TG Capital Hyderabad : ముగిసిన 'ఉమ్మడి రాజధాని' ముచ్చట - ఇక హైదరాబాద్ తెలంగాణదే..! భవనాల స్వాధీనంపై సందిగ్ధత..!-hyderabad no longer joint capital for andhra pradesh and telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Capital Hyderabad : ముగిసిన 'ఉమ్మడి రాజధాని' ముచ్చట - ఇక హైదరాబాద్ తెలంగాణదే..! భవనాల స్వాధీనంపై సందిగ్ధత..!

TG Capital Hyderabad : ముగిసిన 'ఉమ్మడి రాజధాని' ముచ్చట - ఇక హైదరాబాద్ తెలంగాణదే..! భవనాల స్వాధీనంపై సందిగ్ధత..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 02, 2024 10:30 AM IST

Joint Capital Hyderabad : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కథ ముగిసింది. 2014 జూన్ 2 నుంచి ఏపీ, తెలంగాణకు 10 ఏళ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ్టితో ఈ గడువు పూర్తి కావటంతో హైదరాబాద్ శాశ్వత రాజధానిగా తెలంగాణ ఉండనుంది.

తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్‌
తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్‌

Joint Capital Hyderabad : గత పదేళ్లుగా ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే ఇవాళ్టితో(జూన్ 2 ,2024)తో ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. ఇదే సమయంలో హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన కొన్న భవనాల భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది.

10 ఏళ్లుగా ఉమ్మడి రాజధాని….

ఏపీ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5 ప్రకారం… జూన్ 2, 2014 నుంచి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు.  10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ అనేది… తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. 10 సంవత్సరాల వ్యవధి ముగిసిన తర్వాత… హైదరాబాద్ అనేది తెలంగాణకు శాశ్వత రాజధానిగా ఉంటుంది. ఈ పదేళ్ల కాలంలో పాలన కోసం హైదరాబాద్ లోనూ పలు భవనాలను ఏపీకి కేటాయించిన సంగతి తెలిసిందే.

ఈ పది సంవత్సరాల కాలంలో…. ఏపీ సొంత రాజధానికి షిఫ్ట్ అయ్యే వరకు హైదరాబాద్ నుంచి కార్యకలపాలను నిర్వహించుకునే అవకాశం ఉంది. చట్ట ప్రకారం… సచివాలయ సముదాయంలోని కొంత భాగంతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని భవనాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అదేవిధంగా సోమాజిగూడలోని రాజ్‌భవన్‌కు సమీపంలో ఉన్న లేక్‌వ్యూ అతిథి గృహాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కేటాయించారు.

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత సుమారు ఏడాది పాటు ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అమరావతిలో కొత్త రాజధాని నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ… పొరుగు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్‌ను నిర్వహించడం అసౌకర్యంగా భావించారు.

కొత్త రాజధాని నగరం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా… చంద్రబాబు నాయుడు పరిపాలనను విజయవాడ - గుంటూరులోని కొన్ని ప్రాంతాలను ఎంచుకున్నారు.  ఒక్క ఏడాదిలోనే అమరావతిలోని వెలగపూడిలో రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించి, అక్కడ్నుంచే పాలన సాగించారు. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీని ఏర్పాటు చేయటంతో పాటు  రెండేళ్ల తర్వాత హైకోర్టును కూడా అమరావతికి తరలించారు.

ఆ తర్వాత… హైదరాబాద్ లో ఉన్న సచివాలయంలో ఇచ్చిన కొన్ని భవనాలను ఖాళీ చేసి ఏపీ ప్రభుత్వం…. తెలంగాణకు అప్పగించింది. కేవలం మూడు భవనాలు మాత్రమే ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఇందులో చూస్తే ఆదర్శ్ నగర్‌లోని హెర్మిటేజ్ అధికారిక భవన సముదాయం, లక్డీ-కా-పూల్ వద్ద నేర పరిశోధన విభాగం (CID) భవనంతో పాటు లేక్ వ్యూ అతిథి గృహం ఉన్నాయి.

ఆదివారం(జూన్ 2) నుంచి హైదరాబాద్‌ తెలంగాణకు ఏకైక రాజధానిగా హైదరాబాద్ అవతరించనుంది. 10 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని మే 15న జరిగిన అధికారిక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఏపీ సర్కార్ లేఖ….

తెలంగాణ సచివాలయంలోని సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ మూడు భవనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవలే లేఖ రాసిందని చెప్పారు. ఆంధ్రాలో శాశ్వత భవనాలను ఏర్పాటు చేసుకునే వరకు మరో సంవత్సరం పాటు ఉంచడానికి అనుమతించాలని అభ్యర్థించారని పేర్కొన్నారు. అద్దె చెల్లించేందుకు కూడా సిద్ధమని తెలిపిందని వెల్లడించారు.

ఎన్నికల కోడ్ దృష్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. “మే 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు రావాల్సి ఉంది, అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అంతర్ రాష్ట్ర విషయాలకు సంబంధించిన ఏ అంశాన్ని చర్చించవద్దని భారత ఎన్నికల సంఘం (ECI) స్పష్టం చేసింది. దీంతో ఈ అంశంపై చర్చ జరగలేదు" అని సదరు అధికారి చెప్పారు.

జూన్ 6వ తేదీన ఎన్నికోడ్ ను ఎత్తివేయనున్నారు. ఏపీలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏపీ అభ్యర్థనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.

Whats_app_banner