AP Cabinet Decisions : వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వివిధ శాఖాల్లో సర్దుబాటు- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే-ap cabinet key decisions volunteers sachivalayam staff mixed in other departments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Decisions : వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వివిధ శాఖాల్లో సర్దుబాటు- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

AP Cabinet Decisions : వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వివిధ శాఖాల్లో సర్దుబాటు- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

Bandaru Satyaprasad HT Telugu
Sep 18, 2024 05:46 PM IST

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన మద్యం పాలసీ ఆమోదంతో పాటు పలు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 18 అంశాలపై నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్న రూ.200 ఆర్థిక సాయం జీవో రద్దు చేయాలని నిర్ణయించింది.

వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వివిధ శాఖాల్లో సర్దుబాటు- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వివిధ శాఖాల్లో సర్దుబాటు- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

AP Cabinet Decisions : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ-కేబినెట్ సమావేశంలో 18 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖాల్లో కలిపేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. రాజీనామాలు చేయగా రాష్ట్రంలో 1.07 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారన్నారు. ఆధార్ తరహాలో విద్యార్థులకు అపార్ గుర్తింపు కార్డులు, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ స్టెమీ పథకం, సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించిందన్నారు.

1.సాధారణ పరిపాలనా విభాగం

సీఎం సహాయనిధి కేసులు, సీఎం ఫిర్యాదులు తదితర అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని పటిష్ఠం చేసేందుకు జూన్ 12,2024 నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో వివిధ కేటగిరీల్లో (58) పోస్టులను తాత్కాలికంగా సృష్టించేందుకు జీవో నెం.78, ఇతర ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించింది.

2. గ్రామ, వార్డు సచివాలయాలు

గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు నెలకు రూ.200 చొప్పున అదనపు ఆర్థిక సాయం అందించేందుకు గతంలో ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని చేసి ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాజకీయ లబ్దికోసం ఎవరికో ఆర్థిక లాభం చేకూరే విధంగా చేసిన ఈ ఉత్తర్వుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.205 కోట్లు నష్టం వాటిల్లిందని, దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని మంత్రి మండలికి ముఖ్యమంత్రి సూచించారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లో కలపాలని కేబినెట్ నిర్ణయించింది.

3. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ

విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి "అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం" గా పేరు మార్చడానికి తీర్మానం, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కేబినేట్ నిర్ణయించింది.

4. పరిశ్రమలు, వాణిజ్యం

14.8.2024 తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి కేటాయింపు కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) సమావేశం సిఫార్సుల ఆధారంగా ఎపీఐఐసీ కేటాయింపు నిబంధనల ప్రకారం (ప్రతి కేసు పరిధి, 50 ఎకరాల కంటే తక్కువ) సిఫార్సు చేసిన 203 పారిశ్రామిక భూ కేటాయింపులను ఆమోదించడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రతి ఇంట ఒక ఎంఎస్ఎంఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారుచేయాలన్న తమ ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు తెలిపారు.

5. ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం

రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ప్రాక్షన్ (STEMI - స్టెమీ) కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కమ్యునిటీ స్థాయిలో సమగ్ర కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది.

6. పరిశ్రమలు, వాణిజ్యం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం కింద అందే లబ్ధిని రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) లకు అందజేసి వాటిని అభివృద్ధి పథంలో నడపాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లతో ప్రాథమిక కార్పస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పరిశ్రమలకు చేయూత అందించడానికి ఈ ఫండ్ ఉపకరిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం ద్వారా సుమారు 35,000 కొత్త గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు ప్రయోజనం కలగనుందన్నారు.

