Bandaru Satyanarayana : మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్, రెండు కేసులు నమోదు
Bandaru Satyanarayana : మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసుల్లో ఆయనను అరెస్టు చేశారు.
Bandaru Satyanarayana : మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సత్యనారాయణ మూర్తికి నోటీసులు అందజేశారు. 41ఏ, 41బీ సెక్షన్ల కింద పోలీసులు నోటీసులు తయారుచేశారు. మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బండారు సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఆయన ఇంటికి తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోపలకు పంపేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.
రెండు కేసులు
మాజీ మంత్రి బండారు సత్యారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు…ఆయనను గుంటూరు తరలిస్తున్నారు. బండారు సత్యారాయణపై రెండు కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజాను దూషించారని కేసులు నమోదు చేశారు. అయితే బండారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
చివరికి అరెస్టు
గుంటూరు పోలీసులు నోటీసులతో బండారు సత్యనారాయణ ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, మహిళలు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండారు ఇంట్లోకి వెళ్లిన పోలీసులు... ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. బండారుకు బీపీ, షుగర్ ఎక్కువగా ఉండడంతో... పోలీసులు బండారు ఇంట్లోనే వేచిచూసి, చివరకు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. బండారు ఇంటికి చేరుకున్న టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు... పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసులు ఎక్కడపడితే అక్కడ 144 సెక్షన్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణ భార్య పరవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. అసెంబ్లీలో భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పోలీసులు, మహిళా కమిషన్ ఏమైపోయిందని మండిపడ్డారు. మంత్రి రోజాకు రాజకీయ జీవితం ఇచ్చిందే టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మరోవైపు బండారు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.
బండారు ఇంటి వద్ద ఉద్రిక్తత
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచి భారీగా పోలీసులు మోహరించారు. మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వెన్నెలపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండారు సత్యనారాయణ సతీమణి మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎటువంటి నోటీసులు లేకుండా నిన్న రాత్రి నుంచి పోలీసులు తమను గృహ నిర్బంధం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులు తమను భయాందోళనలకు గురిచేశారని ఆరోపించారు. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. పలువురు వైసీపీ నేతలు గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో బండారుపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బండారు సత్యనారాయణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి బండారు ను అరెస్టు చేశారు.