Nara Lokesh : రెండో రోజు విచారణలోనూ ఐఆర్ఆర్ కు సంబంధం లేని ప్రశ్నలే- లోకేశ్
Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ అధికారులు లోకేశ్ ను రెండో రోజు విచారించారు. ఐఆర్ఆర్ కు సంబంధంలేని ప్రశ్నలు తిప్పి తిప్పి అడిగారని లోకేశ్ అన్నారు.
Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు విచారణ ముగిసింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆరు గంటల పాటు లోకేశ్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. సీఐడీ విచారణ అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. రెండో రోజు విచారణలో సీఐడీ అధికారులు 47 ప్రశ్నలు అడిగారని లోకేశ్ తెలిపారు. హైకోర్టు ఒక్క రోజే విచారణకు హాజరు కావాలని చెప్పినా, సీఐడీ అధికారుల సూచన మేరకు రెండో రోజు కూడా విచారణకు హాజరయ్యానన్నారు. రెండో రోజు విచారణలో నిన్న అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారన్నారు. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్ తన ముందు ఉంచి ప్రశ్నించారన్నారు. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ మీ వద్దకు ఎలా వచ్చిందని సీఐడీ అధికారులను అడిగితే సమాధానం చెప్పలేదన్నారు. ఐఆర్ఆర్ కేసులో తన శాఖకు సంబంధంలేని ప్రశ్నలు అడిగారన్నారు. మళ్లీ విచారణకు పిలుస్తారా? అని అడిగితే సమాధానం చెప్పలేదన్నారు.
అద్దె చెల్లించి ఇంట్లో ఉంటే క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?
ఇన్నర్ రింగ్ రోడ్లులో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ తెలిపారు. పదేళ్ల నుంచి మా కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటిస్తున్నామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనకు అనేక పనులుంటాయని, రెండు రోజుల పాటు తన సమయం వృథా చేశారని ఆరోపించారు. స్కిల్ కేసులో సంతకాలు పెట్టిన ఇద్దరు అధికారులను ఎందుకు విచారించడంలేదని లోకేశ్ ప్రశ్నించారు. కేవలం పాలసీ ఫ్రేమ్ చేసిన చంద్రబాబును కక్షపూరితంగా రిమాండ్‌కు పంపారన్నారు. వ్యవస్థల్ని మేనెజ్ చేసి రాజకీయ కక్షసాధిస్తున్నారని ఆరోపించారు. లింగమనేని రమేశ్ ఇంట్లో అద్దెకు ఉంటూ రూ.27 లక్షలు అద్దె అడ్వాన్స్ కట్టామన్నారు. రెంటల్ అడ్వాన్స్‌కు ఐటీ రిటర్న్స్‌లో లేదని సీఐడీ అధికారులు అన్నారని, ఐటీ రిటర్న్‌లకు సంబంధించి ఆడిటర్‌ను అడగాలని తెలిపానన్నారు. ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తే క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని లోకేశ్ ప్రశ్నించారు.
లోకేశ్ ను అడిగిన ప్రశ్నలు
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పునకు అధికారులను ఒత్తిడి చేశారా?, మీరు మంత్రి అవ్వగానే కేబినెట్ సబ్ కమిటీలో ఎందుకు చేర్చారు?. మంత్రి వర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను ఐఆర్ఆర్ గురించి ఒత్తిడి చేశారా?. హెరిటేజ్, లింగమనేని, నారాయణ భూములకు లబ్ధి చేకూర్చేందుకు అలైన్‌మెంట్ ఎందుకు మార్చారు?. ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పరిహారాన్ని భారీగా పెంచడంలో మీ పాత్ర ఉందా?. భూసేకరణ వ్యయాన్ని రూ.210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారు?. లింగమనేని రమేష్ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు? అని నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు ప్రశ్నలు సంధించారు. రెండో రోజు సీఐడీ అధికారులు లోకేశ్ ను 47 ప్రశ్నలు అడిగారు.