AP Sachivalayam Employees : సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు, ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు నమోదు-ap govt orders grama ward sachivalayam staff three time daily biometric attendance ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Sachivalayam Employees : సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు, ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు నమోదు

AP Sachivalayam Employees : సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు, ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు నమోదు

Bandaru Satyaprasad HT Telugu
Sep 10, 2024 05:11 PM IST

AP Sachivalayam Employees : ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశించింది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు హాజరు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.

సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు, ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు నమోదు
సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు, ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు నమోదు

AP Sachivalayam Employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోజులో మూడు సార్లు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు ముందు, మధ్యాహ్నం 3 గం.లకు, సాయంత్రం 5 గంటల తర్వాత హాజరు వేయాలని జీవో జారీ చేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ఈ నిబంధన ఉండగా, బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కావడంలేదన్న ఆరోపణలతో...తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి రోజుకు మూడుసార్లు హాజరు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు హాజరు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.

సెప్టెంబర్ 15 వరకు బదిలీలకు దరఖాస్తులు

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా ఆగస్టు 31వ వరకు బదిలీలకు అవకాశం కల్పించగా... పెన్షన్ల పంపిణీ, వర్షాల నేపథ్యంలో బదిలీల ప్రక్రియను సెప్టెంబర్ 15వ వరకు పొడిగించారు. బదిలీలు కోరుకునే ఉద్యోగులు తమ వివరాలతో ఆన్‌లైన్‌ లో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వైసీపీ ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. 2020 నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టింది. అయితే గత ప్రభుత్వం ఎలాంటి బదిలీలు చేపట్టలేదు. తాజాగా కూటమి సర్కార్‌ సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు బదిలీలకు అవకాశం కల్పించింది. అయితే పాలనా అత్యవసరాల దృష్ట్యా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు జిల్లా పరిధిలో ఏ సచివాలయానికైనా బదిలీ అవకాశం కల్పిస్తారు.

సచివాలయ శాఖ ప్రక్షాళన!

ఏపీలో వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో కూడా ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. సచివాలయాల శాఖపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అవసరాన్ని మించి ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దీంతో అదనపు ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 1,26,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

ఒక్కో సచివాలయంలో 11 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం...వీరిలో కొంత మందికి సరైన విధులు లేవని అభిప్రాయపడింది. అటువంటి వారిని మండల, డివిజన్‌ స్థాయిలోని ప్రభుత్వ ఆఫీసుల్లో నియమించాలనే ఆలోచన చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను ఇరిగేషన్‌ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేసింది. దాదాపుగా 660 మందిని ఏఈలుగా నియమించాలని ఇటీవల జలవనరులు శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ను ప్రభుత్వం ఆదేశించింది. పనిలేకుండా ఉన్న వారిని మిగతా శాఖల్లో సర్దుబాటుచేసి, సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత కథనం