AP Volunteers : రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోం- మంత్రి బాల వీరాంజనేయ స్వామి-amaravati minister bala veeranjaneya swamy states resigned volunteers donot get jobs again ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Volunteers : రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోం- మంత్రి బాల వీరాంజనేయ స్వామి

AP Volunteers : రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోం- మంత్రి బాల వీరాంజనేయ స్వామి

Bandaru Satyaprasad HT Telugu
Jun 18, 2024 04:14 PM IST

AP Volunteers : వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోమని స్పష్టం చేశారు.

రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోం- మంత్రి బాల వీరాంజనేయ స్వామి
రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోం- మంత్రి బాల వీరాంజనేయ స్వామి

AP Volunteers : గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు వాలంటీర్ వ్యవస్థను వినియోగించింది. అయితే ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించవద్దని ఈసీ చెప్పడంతో... చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రత్యక్షంగా వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే వాలంటీర్లు రాజీనామాలు చేయొద్దని, వైసీపీ ప్రచారం చేయొద్దని అప్పట్లో కూటమి పార్టీలు కోరారు. తమ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చాయి. వైసీపీ నేతల ఒత్తిడితో రాజీనామాలు చేశామని, తమను మళ్లీ వాలంటీర్లుగా తీసుకోవాలని కొందరు కోరుతున్నారు. తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఫిర్యాదులు చేస్తున్నారు.

yearly horoscope entry point

రాజీనామా చేసిన వాలంటీర్లను తీసుకోం

వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన మంత్రి డోలా... వైఎస్ జగన్ వైఫల్యాలు, అరాచకాలపై ప్రజలు తిరగబడ్డారన్నారు. జులై 1వ తేదీనే లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. రూ.4వేల పింఛన్‌తో పాటు మూడు వేలు కలిపి రూ.7 వేలు అందిస్తామన్నారు. రాజీనామాలు చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో పని చేయించుకుంటామన్నారు. వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్ల నుంచి మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి తీసుకోమని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.

బలవంతంగా రాజీనామాలు

వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. రాజీనామాలు చేసిన వారి నుంచి పెద్దఎత్తున వినతులు వస్తున్నాయన్నారు. అయితే రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను మాత్రమే కొనసాగిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు దక్కడం ఒక వరంగా భావిస్తున్నానన్నారు. మాది విడతల వారి ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. ప్రకాశం జిల్లాలో కీలకమైన వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేస్తామన్నారు. మూతపడిన పాఠశాలలు తిరిగి తెరిపిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

వైసీపీ నేతలపై ఫిర్యాదులు

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలపై వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా చిన్నబజారు పోలీసు స్టేషన్‌లో వాలంటీర్లు స్థానిక కార్పొరేటర్‌, వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీటింగ్‌ అని పిలిచి రాజీనామా చేయించారని ఆరోపించారు. రాజీనామాలు చేయనివారిపై ఒత్తిడి చేశారన్నారు. నియోజకవర్గాల్లో వాలంటీర్లు స్థానిక ఎమ్మెల్యేలను కలిసి తమ ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో లక్షకు పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 1.25 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. వీరిలో దాదాపుగా 1.08 లక్షల మంది రాజీనామాలు చేశారు. ఇప్పుడు వీరంతా స్థానిక కూటమి నేతలకు వినతులు అందిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం