AP Free Sand : ఇసుక టన్ను రూ.1225, రూ.1394 అంటూ బ్యానర్లు- ఇదేం ఉచిత ఇసుక విధానమని ప్రతిపక్షాల సెటైర్లు
AP Free Sand : ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని ఇసుక రీచ్ ల వద్ద టన్ను ఇసుక భారీగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రీచ్ లో వద్ద పెట్టిన బ్యానర్లు వైరల్ అవుతున్నాయి.
AP Free Sand : ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. కేవలం ఎగుమతి, దిగుమతి, రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇసుక రేట్లు దిగొచ్చాయి. కానీ దూర ప్రాంతాలకు రవాణాపై ఖర్చులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇసుక టన్ను రూ.1,225, రూ.1,394 అంటూ పలు చోట్ల బ్యానర్లు వెలిశాయి. ఇది సంచలనం మారింది. ఇంత ధర ఉంటే ఇందులో ఉచిత ఇసుక ఎక్కడుంది? అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆ బ్యానర్లు వైరల్ అవుతున్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం ఇసుకపై దోచుకుందని, తమ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక ఇస్తామని టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానం అమలు చేశారు. అయితే ఈ ప్రకటన వల్ల ఇసుక అమ్మకున్నోళ్లకి ఉచితం ఉంది. కానీ ఇసుక కొనేవాడికి మాత్రం ఉచితం లేదని స్పష్టం అవుతుంది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంపై విధి విధానాలు ప్రకటించింది. కొత్త ఇసుక పాలసీని అమలులోకి తీసుకొచ్చింది. 2019, 2021లో తీసుకొచ్చిన ఇసుక పాలసీలను రద్దు చేస్తూ 2024 ఇసుక పాలసీని అమల్లోకి తీసుకొస్తూ జీవో నంబర్ 49ని విడుదల చేసింది.
అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇసుకను అమ్మకానికి సంబంధించిన టన్ను ధరతో కూడిన బ్యానర్లను పెట్టింది. అయితే ఇసుక ధర ఒక్కొ ఇసుక స్టాక్ వద్ద ఒక్కో విధంగా ఉంది. అనంతపురం జిల్లాలో అత్యంత తక్కువ ధర ఉండగా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అత్యంత ఎక్కువ ధర ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గోదావరి నదీ పరివాహక ప్రాంత జిల్లాల్లో కూడా ఇసుక ధర టన్ను దాదాపుగా రూ.800 నుంచి రూ.1,000 వరకు ఉంటుంది.
విశాఖపట్నం జిల్లాలో అగనంపూడి ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ప్రభుత్వం బ్యానర్ పెట్టింది. స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక రూ.1,394 ఉంది. అంటే టాక్టర్ (మూడు టన్నుల) ఇసుక రూ. 4,182 అవుతుంది. ఇసుక ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్ముతారు. అయితే వినియోగదారుని ఇంటికి వచ్చే సరికి మరో 20 శాతం అదనంగా అవుతుంది. అనకాపల్లి జిల్లాలో గబ్బాడ (నర్సీపట్నం) ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ప్రభుత్వం బ్యానర్ పెట్టింది. స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక రూ.1,225 ఉంది. టాక్టర్ (మూడు టన్నుల) ఇసుక రూ.3,675 అవుతుంది. అయితే వినియోగదారుని ఇంటికి వచ్చే సరికి మరో 20 శాతం అదనంగా అవుతుంది. ఒక లారీ ఇసుకకు దాదాపు రూ.3,000 అదనంగా వసూలు చేస్తున్నారు. దీనివల్ల ఉచిత ఇసుకతో పెద్దగా ప్రయోజనం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
అయితే ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పింది. అలాగే ప్రభుత్వానికి సీనరైజ్ టన్నుకు రూ.88 తప్ప మరేది అవసరం లేదని చెబుతుంది. అలాంటప్పుడు రవాణా ఛార్జీకి ఇంత అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వానికి ఇసుక వల్ల ఏటా రూ.780 కోట్లు వచ్చేవి. కానీ ఈ ప్రభుత్వానికి రూపాయి కూడా అవసరం లేదని చెబుతుంది. ప్రజల నుంచి వసూలు చేసే ఈ మొత్తం డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు వరద నీరు రావడంతో రీచ్‌ల వద్ద ఇసుక తవ్వకాలు లేకుండా, కేవలం స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకనే అమ్ముతున్నారు. అలాంటప్పుడు ఇప్పుడే ఇంత ధర ఉంటే, సెప్టెంబర్ తరువాత వరదలు తగ్గి, ఇసుక రీచ్‌ల వద్ద ఇసుక తవ్వకాలు నిర్వహిస్తే అప్పుడు ఇసుక ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇళ్లు నిర్మాణాలు చేపట్టే వారిపైన, భవన నిర్మాణ కార్మికులపై మళ్లీ ఇసుక ధర ప్రభావం పడుతుందని అంటున్నారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం