముందు నుంచే మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య చిన్న వార్ నడుస్తోంది. ఏపీ ఎన్నికల్లో నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి‌కి మద్దతుగా అల్లు అర్జున్ అతని ఇంటికెళ్లి ప్రచారం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురానికి మాత్రం వెళ్లలేదు. దాంతో జనసైనికులు అప్పటి నుంచి అల్లు అర్జున్‌ని లక్ష్యంగా చేసుకున్నారు.

నాగబాబు ట్వీట్‌తో నెక్ట్స్‌ లెవల్‌కి

అదే సమయంలో నాగబాబు కూడా ‘‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’’ అంటూ ట్వీట్ చేయడం ఈ గొడవని మరింత పెంచింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌తో నాగబాబు ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.

మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య ఎక్స్‌లో వార్ నడుస్తున్న సమయంలోనే అల్లు అర్జున్ కూడా ఇటీవల మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో ‘‘నచ్చిన వాళ్ల కోసం నిలబడాలి. నేను నిలబడతాను. నా అనుకునే వాళ్లకోసం ఎంత దూరమైనా వస్తాను’’ అని వ్యాఖ్యానించాడు. దాంతో అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్‌తో జనసేన వాళ్లకి బన్నీ ఫ్యాన్స్ కౌంటరిచ్చారు.

దిద్దుబాటుకి దిగిన పుష్ప నిర్మాత

పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై అటు మెగా ఫ్యామిలీ, ఇటు అల్లు ఫ్యామిలీ నేరుగా స్పందించ లేదు. కానీ అభిమానుల మధ్య రచ్చ అయితే ఆగడం లేదు. ఈ నేపథ్యంలో పుష్ప మూవీ నిర్మాత రవి శంకర్ దిద్దుబాటు చర్యలకి దిగాడు. పుష్ప సీక్వెల్ పుష్ప-2 ఈ ఏడాది డిసెంబరు 6న రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

'మత్తు వదలరా 2' సినిమా టీజర్‌ లాంచ్ ఈవెంట్‌కి వచ్చిన రవి శంకర్‌కి ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌ పుష్ప సినిమా గురించే కదా? అనే ప్రశ్న ఎదురైంది. దాంతో రవి శంకర్ వివరణ ఇచ్చారు.

‘‘పవన్ కళ్యాణ్ ఆ సందర్భంలో అలా ఏదో అలా మాట్లాడారు. కానీ దాన్ని పుష్ప సినిమాకి ఆపాదించారు. ఆయన స్థాయి వేరు. ఆయన వచ్చిన సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ని తక్కువ చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అనుకోరు. అదేదో ప్లోలో అలా వచ్చిందంతే’’ అని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు. మరి చూడాలి ఇక్కడితోనైనా మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ ఆగుతుందేమో.