7. హోం శాఖ

మాజీ సైనికులు, యుద్ధ వికలాంగ సైనికులు, యుద్ధ వితంతువులు, మాజీ సైనిక వితంతువులు, వారిపై ఆధారపడినవారి స్వయం సమృద్ధి, సహాయ, పునరావాసానికై పీడీఎఫ్ ఖాతా నుంచి రూ.3 కోట్ల కార్పస్ నిధితో ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సర్వీస్మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEXCO) ఏర్పాటు చేయనున్నారు. కేబినెట్ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రూ.10 కోట్ల కార్పస్ నిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

8. పరిశ్రమలు, వాణిజ్యం

కడప జిల్లా కొప్పర్తిలోని మెగా ఇండస్ట్రియల్ హబ్ లో గతంలో ఆమోదించిన ప్రదేశానికి బదులుగా అమరావతిలో రెండో ఎంఎస్ ఎంఈ టెక్నాలజీ సెంటర్ (టీసీ) కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఆర్డీఏ ద్వారా రాజధాని ప్రాంతంలో 20 ఎకరాల భూమిని అందజేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

9. ప్రణాళిక శాఖ

విజన్ డాక్యుమెంట్ వికసిత్ ఆంధ్ర 2047 పేరును స్వర్ణాంధ్ర 2047గా మార్చాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 5 వరకు స్టేక్ హోల్డర్స్ సంప్రదింపుల అనంతరం 1 నవంబర్, 2024న విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.

10. మానవ వనరుల (ఉన్నత విద్య) శాఖ

కృత్రిమ మేధ, సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్లింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఎస్.ఆర్.ఎం.యూనివర్సిటీని యు.జి.సి. నిబంధనలు-2023 ప్రకారం డిస్టింక్టు కేటగిరీలో “డీమ్డు టు బి యూనివర్శిసిటీ” గా కన్వర్టు చేసేందుకు అవసరమైన “నో అబ్జక్షన్ సర్టిఫికేట్” (NOC)ను ప్రభుత్వ పరంగా జారీచేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

దేశంలో పేరు పొందిన ఉత్తమ విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కు తేవడం తమ లక్ష్యమని, బిట్స్ పిలానీ సంస్థ తమ అనుబంధ సంస్థను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సంసిద్దత తెలిపిందని సీఎం చంద్రబాబు తెలిపారు.

10. వెనుబడిన వర్గాల సంక్షేమ శాఖ

బీసీలకు చట్టసభలో సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో 33 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలను కేంద్రం ఆమోదానికి పంపేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

11. జల వనరుల శాఖ

పోలవరం ప్రాజెక్టుకు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ప్రస్తుతం ఉన్న ఏజన్సీతోనే కొనసాగించేందుకు పోలవరం చీఫ్ ఇంజినీర్ ప్రతిపాదించిన రాటిఫికేన్ ఆర్డర్స్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. డయాప్రమ్ వాల్ నిర్మాణం కారణంగా అదనపు పనులను పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాయలసీమలో ఉన్న అన్ని రిజర్వాయర్లు, మైనర్ ఆరిగేషన్ ట్యాంకులను ఈ సీజన్ లో నింపేవిధంగా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

13. రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు

గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రంగా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది.

14. రెవెన్యూ (ఎక్సైజ్)

నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అక్టోబరు మొదటి వారం నుంచి ఈ నూతవ పాలసీ అమలుకు చర్యలు తీసుకోనుంది. మద్యం ధరలు, రిటైల్ వ్యాపారం, పన్నులపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను మంత్రి మండలి ఆమోదించింది. ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ వాణిజ్య నియంత్రణ చట్టం - 1993కు తగిన సవరణలు చేయాలని చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నూతన మద్యం పాలసీలో నిర్వహణ, ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నూతన విధానం రెండేళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది. దీంతో రిటైలర్ల ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న దుకాణాల్లో 10 శాతం గీతా కులాలకు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రిజర్వుడ్ షాపులకు ప్రత్యేక మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేయనుంది. అన్ రిజర్వ్ డ్ షాపులకు ప్రతిపాదిత శ్లాబుల్లో 50 శాతం లైసెన్స్ ఫీజు ఉంటుంది. రాష్ట్రంలోని 3,736 దుకాణాల్లో గీత కులాలకు 10% దుకాణాలను అంటే 340 దుకాణాలను కేటాయించనున్నారు. రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా ఉండేందుకు లాటరీ ప్రాతిపదికన దుకాణాల కేటాయింపు జరగనుంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

సంబంధిత కథనం