Visakha Beach Tragedy: ఇంట్లోంచి పారిపోయి, కొండపై నుంచి కింద పడిన యువతి
Visakha Beach Tragedy: ప్రియుడి కోసం ఇంట్లోంచి పారిపోయిన యువతి ఉదంతం విషాదాంతమైంది. కొండపై నుంచి కిందపడి కాళ్లు చేతులు విరగ్గొట్టుకుని నరకం అనుభవించింది. ప్రమాదం తర్వాత ప్రియుడు పరారయ్యాడు. అటుగా వచ్చిన యువకులు గమనించడంతో రెండ్రోజుల తర్వాత బయటపడింది.
Visakha Beach Tragedy: విశాఖపట్నం గాజువాక సమీపంలోని అప్పికొండ బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని కొందరు యువకులు గుర్తించారు. బాధితురాలిని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన కావ్యగా స్థానికులు గుర్తించారు. కాళ్లు చేతులు విరిగిన స్థితిల బాధితురాలు రెండు రోజులుగా నరకం అనుభవించింది.
భీమవరానికి చెందిన వర్మరాజు అనే యువకుడితో కలిసి కావ్య సెప్టెంబర్ 29న విశాఖపట్నం వచ్చింది. కావ్య కనిపించక పోవడంతో ఆమె తల్లిదండ్రులు 29వ తేదీన బందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మరాజుతో కలిసి విశాఖ వచ్చిన కావ్య 2వ తేదీ నుంచి అప్పికొండ సముద్ర తీరంలో ఉన్న కొండపై ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
కొండ అంచులో నిలబడి సముద్రాన్ని చూస్తున్న క్రమంలో పట్టుతప్పి కిందపడిపోయినట్లు బాధితురాలు చెబుతోంది. ప్రమాదం తర్వాత అమ్మాయి వద్ద ఉన్న డబ్బులు, బంగారం తీసుకుని ప్రియుడు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే కావ్యను పైకి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె కాళ్లు చేతులు విరిగిపోవడంతో అంబులెన్స్ తీసుకువస్తానంటూ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి రాళ్ల మధ్యలోనే యువతి ఉండిపోయింది. సముద్రంలో వెళుతున్న మత్స్యకారుల్ని పిలిచేందుకు ప్రయత్నించినా వారు గుర్తించలేదు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కొందరు యువకులు సెల్ఫీలు దిగేందుకు అప్పికొండపైకి వచ్చిన సమయంలో కింద పడి ఉన్న యువతిని గుర్తించారు. కాపాడాలని కోరడంతో కొండల్లో రాళ్ల మధ్య చిక్కుకుపోయిన యువతిని మత్స్యకారులు, స్థానిక యువకులు డోలీల సాయంతో అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
గాయపడిన యువతితో పాటు ఆమె ప్రియుడు పగలు విశాఖ నగరంలో తిరుగుతూ రాత్రిపూట కొండపై నిద్రిస్తున్నట్లు గుర్తించారు. ఘటన తర్వాత భీమవరానికి చెందిన వర్మరాజు నగలు, నగదుతో పరారైనట్టు యువతి పోలీసులకు తెలిపింది. భీమవరంలోని రిలయన్స్ మార్ట్‌లో పనిచేసే వర్మరాజుతో ఏర్పడిన పరిచయంతో అతనితో కలిసి ఉండేందుకు ఇంటి నుంచి వచ్చేసినట్లు తెలిసింది.
కొండపై నుంచి పడిన తర్వాత అంబులెన్స్ తీసుకువస్తానని వెళ్లి రాలేదని బాధితురాలు తెలిపింది. సెల్ఫీలు దిగడానికి వచ్చిన యువకుల్ని పిలవడంతో వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని, ఆ విషయం ఫోన్‌లో చెప్పినా వస్తున్నానని చెప్పి స్విచ్ఛాఫ్ చేసుకున్నాడని తెలిపింది.
మరోవైపు కావ్య కనిపించడం లేదని 29వ తేదీన మచిలీపట్నంలో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు ఆమె తల్లి తెలిపారు. 29 నుంచి తమ కుమార్తె కోసం గాలిస్తున్నట్లు వాపోయింది. రెండు కాళ్లు,ఒక చెయ్యి విరిగిపోయాయని వివరించింది. యువతితో పరిచయం ఉన్న యువకుడే ఆమెను కొండపై నుంచి తోసేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన కావ్యకు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన వర్మరాజుతో పరిచయం ఎలా ఏర్పడింది, ఏమి చెప్పి ఆమెను విశాఖ తీసుకెళ్లాడు, కొండ మీద వారం రోజులు ఎలా ఉన్నారనే దానికి సమాధానాలు దొరకాల్సి ఉంది.