AP Employees : గ్రామ, వార్డు స‌చివాలయ ఉద్యోగుల బ‌దిలీల‌కు బ్రేక్ - త్వరలో కొత్త షెడ్యూల్-break for transfers of village and ward secretariat employees in ap new schedule for counseling soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Employees : గ్రామ, వార్డు స‌చివాలయ ఉద్యోగుల బ‌దిలీల‌కు బ్రేక్ - త్వరలో కొత్త షెడ్యూల్

AP Employees : గ్రామ, వార్డు స‌చివాలయ ఉద్యోగుల బ‌దిలీల‌కు బ్రేక్ - త్వరలో కొత్త షెడ్యూల్

HT Telugu Desk HT Telugu
Aug 29, 2024 07:01 PM IST

రాష్ట్రంలోని గ్రామ, వార్డు స‌చివాలయ ఉద్యోగుల బ‌దిలీల‌కు బ్రేక్ పడింది. కౌన్సెలింగ్ కు త్వరలోనే కొత్త షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పెన్షన్ల పంపిణీ సమయం దగ్గరపడిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సచివాలయ ఉద్యోగుల బదిలీలకు తాత్కాలిక బ్రేక్
సచివాలయ ఉద్యోగుల బదిలీలకు తాత్కాలిక బ్రేక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం గురువారం కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. వీటిలో కొన్ని కేటగిరీల్లో ఉద్యోగులను బదిలీ చేసినా సెప్టెంబరులో పింఛన్ల పంపిణీ దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారిని రిలీవ్ చేయొద్దని కలెక్టర్లకు రాష్ట్ర సచివాలయాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చాకే వీరి బదిలీల పక్రియను చేపట్టాలని కలెక్టర్లకు‌ సూచించింది.

కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛను పంపిణీ మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.‌ పింఛన్ల పంపిణీ పూర్తయ్యే వరకు బదిలీ అయిన సిబ్బందిని రిలీవ్ చేయద్దు అని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో ఈనెల 31, సెప్టెంబర్ 2న పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

పెన్షన్లను సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల బదిలీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తదుపరి కౌన్సెలింగ్ తేదీలను ఇంకా ప్రకటించలేదు.

వీరికి బదిలీలు ప్రస్తుతం లేవు

ప్రస్తుతం జరుగుతున్న బదిలీలలో భాగంగా… కొందరికి మినహాయించారు. ప్రజలకు అందాల్సిన సేవల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-II), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధక సహాయకుడు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఎఎన్ఎం గ్రేడ్-III/వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టుల్లో ఉన్న సిబ్బందిని బదిలీల నుంచి మినహాయించారు.

మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు వీలుగా విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. డిప్యూటీ సెక్రటరీ/డైరెక్టర్ క్యాడర్‌లో నియామకాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలతో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. అంతకంటే కింది స్థాయిలో నియామకాలను జీఏడీ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షిస్తుంది. వీరు రీ అపాయింట్ మెంట్ కోసం సీఎం అనుమతి పొందాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

టాపిక్