APPSC Group 1 : 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు రద్దు - ఏపీ హైకోర్టు సంచలన తీర్పు-ap 2018 group 1 mains exams canceled by ap high court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group 1 : 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు రద్దు - ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

APPSC Group 1 : 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు రద్దు - ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 13, 2024 03:27 PM IST

APPSC 2018 Group -1 Mains : ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 2018లో నిర్వ‌హించిన ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది.

ఏపీ గ్రూప్ 1
ఏపీ గ్రూప్ 1

APPSC Group -1 Mains : 2018 గ్రూప్-1 పరీక్ష(APPSC Group -1 Mains) పేపర్ల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. రెండోసారి, మూడోసారి మూల్యాంకనం చేయటం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. 2018 గ్రూప్-1 మెయిన్స్(AP Group 1 Mains) పరీక్ష రద్దు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. 6 నెలల్లోగా పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీకి(APPSC) ఆదేశాలు ఇచ్చింది.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. అయితే జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి… రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని అభ్యర్థులు ఆరోపిస్తూ వచ్చారు. ఇదే విషయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతుంది. ఇరువైపు వాదన విన్న కోర్టు… ఇవాళ తీర్పును ప్రకటించింది. మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని.. ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైకోర్టు రద్దు చేసింది.

స్పందించిన ఏపీ ప్రభుత్వం….

2018 గ్రూప్ -1పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్నవారి ప్రయోజనాలను కాపాడుతామని పేర్కొంది. వారి తరఫున న్యాయపోరాటం చేస్తామని… హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. ఎవరికీ ఆందోళన అవసరం లేదని, వారి ప్రయోజనాలను పరిరక్షిస్తుందని స్పష్టంచేసింది.

2018లో 167 పోస్టుల భర్తీ గ్రూప్-1 నోటిఫికేషన్ ను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షల అనంతరం మెయిన్స్ ను నిర్వహించింది.  అయితే  గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ పత్రాలు డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత రెండుసార్లు మూల్యాంకన చేశారంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాము నిబంధనల మేరకే మూల్యాంకనం చేశామని ఏపీపీఎస్సీ వాదనలు వినిపించింది. ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు గ్రూప్-1 మెయిన్స్‌ రద్దు చేసి, మరో 6 నెలల్లో మెయిన్స్ నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. 

అప్పీల్ కు వెళ్తే అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇటీవలే తెలంగాణలోనూ ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకున్నాయి. పేపర్ లీక్ కారణంగా ఓ సారి తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పరీక్షను నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. బయోమెట్రిక్ విధానంలోని పలు సమస్యలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు… పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.  దీనిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం… సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.