Rajiv Gandhi statue: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం.. బీఆర్ఎస్ నేతల అభ్యంతరం-statue of rajiv gandhi was installed in front of the telangana secretariat ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rajiv Gandhi Statue: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం.. బీఆర్ఎస్ నేతల అభ్యంతరం

Rajiv Gandhi statue: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం.. బీఆర్ఎస్ నేతల అభ్యంతరం

Basani Shiva Kumar HT Telugu
Aug 16, 2024 01:48 PM IST

Rajiv Gandhi statue: తెలంగాణ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు సంకల్పించింది. దీనిపై రాజకీయ రగడ రాజుకుంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ ఖండిస్తోంది.

సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం
సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం

సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పరిశీలించారు. ఈ నెల 20వ తేది రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా.. విగ్రహావిష్కరణ ఉండడంతో పనులను పరిశీలించినట్టు మంత్రులు వెల్లడించారు.

రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై బీఆర్ఎస్ భగ్గుమంది. అధిష్టానం మెప్పు కోసం రేవంత్ రెడ్డి సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని.. ఆయన వలసవాద పుత్రుడని దేశపతి శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ స్వాభిమానం మీద దాడి చేస్తోందన్న దేశపతి.. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక జై తెలంగాణ నినాదం మసక బారిపోయిందన్నారు. జై తెలంగాణ స్థానంలో జై సోనియా, జై కాంగ్రెస్ నినాదాలు తెచ్చారని ఆక్షేపించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ అధికార చిహ్నంలోని చార్మినార్, కాకతీయ తోరణాలను రాచరిక చిహ్నాలని హేళన చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోసారి తెలంగాణ స్వాభిమానాన్ని దెబ్బతీసేందుకు సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నివాళిగా సచివాలయానికి ఆయన పేరు పెట్టామని గుర్తుచేశారు.

సచివాలయం ఎదురుగా అమరజ్యోతి భవనం ఏర్పాటు చేసిన ఉద్దేశం.. నిత్యం అమరుల స్ఫూర్తిగా పాలన జరగాలనే అని దేశపతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సచివాలయం, అమరజ్యోతి మధ్య ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమేనని స్పష్టం చేశారు. సచివాలయంలో ఉండాల్సింది వ్యక్తులు, నాయకుల విగ్రహం కాదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కావాలా రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కావాలా ప్రజలు తేల్చుకోవాలని స్పష్టం చేశారు. కావాలంటే రాజీవ్ గాంధీ విగ్రహాలు బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చని.. సచివాలయం ఎదుట పెట్టకూడదని హితవు పలికారు దేశపతి శ్రీనివాస్.