YSR Pension Kanuka : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... పెన్షన్లు రూ.3 వేలకు పెంపు, జనవరి 1 నుంచే అమలు-ap govt orders increasing ysr pensions to rs 3 thousand ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Pension Kanuka : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... పెన్షన్లు రూ.3 వేలకు పెంపు, జనవరి 1 నుంచే అమలు

YSR Pension Kanuka : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... పెన్షన్లు రూ.3 వేలకు పెంపు, జనవరి 1 నుంచే అమలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 21, 2023 04:17 PM IST

YSR Pension Kanuka News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్‌ పెన్షన్‌ కానుకను రూ.3 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్ఆర్ పెన్షన్ కానుక
వైఎస్ఆర్ పెన్షన్ కానుక

YSR Pension Kanuka : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ సర్కార్… మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్‌ పెన్షన్‌ కానుకను రూ.3 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

వైఎస్సార్ పెన్షన్ కానుక పేరిట.. అవ్వా తాతలు, వితంతువులు, చేనేత, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రూ. 1000 గా ఉన్న పింఛన్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.. రూ. 2,250 కి పెంచింది. ఏటా పెంచుతూ.. రూ. 3 వేల వరకు ఇస్తామన్న వాగ్దానం మేరకు.. 2022 రూ. 2,500 కి పెంచారు.2023 జనవరి 1 నుంచి రూ. రూ. 2,750 కి పెంచి పంపిణీ చేస్తోంది. ఇప్పుడు తాజాాగా దీన్ని 3 వేలకు పెంచనుంది.

YSR Pension kanuka: ఏయే పెన్షన్‌ పథకానికి ఎవరు అర్హులు

1. వృద్ధాప్య పెన్షన్: వృద్ధాప్య పెన్షన్‌ పొందేందుకు 60 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి.

2. చేనేత కార్మికులకు పెన్షన్: వైఎస్సార్ పెన్షన్ స్కీమ్‌లో చేరాలంటే 50 ఏళ్లు నిండి ఉండాలి.

3. వితంతు పెన్షన్: 18 ఏళ్లకు పైబడిన వయస్సు ఉండి భర్త మరణించిన వారు

4. వికలాంగ పెన్షన్: 40 శాతం వైకల్యం కలిగి ఉన్న వారు అర్హులు. వయోపరిమితి లేదు.

5. గీతకార్మికులు: 50 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులు. కల్లు గీత సహకార సంఘాల్లో సభ్యుడు అయి ఉండాలి. లేదా టీఎఫ్‌టీ స్కీమ్‌ కింద కల్లుగీత కార్మికుడై ఉండాలి.

6. ఏఆర్టీ పెన్షన్: యాంటీ రెట్రో వైరల్‌ థెరఫీ కోసం ఆర్థిక సాయం. దీనికి వయో పరిమితి లేదు. ఆరు నెలల పాటు చికిత్స పొంది ఉండాలి.

7. లింగమార్పిడి పెన్షన్: ట్రాన్స్‌జెండర్లకు 18 ఏళ్ల వయస్సు ఉంటే పెన్షన్‌కు అర్హులు.

8. మత్స్యకారుల పెన్షన్: 50 ఏళ్ల వయస్సు ఉన్న మత్స్యకారులు పెన్షన్లకు అర్హులు.

9. ఒంటరి మహిళ పెన్షన్: వివాహం చేసుకున్న మహిళలకు భర్త నుంచి విడిపోయినప్పుడు, భర్త దూరం చేసినప్పుడు ఏడాది కాలం తరువాత పెన్షన్‌ పొందేందుకు అర్హులవుతారు. అలాగే అవివాహితగా ఉండి 30 ఏళ్లు నిండిన గ్రామీణ మహిళలకు, 35 ఏళ్లు నిండిన పట్టణ మహిళలకు కూడా పెన్షన్‌ పొందే అవకాశం ఉంది.

10. చెప్పులు కుట్టేవారికి: సాంప్రదాయంగా చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న వారికి 40 ఏళ్లు నిండితే పెన్షన్‌ లభిస్తుంది.

11. డప్పు కళాకారులకు: 50 ఏళ్లు నిండి ఉంటే పెన్షన్‌ లభిస్తుంది.

12. సీకేడీయూ పెన్షన్: కిడ్నీ డయాలసిస్‌ అవసరమైన పేషెంట్లకు లభిస్తుంది. దీనికి వయో పరిమితి లేదు.

వృద్ధాప్య పెన్షన్‌ తదితర 12 రకాల పెన్షన్లలో కొత్తగా దరఖాస్తు చేయదలిచిన వారు గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో సంప్రదించాలి. అక్కడి వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ దరఖాస్తు భర్తీ చేసేందుకు సహకరిస్తారు. ఈ దరఖాస్తు గ్రామ సభ పరిశీలనకు, ఆ తదుపరి ఎంపీడీవో పరిశీలనకు లేదా మున్సిపల్‌ కమిషనర్‌ పరిశీలనకు వెళుతుంది. అక్కడి నుంచి డీఆర్‌డీఏ కార్యాలయంలో ఆమోదం పొందితే పెన్షన్‌ ఎంపీడీవో కార్యాలయం, గ్రామ సచివాలయం ద్వారా లబ్ధిదారులను చేరుతుంది.

Whats_app_banner