Chandrababu Cases : సుప్రీం, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లు- విచారణ ఈ తేదీలకు వాయిదా!-amaravati chandrababu petition in acb high court supreme court petition hearing postponed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Cases : సుప్రీం, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లు- విచారణ ఈ తేదీలకు వాయిదా!

Chandrababu Cases : సుప్రీం, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లు- విచారణ ఈ తేదీలకు వాయిదా!

Bandaru Satyaprasad HT Telugu
Sep 27, 2023 05:03 PM IST

Chandrababu Cases : టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వా్ష్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. ఐఆర్ఆర్ పిటిషన్ ఈ నెల 29కు హైకోర్టు వాయిదా వేసింది. బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5కు వాయిదా వేసింది.

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu Cases : టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకోకుండా తనను అరెస్టు చేశారని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు తనపై తప్పుడు కేసులు పెట్టారని వాటిని కొట్టివేయాలని ముందు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

yearly horoscope entry point

అక్టోబర్ 3వ తేదీకి వాయిదా

స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ పిటిషన్‌ బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే ఈ బెంచ్‌లో తెలుగు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ‌ఎన్‌ భట్టి కేసు విచారణకు విముఖత వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా సీజేఐ ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు. మరో ధర్మాసనం లేదా సీజేఐ ధర్మాసనం విచారించాలని ఆయన కోరడంతో... ఈ పిటిషన్ పై విచారణకు సీజేఐ అంగీకరించారు. విచారణను మరో బెంచ్‌కు బదిలీ చేస్తామని సీజేఐ తెలిపారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేశారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు-ఈ నెల 29కు వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి. నిన్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించగా.... ఇవాళ సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. అమరావతి రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది ఏప్రిల్‌ 27న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదుచేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 29కు వాయిదా వేసింది. ఇదే కేసులో ఏ14గా ఉన్న నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

స్కిల్ కేసు బెయిల్, కస్టడీ పిటిషన్- అక్టోబర్ 5కు వాయిదా

చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రమోద్‌ దూబే, సీఐడీ తరఫున స్పెషల్‌ పీపీ వివేకానంద తమ వాదనలు వినిపించారు. స్కిల్‌ కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5కు వాయిదా వేసింది.

అంగళ్లు కేసు-తీర్పు రిజర్వ్

అంగళ్లు రాళ్ల దాడి కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. అంగళ్లు రాళ్ల దాడి కేసులో చంద్రబాబును పోలీసులు ఏ1 నిందితుడిగా చేర్చారు. పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో అంగళ్లు వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాళ్ల దాడి జరిగింది. చంద్రబాబు రెచ్చగొట్టడంతోనే రాళ్లదాడి జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్తలు తమపై రాళ్లు విసిరారని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది తనను కాపాడారని చంద్రబాబు బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పోలీసుల తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Whats_app_banner