TSPSC Exam Date Updates 2024 : టీఎస్పీఎస్పీ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. కీలకమైన గ్రూప్ 1 మెయిన్స్ తో పాటు గ్రూప్ 2, 3 పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు(TSPSC Group 2) ఉండగా… నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు(TSPSC Group 3) ఉంటాయని కమిషన్ వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు(TSPSC Group 1 Mains 2024) జరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.
గ్రూప్1 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 563 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక గ్రూప్2 కింద 783, గ్రూప్ 3 కింద 1388 పోస్టులను భర్తీ చేయనుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రద్దు చేసిన కమిషన్… ఇటీవలే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
TSPSC Group 1 Preliminary Exam 2024: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఇప్పటికే ఖరారైంది. జూన్ 9వ తేదీన పరీక్షను(TSPSC Group 1 Preliminary Exam) నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్దిరోజుల కిందట ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా… మొత్తం 563 గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మార్చి 14వ తేదీ అప్లికేషన్ల గడువు ముగియనుంది.. అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది.
గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 19,2024.
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 23, 2024.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - మార్చి 03,2024.
దరఖాస్తుల సవరణకు అవకాశం - మార్చి 23 నుంచి మార్చి 27,2024.
హాల్ టికెట్లు డౌన్లోడ్ - పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి అందుబాటులోకి వస్తాయి.
అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ. 200గా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు రూ. 120గా నిర్ణయించారు. అయితే నిరుద్యోగులకు ఈ ఫీజు(ఎగ్జామినేషన్ ఫీజు) నుంచి మినహాయించారు.
33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.
ప్రిలిమినరీ పరీక్ష - జూన్ 09 2024.
మెయిన్స్ పరీక్షలు - సెప్టెంబర్/ అక్టోబరు 2024.
అధికారిక వెబ్ సైట్ - https://www.tspsc.gov.in
ఇక 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది కమనషన్. అయితే నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది టీఎస్పీఎస్సీ. కానీ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఈ తేదీలు కూడా ఫైనల్ కాలేదు.
ఇటీవలే ఉద్యోగాల భర్తీపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం…. స్పీడ్ పెంచింది. కమిషన్ ను కూడా ప్రక్షాళన చేసింది. కొత్త ఛైర్మన్, సభ్యుల ఎంపిక తర్వాత వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. దీనికితోడు గతంలో పెండింగ్ లో ఉన్న ఫలితాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే… గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల తేదీలు కూడా ఖరారయ్యాయి.