Sachivalaya Employees : గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రక్షాళన- ఉద్యోగుల కుదింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం!-ap gram ward sachivalaya department additional employees transferred to other departments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sachivalaya Employees : గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రక్షాళన- ఉద్యోగుల కుదింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

Sachivalaya Employees : గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రక్షాళన- ఉద్యోగుల కుదింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

Sachivalaya Employees : గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ శాఖలో అదనపు ఉద్యోగులను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను ఇరిగేషన్‌ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయనుంది.

గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రక్షాళన- ఉద్యోగుల కుదింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

Sachivalaya Employees : ఏపీలో వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో కూడా ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. సచివాలయాల శాఖపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అవసరాన్ని మించి ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దీంతో అదనపు ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 1,26,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

ఒక్కో సచివాలయంలో 11 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం...వీరిలో కొంత మందికి సరైన విధులు లేవని అభిప్రాయపడింది. అటువంటి వారిని మండల, డివిజన్‌ స్థాయిలోని ప్రభుత్వ ఆఫీసుల్లో నియమించాలనే ఆలోచన చేస్తుంది. చాలా సఈ ప్రక్రియలో భాగంగా గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను ఇరిగేషన్‌ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 660 మందిని ఏఈలుగా నియమించాలని జలవనరులు శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. పనిలేకుండా ఉన్న వారిని మిగతా శాఖల్లో సర్దుబాటుచేసి, సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చాలా సచివాలయాల్లో 4 నుంచి 8 మంది సిబ్బంది ఉన్నారు. వీఆర్వోను కూడా సచివాలయ శాఖలో భాగంగా చూస్తున్నారు. ఉద్యోగుల సర్దుబాటుపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నెలాఖరులోగా బదిలీలు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. బదిలీ కోరుకునే ఉద్యోగులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఉద్యోగులు తగిన ధ్రువపత్రాలు సమర్పించాలి. ఖాళీల ఆధారంగా ఉన్నతాధికారులు బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. జిల్లా వారీగా ఉన్నతాధికారులు బదిలీలపై ఆదేశాలు జారీ చేస్తున్నారు.

బదిలీ కోరుకునే ఉద్యోగులు సంబంధిత వెబ్‌సైట్‌లో మెరిట్‌, సీనియారిటీ వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తును ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అపాయింట్మెంట్‌ అథారిటీ పరిశీలించి, కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఇవాళ్టి వరకు బదిలీ దరఖాస్తులు స్వీకరిస్తారు. నెలాఖరులోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేస్తారు. అయితే క్రమశిక్షణా చర్యలకు గురైనా ఉద్యోగులు, ఏసీబీ, విజిలెన్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బదిలీలకు అనర్హలు.

సొంత గ్రామాలకు బదిలీ- క్రిమినల్ కేసులు

ఉద్యోగి తమ సొంత గ్రామాలకు బదిలీ అయ్యేందుకు దరఖాస్తు చేసుకోకూడదు, తప్పుడు సమాచారంతో బదిలీకి దరఖాస్తు చేసుకుంటే వారిపై క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు. ఐటీడీఏ పరిధిలో రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కౌన్సెలింగ్‌కు రాని ఉద్యోగుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవద్దని గ్రామ, వార్డు సచివాలయ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

సంబంధిత కథనం