AP Liquor Privilege Fee : విదేశీ మద్యంపై అదనపు ప్రివిలేజ్ ఫీజు, క్వార్టర్ ధర మాత్రం రూ.99లకే
AP Liquor Privilege Fee : భారత్ లో తయారయ్యే విదేశీ మద్యం ఎమ్మార్పీపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మార్పీలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాలకు రౌండాఫ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే క్వార్టర్ బాటిల్ ధర మాత్రం రూ.99 లకే నిర్థారించింది.
భారత్ లో తయారయ్యే విదేశీ మద్యం ధరకు అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫీజు కింద ఎమ్మార్పీలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు రౌండాఫ్ చేసింది. విదేశీ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ఏపీ ప్రభుత్వం సవరణ చేసింది. దీనికి గవర్నర్ ఆమోదం మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 గా ఉంటే దానిని రూ. 160కు ప్రివిలేజ్ ఫీజు పెంచి రౌండాఫ్ చేశారు. క్వార్టర్ బాటిల్ ధర రూ.90.50గా ఉంటే అదనపు ప్రివిలేజ్ ఫీజు కలిపి రూ.100 చేశారు. అయితే క్వార్టర్ బాటిల్ ధర ప్రభుత్వం రూ. 99 కే నిర్ధారించడంతో రూ. 100లో రూ.1 మినహాయించి విక్రయిస్తారని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.
మద్యం టెండర్లు-90 వేల దరఖాస్తులు
ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు శుక్రవారం రాత్రి 7.00 గంటలకు ముగిసిన విషయం తెలిసిందే. ఈసారి మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. మొత్తం 3396 మద్యం షాపులుండగా.... 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. వైన్ షాపుల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1792 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా మద్యం షాపులకు అధిక దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
శుక్రవారం రాత్రి 11 గంటలకు మద్యం షాపులకు 89,643కు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. నాన్‌రిఫండబుల్ ఫీజుల రూపంలో రూ.1,792.83 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయితే గడువు ముగిసే సమయానికి చాలా మంది మద్యం వ్యాపారులు ఎక్సైజ్ స్టేషన్లలో క్యూలైన్లలోనే ఉండగా, మరికొందరు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. రుసుములకు సంబంధించిన డీడీలు, చలానాలు తీసుకునేందుకు వారికి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు అవకాశం కల్పించారు. మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యే సమయానికి దరఖాస్తుల సంఖ్య 90 వేలు దాటొచ్చని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు.
రూ.1800 కోట్ల ఆదాయం!
ఈసారి మద్యం షాపుల దరఖాస్తులకు రూ.1800 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 3396 మద్యం షాపులకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఒక్కో దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో మద్యం షాపుల కోసం పోటీ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపులకు అత్యధికంగా 5787 అప్లికేషన్లు వచ్చాయి. ఈ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 51 దరఖాస్తులు అందాయి. అత్యధిక దరఖాస్తులు వచ్చిన దుకాణాలు ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాయి. 2017లో ప్రైవేట్ మద్యం పాలసీకి నోటిఫికేషన్ ఇవ్వగా.... 4380 మద్యం దుకాణాలకు 76 వేల అప్లికేషన్లు వచ్చాయి. అప్లికేషన్లు, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ఎక్సైజ్ శాఖకు రూ.474 కోట్ల ఆదాయం సమకూరింది.
సంబంధిత కథనం