AP Educational Department : ఏపీ విద్యాశాఖలో భారీగా బదిలీలకు రంగం సిద్ధం, తుది ఫైల్ రెడీ!
AP Educational Department : ఏపీ విద్యాశాఖలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విద్యాశాఖలోని ఉన్నతాధికారులతో సహా వివిధ విభాగాల డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, ఇతర అధికారులను బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ విద్యా శాఖలో భారీ మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. విద్యాశాఖలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లతో పాటు సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పని చేస్తున్న కార్యదర్శులను సైతం మార్చేందుకు నిర్ణయించారు.
మరోవైపు ఉపాధ్యాయ బదిలీలు ప్రక్రియ మాత్రం నిలిచిపోయింది. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం, ఇంకా ఆ ప్రక్రియను చేపట్టలేదు. ఉపాధ్యాయ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం అడుగు కూడా ముందుకు వేయలేదు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయ బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆందోళనలను ప్రారంభించాయి.
కానీ వివిధ విభాగాల డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లతో పాటు సమగ్ర శిక్ష అభియాన్ అధికారులను బదిలీకి రంగం సిద్ధం చేసింది. జిల్లా విద్యా శాఖ అధికారులు (డీఈవో), టెక్నికల్ ఎడ్యూకేషన్ చూసే రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)లకు కూడా స్థానచలనం కల్పించనున్నారు. ఈ అంశంపై నెల రోజుల క్రితమే వివరాలు తీసుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యాలయం, అధికారుల మార్పుపై తుది ఫైల్‌ను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు తెలుస్తోంది.
సమగ్ర శిక్ష ఏఎస్పీడీగా ఉన్న శ్రీనివాసుల రెడ్డిని పదో తరగతి పరీక్షల విభాగం (ఎస్ఎస్‌సీ బోర్డు) డైరెక్టర్‌గా బదిలీ చేస్తారని తెలిసింది. ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న దేవానందరెడ్డిని ఓపెన్ స్కూల్ డైరెక్టర్‌గా, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డిని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ సెక్రటరీగా బదిలీ చేస్తారని తెలుస్తోంది. అలాగే కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రసన్నకుమార్‌లలో ఒకరిని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా నియమించే అవకాశం ఉందని సమాచారం.
పాఠ్య పుస్తకాల ముద్రణ విభాగం డైరెక్టర్ కె.రవీంద్రనాథ్ రెడ్డి, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శి నరసింహారావు, మధ్యాహ్న భోజన పథకం జాయింట్ డైరెక్టర్ గంగాభవానీలను సమగ్ర శిక్షకు బదిలీ చేస్తారని తెలుస్తోంది. మధ్యాహ్న భోజన పథకం అదనపు డైరెక్టర్‌గా ఇంటర్మీడియట్ విద్యలో పని చేస్తున్న శ్రీనివాసరావును, ఓపెన్ స్కూల్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావును ఇంటర్మీడియట్ విద్యకు బదిలీ చేయనున్నట్లు సమాచారం.
వీరితో పాటు జిల్లా విద్యా శాఖ అధికారులను సైతం బదిలీ చేయనున్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా డీఈవో తప్ప మిగిలిన 25 జిల్లాల విద్యా శాఖ అధికారులను ఆరు నెలల క్రితమే మార్చారు. అయినా ఇప్పుడు మరోసారి వీరిందరికీ స్థానచలనం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో బదిలీల ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం