DA Hike news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై త్వరలోనే గుడ్ న్యూస్! ఈసారి ఎంత పెరగొచ్చు?
DA Hike news : డీఏ పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది. లెక్కల ప్రకారం, ఈసారి డీఏ ఎంత పెరిగే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకోండి.
డీఏ పెంపు (డియర్నెస్ అలొవెన్స్) వార్త కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ అందే సూచనలు కనిపిస్తున్నాయి! 7వ పే కమిషన్ ఆధారంగా ఉండే డీఏ, డీఆర్ (డియర్నెస్ రిలీఫ్) పెంపుపై కేంద్రం త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనుందని సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగుల డీఏని ప్రతియేటా రెండుసార్లు (జనవరి, జులై) సవరిస్తుంది కేంద్రం. అనంతర నెలల్లో వీటిపై ప్రకటనలు వెలువడతాయి. పండుగ సీజన్ కూడా సమీపిస్తుండటంతో ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై త్వరలోనే, ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్ నెలలోనే ఓ ప్రకటన వస్తుందని అంచనాలు ఉన్నాయి. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా, దాని అమలు మాత్రం 2024 జులై నుంచే ఉంటుంది. ఫలితంగా 7వ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉండే డీఏ పెంపుతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధిచేకూరనుంది.
ఈ ఏడాది 2024 మార్చ్‌లో డీఏ పెంపు జరిగింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయా నెలలకు ఏరియర్స్ పడతాయి.
ఇదీ చూడండి:- Goverment employees salary : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్! 13లక్షల మంది జీతాలు ఆపేస్తామంటూ..
ఈసారి ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఎంత పెరుగుతుంది?
ప్రముఖ వార్తా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. కార్మికశాఖలోని లేబర్ బ్యూరో ప్రతి నెల ప్రచురించే సీపీఐ (కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్) ఆధారంగా డీఏని లెక్కిస్తారు. ఇక తాజా సీబీఐ డేటా ప్రకారం బేసిక్ పేలో డీఏ 53.35శాతంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 53శాతం వరకు డీఏ పెంపు ఉంటుంది. ప్రస్తుతం 7వ పే కమిషన్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50శాతంగా ఉంది. అంటే, రానున్న డీఏ పెంపు 3శాతంగా ఉండే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచితే అది టేక్-హోమ్ శాలరీలోకి వెళుతుంది. ఉదాహరణకు.. నెలకు రూ. 55,200 బేసిక్ శాలరీ అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి డీఏ (50శాతం) రూ. 27,600గా ఉంటుంది. దీని మీద 3శాతం పెరిగడం అంటే.. అది రూ. 1,656 అవుతుంది. తద్వారా జీతం కూడా పెరుగుతుంది.
ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మాత్రమే కాదు, పింఛనుదారుల డీఆర్ కూడా 3శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం.
గతేడాది రెండోసారి డీఏ పెంపును అక్టోబర్ 18న కేంద్రం ప్రకటించింది. అది 2023 జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈసారి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు వార్త అందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
సంబంధిత కథనం