Amaravati Capital : అమరావతి అభివృద్ధికి ఆదేశాలు అందాయ్, త్వరలో పనులు ప్రారంభం-సీఎస్ నీరబ్ కుమార్-amaravati cs nirab kumar tours capital area works start from uddandarayunipalem after swearing ceremony ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Capital : అమరావతి అభివృద్ధికి ఆదేశాలు అందాయ్, త్వరలో పనులు ప్రారంభం-సీఎస్ నీరబ్ కుమార్

Amaravati Capital : అమరావతి అభివృద్ధికి ఆదేశాలు అందాయ్, త్వరలో పనులు ప్రారంభం-సీఎస్ నీరబ్ కుమార్

Bandaru Satyaprasad HT Telugu
Jun 09, 2024 06:55 PM IST

Amaravati Capital : అమరావతి రాజధాని ప్రాంతంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యటించారు. అమరావతిని అభివృద్ధి చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు.

అమరావతి అభివృద్ధికి ఆదేశాలు అందాయ్, త్వరలో పనులు ప్రారంభం-సీఎస్ నీరబ్ కుమార్
అమరావతి అభివృద్ధికి ఆదేశాలు అందాయ్, త్వరలో పనులు ప్రారంభం-సీఎస్ నీరబ్ కుమార్

Amaravati Capital : అమరావతిని అభివృద్ధి చేయాలని ఆదేశాలు వచ్చాయని చీఫ్ సెక్రెటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఉద్దండరాయుని పాలెం ప్రాంతం నుంచి పనులు ప్రారంభిస్తున్నామన్నారు. సీఎం మంత్రివర్గం ప్రమాణస్వీకారం పనులు ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేస్తామన్నారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. రైతుల సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు.

రాజధాని ప్రాంతంలో సీఎస్ పర్యటన

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సీఆర్డీఏ అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈనెల 12న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లుగా రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ప్రస్తుతం ఆ పనులన్నీ శర వేగంగా పున:ప్రారంభం అయ్యేందుకు అవకాశం ఉన్నందున సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఛార్జ్ తీసుకున్న రెండు రోజుల్లోనే రాజధాని ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

యుద్ధప్రాతిపదికన చర్యలు

అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గత నాలుగైదు రోజులుగా రాజధాని ప్రాంతంలో 83 జేసీబీలు, టిప్పర్లు వంటి యంత్రాలతో రాజధాని శంఖు స్థాపన ప్రాంతంలో, సీడ్ యాక్సిస్ రహదారి, కరకట్ట రహదారి సహా ఇతర మాస్టర్ ప్లాన్ లోని ప్రధాన రహదారులు వెంబడి చిన్న చిన్న మరమ్మత్తులు నిర్వహించడం, తుప్పలు తొలగించడం, విద్యుత్ దీపాల పునరుద్ధరణ వంటి పనులను సీఆర్డిఏ అధికారులు చేపట్టారు. ఈనెల 12 న నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్న నేపథ్యంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యటన నిర్వహించారు.

భవన సముదాయాలు పరిశీలన

2014లో అమరావతి రాజధానికి శంఖుస్థాపన జరిగిన సమయంలో ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ గా ఉండడంతో ఆయనకు రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులపై పూర్తి అవగాహన ఉంది. సీఎస్ పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా రాజధాని ప్రాంతానికి సంబంధించి గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయుని పాలెంలోని సీఆర్డీఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. తదుపరి అఖిల భారత సర్వీసు అధికారుల నివాసం సముదాయ భవనాలను, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల నివాస భవన సముదాయాలను సీఎస్ పరిశీలించారు. అలాగే 10 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, హేపీ నెస్ట్ వంటి నిర్మాణాలను సీఎస్ పరిశీలించారు. అదే విధంగా ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైకోర్టు అదనపు భవన సముదాయాన్ని కూడా సీఎస్ పరిశీలించారు.

అనంతరం నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అమరావతి రాజధాని ప్రాంతంలో పనులను శరవేగంగా ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సీఆర్డిఏ అధికారులతో చర్చించారు. ఈ పర్యటనలో సీఎస్ తో పాటు సీఆర్డిఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమీషనర్, ఎస్ఇ తదితర ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం