AP Sachivayalas Employees : సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మళ్లీ బ్రేక్, సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు రిలీవ్ చేయొద్దని ఆదేశాలు-ap grama ward sachivalayam employees transfers stopped due edi manchi prabhutvam event ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Sachivayalas Employees : సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మళ్లీ బ్రేక్, సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు రిలీవ్ చేయొద్దని ఆదేశాలు

AP Sachivayalas Employees : సచివాలయ ఉద్యోగుల బదిలీలకు మళ్లీ బ్రేక్, సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు రిలీవ్ చేయొద్దని ఆదేశాలు

HT Telugu Desk HT Telugu
Sep 21, 2024 09:53 PM IST

AP Sachivayalas Employees : ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు మళ్లీ బ్రేక్ పడింది. ఈ నెల 26 వరకు బదిలీలు నిలిపి వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పూర్తయ్యే వరకు బదిలీలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు మళ్లీ బ్రేక్, సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు రిలీవ్ చేయొద్దని ఆదేశాలు
సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు మళ్లీ బ్రేక్, సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు రిలీవ్ చేయొద్దని ఆదేశాలు

AP Sachivayalas Employees : సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు స‌చివాల‌య ఉద్యోగుల‌ను రిలీవ్ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మ‌ళ్లీ స‌చివాల‌య ఉద్యోగుల బ‌దిలీలు నిలిచి పోయాయి. ఇప్పటికే ఒక్కసారి వాయిదా ప‌డిన స‌చివాల‌య ఉద్యోగుల బ‌దిలీ, తాజాగా మ‌రోసారి బ‌దిలీల ప్రక్రియ ఆగిపోయింది.

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగ‌ుల్లో బ‌దిలీలైన వారిని సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు రిలీవ్ చేయొద్దని గ్రామ, వార్డు స‌చివాల‌య శాఖ డైరెక్టర్ శివ‌ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. "ఇది మంచి ప్రభుత్వం" పేరుతో ఈనెల 20 నుంచి 26 వ‌ర‌కు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేప‌థ్యంలో స‌చివాల‌య ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం వంద రోజుల్లో చేప‌ట్టిన అభివృద్ధి కార్యక్రమాల‌కు సంబంధించిన స్టిక్కర్లు, క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేయాల‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల‌ను రిలీవ్ చేస్తే ప్రభుత్వ కార్యక్రమానికి ఇబ్బంది క‌లుగుతోంద‌ని అన్నారు. అందువ‌ల్ల ఈనెల‌ 26 వ‌ర‌కు ఆయా ఉద్యోగుల‌ను రిలీవ్ చేయొద్దని జిల్లా క‌లెక్టర్లు, జిల్లా జీఎస్‌డ‌బ్ల్యూఎస్ డిపార్టుమెంట్ అధికారుల‌కు ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో 15,004 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి బ‌దిలీల‌కు కార్యాచ‌ర‌ణ‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆగ‌స్టులో ప్రారంభించింది. ఈ మేర‌కు వెబ్‌సైట్‌లో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ (జీవీడ‌బ్ల్యూవీ) & గ్రామ స‌చివాల‌యం, వార్డు స‌చివాల‌యం (వీఎస్‌డ‌బ్ల్యూఎస్‌) డిపార్ట్‌మెంట్‌తో సహా కొన్ని విభాగాల ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం ఆగస్టు19 నుంచి ఆగస్టు 31 వరకు నిషేధాన్ని సడలించింది. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లపై మార్గదర్శకాలు, సూచనలను జారీ చేసింది.

ఆన్‌లైన్ అప్లికేష‌న్ దాఖ‌లకు చివ‌రి తేదీని ఆగ‌స్టు 27గా నిర్ణయించింది. స‌చివాల‌య ఉద్యోగులు చేసుకున్న ద‌ర‌ఖాస్తుల‌ను ఆగ‌స్టు 28న అధికారులు డౌన్‌లోడ్ చేసి, ప్రాధాన్యత కింద సీనియారిటీ ప్రకారం చేయాల‌ని సూచించింది. అలాగే కౌన్సిలింగ్ ఆగస్టు 29, 30 తేదీల్లో ఆయా జిల్లా క‌లెక్టర్ కార్యాల‌యాల్లో జ‌రిగాయి. ఆగ‌స్టు 30 లోగా ఉద్యోగి ఫిర్యాదులు ఏవైనా ఉంటే పూర్వ జిల్లా కలెక్టర్ ముందు దాఖలు చేయవచ్చని మార్గద‌ర్శకాల్లో పేర్కొంది. దానిక‌నుగుణంగా ప్రక్రియ మొత్తం పూర్తి అయింది. అయితే కౌన్సింగ్ పూర్తి అయిన ఉద్యోగుల‌ను ఆయా ప్రాంతాల‌కు బ‌దిలీ చేయాల్సి ఉంది. అందులో భాగంగానే ముందుగా వారు ప్రస్తుతం ప‌ని చేసే ప్రాంతంలో రిలీవ్ చేయాలి. కానీ చివ‌రి ప్రక్రియ మాత్రం ఆగిపోయింది.

బదిలీలకు మళ్లీ బ్రేక్

సెప్టెంబ‌ర్ 1 నుంచి బ‌దిలీ అయిన స‌చివాల ఉద్యోగులు వారి పోస్టింగ్ ప్రాంతంలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు అప్పుడు తాత్కాలికంగా వాయిదా వేశారు. సెప్టెంబరులో పింఛన్ల పంపిణీ దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారిని రిలీవ్ చేయొద్దని కలెక్టర్లకు సచివాలయాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఆగ‌స్టు 31న, సెప్టెంబర్ 2న పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం అప్పుడు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చాకే వీరి బదిలీల పక్రియను చేపట్టాలని కలెక్టర్లకు‌ సూచించింది. దీంతో సచివాలయ ఉద్యోగుల బదిలీ తాత్కాలికంగా బ్రేక్ అయింది.

మ‌ళ్లీ ఇప్పుడు కూట‌మి ప్రభుత్వం వంద రోజుల పాల‌న‌పై కార్యక్రమం సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు రిలీవ్ చేయొద్దని ఆదేశించింది. దీంతో రెండు సార్లు స‌చివాల‌య ఉద్యోగుల బ‌దిలీలు వాయిదా ప‌డ్డాయి. అయితే సెప్టెంబ‌ర్ 26 త‌రువాత మ‌ళ్లీ అక్టోబ‌ర్ నెల పెన్షన్లు పంపిణీ వ‌స్తుంది. దీంతో అప్పుడు కూడా వాయిదా పడే అవ‌కాశాలు ఉన్నాయి. అక్టోబ‌ర్ నెల పెన్షన్లు పంపిణీ పూర్తి అయిన త‌రువాతే బ‌దిలీ అయిన ఉద్యోగుల‌ను రిలీవ్ చేసే అవ‌కాశం ఉంది.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం