AP Sachivalayam Employees : వాలంటీర్ల అవతారమెత్తిన స‌చివాలయ‌ ఉద్యోగులు, ఇంటింటికీ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటింపు-ap sachivalayam employees working as volunteer pasting edi manchi prabhutvam stickers to every house ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Sachivalayam Employees : వాలంటీర్ల అవతారమెత్తిన స‌చివాలయ‌ ఉద్యోగులు, ఇంటింటికీ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటింపు

AP Sachivalayam Employees : వాలంటీర్ల అవతారమెత్తిన స‌చివాలయ‌ ఉద్యోగులు, ఇంటింటికీ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటింపు

HT Telugu Desk HT Telugu
Sep 21, 2024 03:03 PM IST

AP Sachivalayam Employees : ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అతికిస్తున్నారు. వాలంటీర్లతో చేయించాల్సిన పనులు తమతో చేయిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

వాలంటీర్ల అవతారమెత్తిన స‌చివాలయ‌ ఉద్యోగులు, ఇంటింటికీ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటింపు
వాలంటీర్ల అవతారమెత్తిన స‌చివాలయ‌ ఉద్యోగులు, ఇంటింటికీ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటింపు

AP Sachivalayam Employees : రాష్ట్రంలో టీడీపీ కూట‌మి ప్రభుత్వం అధికారాన్ని చేప‌ట్టి వంద రోజులు కావ‌స్తున్నా నేపథ్యంలో గ్రామ‌, వార్డు స‌చివాల ఉద్యోగులు వాలంటీర్ల అవ‌తారం ఎత్తాల్సిన ప‌రిస్థితి నెలకొంది. గ‌తంలో వాలంటీర్ చేసే ప‌నుల‌ను ఇప్పుడు స‌చివాల‌య ఉద్యోగుల‌తో చేయిస్తున్నారు. దీంతో స‌చివాల‌య ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

గ‌తంలో ప్రభుత్వానికి సంబంధించిన ఇంటింటికి క‌ర‌ప‌త్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించ‌డం వంటి ప‌నులు వాలంటీర్లు చేసేవారు. స‌చివాల‌య ఉద్యోగులకు అలాంటి ప‌నులు అప్పగించేవారు కాదు. డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ చేసి ఏపీపీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ రాసి, నియామకం అయిన‌ స‌చివాల‌య ఉద్యోగుల‌ను హుందాగా చూసేవారు. రాష్ట్రంలో 15,004 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు.

కానీ వారి చేత వంద రోజుల కూట‌మి ప్రభుత్వ పాల‌న‌పై ఇంటింటికి "ఇది మంచి ప్రభుత్వం" క‌ర‌ప‌త్రాలు (పాంప్లెట్స్) పంచేలా చేయడం, స్టిక్కర్లు అంటించాల‌ని ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి రోజు సాయంత్రానికి ఎన్ని ఇళ్లకు క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేశారు? ఎన్ని ఇళ్లకు స్టిక్కర్లు అంటించార‌నే దానిపై అధికారుల‌కు స‌మాచారం అందించాల‌ని ఆదేశిస్తున్నారు. ఈ నెల 20 నుంచి 26 వ‌ర‌కు ఈ కార్యక్రమాన్ని సచివాల‌య ఉద్యోగులు చేయాల‌ని ఆదేశాల్లో పేర్కొన్నారు. టీడీపీ నేత‌లు, ప్రజా ప్రతినిధులు స‌చివాల‌య ఉద్యోగుల‌కు ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల చేత పాంప్లెట్లు పంచడం, స్టిక్కర్లు అంటించ‌డం వంటి కార్యక్రమాలు చేపించ‌డం దారుణ‌మ‌ని స‌చివాల‌య ఉద్యోగులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

గ‌తంలో వాలంటీర్ల చేత‌ ఇటువంటి కార్య్రమాలు చేసినందుకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పటి ప్రభుత్వం కోర్టులో కేసువేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వాలంటీర్లతో కాకుండా నేరుగా ఆ పనులను ప్రభుత్వ ఉద్యోగులతో చేయించడం హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి ప‌నులు స‌చివాల‌య ఉద్యోగుల చేత చేయించి త‌మ‌ను, త‌మ ఉద్యోగాన్ని అవ‌మానించ‌డ‌మే అని ఉద్యోగులు అంటున్నారు. దీన్ని లక్ష మంది సచివాలయ ఉద్యోగుల ఏక గొంతుకతో ఖండిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

ఇప్పటి వ‌ర‌కు స‌చివాలయ ఉద్యోగుల ప‌దోన్నత‌ల గురించి ఎటువంటి చ‌ర్యలు చేప‌ట్టిని, కూట‌మి ప్రభుత్వం ఇలాంటి ప‌నులు చేపిస్తూ అవ‌మానిస్తోందని విమ‌ర్శిస్తున్నారు. ప్రమోష‌న్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రయోజ‌నం చేకూరే దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తున్నారు. ఉద్యోగులను మెచ్చుకోకున్న పర్వాలేదు. కానీ అవమానించేలా వారి చేత ఇటువంటి కార్యక్రమాలు ఇక మీదట చేయించకూడద‌ని ఆశిస్తున్నామ‌న్నారు.

స‌చివాల‌యాల్లో సేవ‌లు కుదింపు

మ‌రోవైపు స‌చివాల‌య సేవ‌లను ప్రభుత్వం కుదిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 540 సేవ‌ల‌ను గ్రామ, వార్డు స‌చివాలయాలు అందిస్తున్నాయి. కానీ వాస్తవానికి అన్ని సేవ‌లు స‌చివాల‌యాల్లో లేవు. భూముల‌కు సంబంధించిన 1బీ, అడంగ‌ల్ వంటి కొన్ని సేవ‌ల‌ను మీసేవ‌ల‌కు అప్పగించారు. అలాగే మ‌రికొన్ని సేవ‌ల‌ను గ్రామ స‌చివాల‌యాల‌తో పాటు, మీసేవ‌లకు కూడా అప్పగించారు. ఇసుక బుకింగ్ వంటి సేవ‌ల‌ను మీసేవ‌ల‌కు అప్పగించారు. కొన్ని సేవ‌ల‌కు సంబంధించిన నెట్‌వ‌ర్క్‌ను నిలిపివేశారని స‌చివాల‌య ఉద్యోగులు తెలిపారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం