Chandrababu PS : చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ సస్పెండ్ - ఏపీ సర్కార్ ఉత్తర్వులు
Chandrababu Latest News: టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Chandrababu Former Personnel Secretary P Srinivas : చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) పి.శ్రీనివాస్‌ను ఏపీ సర్కార్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. . ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్రీనివాస్… ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నాడు. స్కిల్ స్కామ్ లో శ్రీనివాస్ పేరు ఉండటంతో పాటు ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నట్లు సీఐడీ చెబుతోంది. ఆయన తిరిగి రాష్ట్రానికి రావాలని కొంతకాలంగా కోరుతూ ఉండగా... సెప్టెంబర్ 29వ తేదీని గడువుగా నిర్ణయించింది. అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో… ఏపీ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెండ్యాల శ్రీనివాస్ కొంత కాలం పీఎస్(వ్యక్తిగత కార్యదర్శి)గా పని చేశారు. ఈ క్రమంలో స్కిల్ కేసులో శ్రీనివాస్ పేరును కూడా తెరపైకి తీసుకువచ్చింది ఏపీ సీఐడీ. ఆయన్ను విచారిస్తే… మరికొంత సమాచారం దొరుకుతుందని భావిస్తోంది. ప్రభుత్వంలో ఉద్యోగిగా పని చేస్తున్న శ్రీనివాస్… సమాచారం ఇవ్వకుండా అమెరికా వెళ్లారని సీఐడీ ఆరోపిస్తోంది. కేసు విషయం బయటికి రావటంతోనే ఇలా చేశారని చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయనకు విధించిన డెడ్ లైన్ ముగియటంతో… సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసింది సర్కార్. దీనిపై శ్రీనివాస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Inner Ring Road Case : మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబరు 3కు వాయిదా వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ లూథ్రా వాదనలు వినిపించగా… ఏపీ సీఐడీ తరపున తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత… పలు కేసులను తెరపైకి తీసుకువస్తోంది సీఐడీ. ఈ మేరకు పీటీ వారంట్లను దాఖలు చేసింది. ఇందులో ఒకటిగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఉంది. ఈ కేసులో ఇంతవరకు వారిని అరెస్ట్ చేయలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబును ఇందులోనూ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ నిర్ణయించింది. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో కూడా రిమాండ్ ఖైదీగా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరాలని నిర్ణయించి.. పీటీ వారంట్ దాఖలు చేసింది. న్యాయస్థానం అనుమతిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో కూడా చంద్రబాబు అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఈ కేసులో కూడా ఆయన్ని విచారించేందుకు తమ కస్టడీకి కోరనుంది. దీంతో కేసు దర్యాప్తులో మరింత పురోగతి సాధించవచ్చని సీఐడీ భావిస్తోంది.
స్కిల్ స్కామ్ లో టీటీడీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే హైకోర్టులో ఊరట లభించకపోవటంతో… సుుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. అయితే ఇక్కడ కూడా వాయిదా పడింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసూ ఆదేశాలు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు గత వారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
త్వరలో చంద్రబాబు పిటిషన్ మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉండగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు ఇచ్చే ముందు తమ తరపు వాదనలు కూడా వినాలని పిటిషన్ లో ప్రస్తావించింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయని తెలిపింది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారని… నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్ చేసుకున్నారని పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయని… ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీనే అని చెప్పింది. ఈ కేసులో తమ తరపున వాదనలను వినిపిస్తామని కేవియట్ పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరింది.