TG Govt DA Hike : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్-త్వరలోనే రెండు డీఏలు విడుదల?
TG Govt DA Hike : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏల్లో రెండింటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డీఏ చెల్లింపుల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారని సమాచారం.
TG Govt DA Hike : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పనుంది. పెండింగ్ ఉన్న నాలుగు డీఏల్లో రెండింటిని విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. డీఏ చెల్లింపుల వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ చెల్లించాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ హయాంలో మూడు డీఏలు, కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఒక డీఏ పెండింగ్ లో ఉంది. నాలుగు డీఏల్లో రెండింటిని చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమచారం.
దసరా నాటికి డీఏలు?
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు పెండింగ్ డీఏలను క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. రుణమాఫీ ప్రక్రియ పూర్తికాగానే ఉద్యోగుల రెండు డీఏలను క్లియర్ చేసేందుకు నిధుల సమీకరించనుందని తెలుస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లకు నాలుగు డీఏలుపెండింగ్ లో ఉన్నాయి. అక్టోబర్ మొదటి వారంలో జరిగే దసరా పండుగకు ముందుగా అంటే సెప్టెంబర్ నెలఖారులోగా రెండు డీఏలను విడుదల చేసేందుకు నిధులు సమీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే రెండు డీఏలను విడుదల చేయాలని రేవంత్ సర్కార్ భావించినప్పటికీ రుణమాఫీ నిధుల సమీకరణ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా డీఏల విడుదల పెండింగ్ పడింది. ప్రభుత్వం రైతులకు పంట రుణాల మాఫీ పథకానికి ప్రాధాన్యత ఇచ్చి, జులై 18 నుంచి ఆగస్టు 15 వరకు రూ.18 వేల కోట్ల నిధులు బ్యాంకుల్లో జమ చేశారు. రుణామాఫీ పథకానికి ఆర్థికశాఖ నిధులు సేకరించింది. దీంతో డీఏల విడుదల పెండింగ్ లో పడింది.
ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఒత్తిడి
పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. 53 ఉద్యోగుల సంఘాలతో తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఇప్పటికే జేఏసీని ఏర్పాటు చేశారు. డీఏలపై ఏ నిర్ణయం తీసుకోకపోతే ఉమ్మడి పోరాటం సిద్ధమని ఉద్యోగులు ప్రకటించారు. తమ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ ఛైర్మన్ జగదేశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఉద్యోగుల సంఘాల నుంచి ఒత్తిడి మరింత తీవ్రం కాకుండా సెప్టెంబర్ చివరి నాటికి రెండు డీఏలను క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
డీఏ, డీఆర్ పెంపుపై త్వరలోనే ప్రకటన?
డీఏ పెంపు (డియర్నెస్ అలొవెన్స్) వార్త కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ అందే సూచనలు కనిపిస్తున్నాయి! 7వ పే కమిషన్ ఆధారంగా ఉండే డీఏ, డీఆర్ (డియర్నెస్ రిలీఫ్) పెంపుపై కేంద్రం త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనుందని సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగుల డీఏని ప్రతియేటా రెండుసార్లు (జనవరి, జులై) సవరిస్తుంది కేంద్రం. అనంతర నెలల్లో వీటిపై ప్రకటనలు వెలువడతాయి. పండుగ సీజన్ కూడా సమీపిస్తుండటంతో ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై త్వరలోనే, ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్ నెలలోనే ఓ ప్రకటన వస్తుందని అంచనాలు ఉన్నాయి. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా, దాని అమలు మాత్రం 2024 జులై నుంచే ఉంటుంది. ఫలితంగా 7వ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉండే డీఏ పెంపుతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధిచేకూరనుంది. ఈ ఏడాది 2024 మార్చ్‌లో డీఏ పెంపు జరిగింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయా నెలలకు ఏరియర్స్ పడతాయి.
తాజా సీబీఐ డేటా ప్రకారం బేసిక్ పేలో డీఏ 53.35శాతంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 53శాతం వరకు డీఏ పెంపు ఉంటుంది. ప్రస్తుతం 7వ పే కమిషన్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50శాతంగా ఉంది. అంటే, రానున్న డీఏ పెంపు 3శాతంగా ఉండే అవకాశం ఉంది.
సంబంధిత కథనం