World Lion Day। సింహం పేరులోనే ఉంది రాజసం, సింహగర్జన ఎంతో భీకరం, ఈ కథనం చాలా ఆసక్తికరం!
10 August 2023, 12:53 IST
- World Lion Day 2023: ఈరోజు 'ప్రపంచ సింహాల దినోత్సవం'. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని సింహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.
World Lion Day 2023
World Lion Day 2023: సింహం దీని పేరులోనే ఉంది ఒక రాజసం. సింహాలు ధైర్యం, బలం, శక్తికి చిహ్నాలు. సింహాన్ని 'అడవికి రారాజు' గా వర్ణిస్తారు. ఇవి క్రూర జంతువుల జాబితాలో వర్గీకరింపబడినప్పటికీ మానవులతో వీటికి ముప్పు పొంచి ఉంది. అందుకే అపురూపమైన జంతువుల సంరక్షణపై అవగాహన కల్పించడానికి ఏటా ఆగష్టు 10న 'ప్రపంచ సింహాల దినోత్సవం' గా పాటిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని సింహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. అవేంటో మీరూ తెలుసుకుంటారా మరి?
సింహం చాలా సోమరి
సింహాలు చాలా సోమరితనాన్ని ప్రదర్శిస్తాయి. ఇవి రోజులో సుమారు 20 గంటల వరకు ఏకధాటిగా నిద్రపోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం చేస్తాయి, వాటికి ఆకలేసినపుడే వేటకు వెళ్తాయి. ఇవి బద్ధకంగా ఉన్నప్పుడు వీపుపై పడుకుని పాదాలు పైకి లేపడం లేదా నీడలో కునుకు చేయడం వంటివి చూడవచ్చు. అలాగే వాటి సహచర సింహాలతో ఆప్యాయంగా మెలగడం, తలలు రుద్దడం, ఆటలాడటం చేస్తాయి.
సింహాలు సామాజికమైనవి
సింహాలు అన్ని పెద్ద పిల్లులలో అత్యంత స్నేహశీలియైనవి. ఇవి తమ సహచర సింహాల గుంపుతో జీవిస్తాయి. సింహాల సమూహాన్ని ప్రైడ్ అని పిలుస్తారు, ఈ సమూహంలో సాధారణంగా మగసింహం, ఆడ సింహాలు, వాటి సంతానం ఉంటాయి. సాధారణంగా ఒక ప్రైడ్ లో పది నుండి పదిహేను సింహాలను కలిగి ఉంటుంది, అనేక ఎక్కువ ఆడ సింహాలు, వాటి పిల్లలు, వాటికి రక్షణగా నాలుగు మగ సింహాల వరకు ఉంటాయి. కొన్ని సింహాల ప్రైడ్‌లలో 40 సభ్యులతో పెద్ద కుటుంబంలా జీవిస్తాయి.
సింహాలకు దాహం తక్కువ
సింహాలు నీరు త్రాగకుండా నాలుగు రోజుల వరకు ఉంటాయి, కానీ అందుబాటులో ఉంటే, అవి ప్రతిరోజూ నీరు త్రాగుతాయి. నీరు లేకపోయినా సింహాలు ప్రతిరోజూ ఆహారం అవసరం. ఒక సాధారణ సింహానికి ప్రతిరోజు కనీసం 5 కేజీల మాంసం తినవలసిన అవసరం. మగసింహాలు 7 కిలోల కంటే ఎక్కువే తింటాయి. సింహాలు ప్రధానంగా జీబ్రా, వైల్డ్‌బీస్ట్ , గేదె వంటి పెద్ద శాకాహారులను తినేందుకు ఇష్టపడతాయి. అప్పుడప్పుడూ ఎలుకలు, పక్షులు, కుందేళ్ళు, బల్లులు, తాబేళ్లు వంటి చిన్న జంతువులను తినేస్తాయి.
సింహాలు టీమ్ వర్క్ చేస్తాయి
సింహం ఒంటరిగా వేటాడే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, అవి తరచుగా గుంపుగా వేటాడతాయి. వేటాడే జంతువును అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి దానిని పడగొట్టేందుకు జట్టుగా కృషి చేస్తాయి. విజయవంతమైన వేట తర్వాత, గర్వంతో ఉన్న సింహాలన్నీ భోజనాన్ని కలిసి పంచుకుంటాయి. ఇందులోనూ ఒక ఆర్డర్ ఉంది, మగ సింహాలు మొదట తింటాయి, తరువాత ఆడ సింహాలు , చివరకు పిల్లలు తింటాయి.
సింహాలు అద్భుతమైన వేటగాళ్ళు
సింహాలు ఆకస్మికంగా వేటాడతాయి. అందులోనూ ఒక ప్లాన్ ఉంటుంది. వేటాడే ముందు అవి ఒక అర్ధ వృత్తాన్ని ఏర్పరుస్తాయి, చిన్న సింహాలు ఎరను దాని కేంద్రం వైపుకు వెంబడిస్తాయి. పెద్ద సింహాలు ఎటాక్ చేస్తాయి. సింహం కళ్లు కాంతికి సున్నితత్వం ప్రదర్శిస్తాయి. మానవుల కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ సున్నితంగా ఉంటుంది, ఇదే వాటికి రాత్రి వేటాడేటప్పుడు ప్రత్యేక ప్రయోజనాన్ని ఇస్తుంది. సింహం పంజాలు ముడుచుకుని ఉంటాయి, తెరిచినపుడు 1 ½ అంగుళాల పొడవు వరకు చేరుకుంటాయి. సింహాలు గంటకు 50 నుంచి 80 కిమీ వేగంతో పరుగెత్తగలవు, 36 అడుగుల ఎత్తు వరకు దూకగలవు.
సింహగర్జన ఎంతో భీకరం
సింహాలు అనేక విధాలుగా కమ్యూనికేట్ చేస్తాయి. గర్జిస్తాయి, కేకలు వేస్తాయి, మూలుగుతాయి, గుసగుసలు వంటి శబ్దాలను ఉపయోగించి వివిధ మార్గాల్లో కమ్యూనికేట్ చేస్తాయి. అలాగే, సువాసన గుర్తులను వదిలివేయడం ద్వారా చీకట్లో సంకేతాలను పంపుతాయి. తమ "కుటుంబ పరిమళాన్ని" వ్యాప్తి చేయడానికి అవి తమ తలలను ఒకదానికొకటి రుద్దుకుంటాయి. సింహం గర్జన భీకరంగా ఉంటుంది. ఆ గర్జన శబ్దం సుమారు 8 కిమీ దూరం వరకు వినబడుతుంది. ఇది ఇతర మాంసాహార జీవులకు ఒక హెచ్చరికలా, ఇతర సింహాల గుంపుకు తమ భూభాగం అని చెప్పుకోవటానికి సంకేతంలా పనిచేస్తుంది. సంభోగం కోసం తమ భాగస్వాములను ఆకర్షించడానికి కూడా సింహాలు గర్జన చేస్తాయి.