AP Home Minister Anitha : నాటి టీచరమ్మ - నేటి హోంమంత్రి..! వంగలపూడి అనిత ప్రస్థానంలోని ముఖ్య విషయాలివే..!
AP Home Minister Vangalapudi Anitha : ఏపీ హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనితకు అవకాశం దక్కింది. ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అనిత… అతి తక్కువ కాలంలోనే టీడీపీలో మంచి గుర్తింపును పొందారు.
AP Home Minister Vangalapudi Anitha : వంగలపూడి అనిత… తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ మహిళా నేతగా గుర్తింపు పొందారు. పార్టీ తరపున బలమైన వాయిస్ ను వినిపించే నాయకురాలిగా ఎదిగారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ… అధినేత అండదండలతో తనదైనశైలిలో ఏపీ రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు.
ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంగలపూడి అనిత… పాయకరావుపేట నియోజకవర్గం(Payakaraopet Assembly constituency) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు… ఏకంగా చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ ఖరారు చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు.
వంగలపూడి అనిత రాజకీయాల్లో రాకముందు ప్రభుత్వ టీచర్ గా పని చేశారు. అయితే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె… 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. అనతి కాలంలోనే ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ హోంశాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు.
వంగలపూడి అనిత ప్రస్థానం - ముఖ్య విషయాలివే…
- వంగలపూడి అనిత 1984లో విశాఖపట్నం జిల్లా లింగరాజుపాలెం గ్రామంలో జన్మించిారు.
- ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ. ఎంఈడీ పూర్తి చేశారు.
- ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన వంగలపూడి అనిత 28 ఏళ్ల వయసులో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
- 2012లో రాజకీయ రంగప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానం మొదలైంది.
- 2014లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెంగల వెంకటరావు పై 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
- 2019 ఎన్నికల్లో అనిత పోటీ చేసే స్థానం మారింది. పార్టీ ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై పోటీ చేసి 25,248 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- ఆ తర్వాత తిరిగి పాయకరావుపేట నియోజకవర్గం కేంద్రంగా మళ్లీ అనిత యాక్టివ్ అయ్యారు. పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తూ… ముందుకెళ్లారు. పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
- తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా అనితకు అవకాశం వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడటంతో అనిత ముందున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురైనప్పటికీ అనిత వెనక్కి తగ్గలేదు.
- 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి అనిత టికెట్ దక్కించుకున్నారు.
- కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వంగలపూడి అనిత…వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుపై 43,727 ఓట్ల తేడాలో విక్టరీ కొట్టారు.
- చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అంతేకాకుండా కీలకమైన హోంశాఖ బాధ్యతలను చూసే ఛాన్స్ కొట్టేశారు.
- 2019 ఎన్నికల్లో అనితపై గెలిచిన వైసీపీ అభ్యర్థి తానేటి వనిత కూడా జగన్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.
సంబంధిత కథనం