అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి ఆత్మహత్య, ఇంటికి సమీపంలోనే మృతదేహం గుర్తింపు-anakapalli girl murder case accused commits suicide body identified near accuseds house ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి ఆత్మహత్య, ఇంటికి సమీపంలోనే మృతదేహం గుర్తింపు

అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి ఆత్మహత్య, ఇంటికి సమీపంలోనే మృతదేహం గుర్తింపు

Sarath chandra.B HT Telugu
Jul 11, 2024 08:35 AM IST

Accused Murder: ఏపీలో సంచలనం సృష్టించిన అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు సురేష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆత్మహత్యకు పాల్పడిన బాలిక హత్య కేసు నిందితుడు
ఆత్మహత్యకు పాల్పడిన బాలిక హత్య కేసు నిందితుడు

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి విద్యార్ధిని గొంతు కోసి హత్య చేసిన కేసులో నిందితుడు బోడా బత్తుల సురేష్‌ మృతదేహం లభ్యమైంది. నిందితుడి ఇంటికి సమీపంలోనే మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. బాలికను హత్య చేసిన ప్రాంతంలో 15పేజీల లేఖను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానించారు. 

ఈనెల 6న‌ అన‌కాప‌ల్లి జిల్లా రాంబిల్లి మండ‌లం కొప్పుగుండుపాలెం గ్రామానికి చెందిన తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ బ‌ద్ది ద‌ర్శినిని బోడాబ‌త్తుల సురేష్ (26) హ‌త్య చేశాడు. ఘటన జరిగిన ప్రాంతంలో నిందితుడు రాసిన లేఖలో తనను క్షమించాలని కోరాడు. 13పేజీల లేఖలో కొంత భాగం హత్య చేసిన తర్వాత రాసినట్టు గుర్తించారు. హతురాలు తనను దూరం పెట్టడాన్ని భరించలేక హత్య చేయాలని భావించినట్టు అందులో పేర్కొన్నాడు.

ఏం జరిగిందంటే…

రాంబిల్లి మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్‌లో బ‌ద్ది ద‌ర్శిని తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతుంది. క‌శింకోట‌కు చెందిన బోడాబ‌త్తుల సురేష్(26) కొప్పుగుండుపాలెంలోని అమ్మ‌మ్మ ఇంటి వ‌ద్ద ఉంటున్నాడు. జూలాయిగా తిరిగే ఆ ప్రేమోన్మాది ఏడాదిగా ఆ బాలిక వెంట ప‌డ్డాడు. ప్రేమ పేరుతో ఆ బాలిక‌ను వేధించేవాడు. అయితే ద‌ర్శిని అందుకు నిరాక‌రించింది. సురేష్ వేధింపులు తాల‌లేక‌ త‌ల్లిదండ్రుల‌కు విష‌యం చెప్పింది. త‌ల్లిదండ్రులతో క‌లిసి రాంబ‌ల్లి పోలీస్ స్టేష‌న్‌ను ఆశ్ర‌యించింది.

ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సురేష్‌పై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఆ కేసుపై సురేష్‌ను జైలుకు కూడా పంపారు. దీంతో ఆ బాలిక‌పై క‌క్ష పెంచుకున్న సురేష్‌ ఇటీవల బెయిల్‌పై విడుద‌ల అయ్యాడు. ద‌ర్శినిని ఎలాగైనా హ‌త‌మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీంతో ద‌ర్శిని స్కూల్ నుంచి వ‌చ్చేస‌రికి త‌ల్లిదండ్రులు ప‌నులు ముగించుకుని ఇంటికి రార‌ని, అదే స‌మ‌యంలో హ‌త్య చేయాల‌ని భావించాడు.

ద‌ర్శిని రోజులానే జులై 6, శ‌నివారం పాఠ‌శాల‌ నుంచి సాయంత్రం ఇంటికి వ‌చ్చింది. అయితే ఇంట్లో ఎవ‌రూ లేర‌ని భావించి బాలిక ఇంట్లోకి సురేష్ దూరి, వేట కొడ‌వ‌లితో హ‌తమార్చ‌ాడు. హ‌త్య చేసి కొద్ది సేప‌టికి సురేష్ ఇంట్లో నుంచి బ‌య‌టకు వ‌చ్చాడు. దీన్ని బాలిక నాన‌మ్మ కాంతం చూశారు. అనుమానంతో వెంట‌నే ఇంటి లోప‌లికి వెళ్లి చూసింది. ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న మ‌న‌వ‌రాలిని చూసి కేక‌లు వేసింది. అప్పటికే అతను పరారయ్యాడు.

WhatsApp channel