Why not Andhra Pradesh: వై నాట్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ప్రజల్లోకి కాంగ్రెస్
Why not Andhra Pradesh: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహం మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ వై నాట్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఏపీలో కూడా రాహుల్, ప్రియాంక, ఖర్గే, రేవంత్‌లతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
Why not Andhra Pradesh: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఏపీలో కార్యాచరణపై దృష్టి పెట్టారు. త్వరలో ఏపీ రాజకీయ కార్యాచరణపై పార్టీ ముఖ్యులతో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఏపీ కాంగ్రెస్‌కు సమాచారం అందింది.
విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సిన కార్యకర్రమాలపై విధానపరమైన నిర్ణయాలపై చర్చించారు.త్వరలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కర్ణాటక సిఎం, డిప్యూటీ సిఎం, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలను కూడా ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తామని పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు తెలిపారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ సహాయ సహకారాలను కూడా ఏపీ కాంగ్రెస్ వినియోగించుకుంటుందని చెప్పారు. త్వరలో ఢిల్లీలో కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ ఉంటుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక క్యాటగిరీ తమ ప్రధాన అజెండా అని రుద్రరాజు చెప్పారు. విభజన హామీల విషయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
రాష్ట్ర విభజన సందర్భంగా సోనియా గాంధీ సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ విషయంలో ఏపీలోని రాజకీయ పార్టీల వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రత్యేక హోదా, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, రాయితీలు, ఆస్తుల పంపకాలు వంటి అంశాలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
వైనాట్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీలో ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు రుద్రరాజు చెప్పారు. ఢిల్లీలో రాహుల్, మల్లికార్జున ఖర్గేల వద్దకు వెళ్లే ముందే సమగ్రమైన ప్రతిపాదనలతో కార్యాచరణ రూపొందించినున్నట్టు తెలిపారు.
విజయవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో క్రిస్టఫర్, మయప్పన్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, పల్లం రాజు, జెడి శీలం, తులసీరెడ్డి, చింతా మోహన్, కె.రాజు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధనాలపై వంద రోజుల క్యాంపెయిన్ నిర్వహించబోతున్నట్లు కాంగ్రెస్ ముఖ్య నాయకులు తెలిపారు. ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ రానున్నఎన్నికల్లో సత్తా చాటేలా నాయకుల్ని ఏకంగా చేసేందుకు పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది.