తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Liger: క్రాస్ బ్రీడ్ లైగర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు

Liger: క్రాస్ బ్రీడ్ లైగర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు

Manda Vikas HT Telugu

28 February 2022, 14:28 IST

google News
    • లైగర్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీని పేరు వింటేనే ఇదొక క్రాస్ బ్రీడ్ అని స్పష్టంగా అర్థమవుతుంది. లయన్- టైగర్ కలిస్తే వచ్చే ఫలితమే ఈ లైగర్. సాధారణంగా మగ సింహానికి, ఆడపులికి మధ్య కృత్రిమంగా గర్భాధారణ చేస్తే లైగర్ ఉద్భవిస్తుంది. 
Liger
Liger (Stock Photo)

Liger

సింహాలు, పులులు అడవిలో వేటికవే రారాజులుగా వెలుగొందుతాయి, అడవిలో వాటికి తిరుగులేదు. మరి లైగర్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీని పేరు వింటేనే ఇదొక క్రాస్ బ్రీడ్ అని స్పష్టంగా అర్థమవుతుంది. లయన్- టైగర్ కలిస్తే వచ్చే ఫలితమే ఈ లైగర్. సాధారణంగా మగ సింహానికి, ఆడపులికి మధ్య కృత్రిమంగా గర్భాధారణ చేస్తే లైగర్ ఉద్భవిస్తుంది. అంటే ఇక్కడ లైగర్‌కి తండ్రి సింహం అయితే, తల్లి పులి అవుతుంది. మరి ఈ రెండు శక్తివంతమైన మృగాలకు కలిగిన సంతానం అయితే అవి ఇంకెంత మెగాపవర్ శక్తిని కలిగి ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి. అంతేకాకుండా లైగర్లకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైన కొన్నింటి గురించి ఇక్కడ అందిస్తున్నాం.

పోలికలో తల్లి.. గుణంలో తండ్రి.. 

లైగర్లు పోలికలో తల్లి లాగా ఉన్నా లక్షణాల్లో మాత్రం తల్లికంటే ఎక్కువగా తండ్రి లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే పులి కంటే కూడా సింహం లక్షణాలను కనబరుస్తాయి. సింహం ఒక సోషల్ యానిమల్! అంటే ఇది ఎప్పుడూ ఒంటరిగా నడవదు, తన సమూహంతోనే ఉంటుంది. అదే పులి మాత్రం ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది. అడవిలో గిరిగీసుకొని తనకంటూ ఒకటెరిటరీని ఏర్పాటు చేసుకుంటుంది.  అందులోకి మరో పులి ప్రవేశించటానికి కూడా అనుమతించదు. 

కృత్రిమ సృష్టే.. 

ఈ సూత్రం ప్రకారం అడవిలో సింహాలు, పులులు ఒకేచోట ఉండలేవు, వీటికి వీటికి అస్సలు పడదు కూడా.  కాబట్టి సహజసిద్ధంగా లైగర్లు పుట్టడం అనేది అసాధ్యం. వీటిని కృత్రిమంగానే సృష్టించడం మాత్రమే సాధ్యపడుతుంది.అంటే వీటిని మనం 'జూ' లలో మాత్రమే చూడగలం.  వీటిని కొంతమంది సంపన్నవంతులు పెంచుకుంటారు కూడా. ఎందుకంటే, మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఇవి ఎక్కువగా సింహం లక్షణాలు కలిగి సమూహంతో ఉండాలని కోరుకుంటాయి. కాబట్టి వీటిని కూడా పిల్లులు, కుక్కల్ని పెంచుకున్నట్లుగా చిన్నప్పటి నుంచే సరైన ట్రెయినింగ్ ఇచ్చి సంపన్న వర్గాలు వారి ఇళ్లలో పెంచుకుంటారు. ఇది వారికొక స్టేటస్ సింబల్. ఇవి అడవిలో ఉండవు కాబట్టి వేటాడి చంపితినేంత క్రూరత్వం (వైల్డ్ నెస్) వీటిలో ఉండదు.

లైగర్స్ భారీకాయాన్ని కలిగి ఉంటాయి. 'బిగ్ క్యాట్స్' గా పిలిచే టైగర్, లయన్స్ కంటే పరిమాణంలో ఇవి చాలా పెద్దవి. సరిగ్గా నిల్చుంటే ఒక్కో లైగర్ సుమారు 9 నుంచి 12 ఫీట్ల పొడవు, 4-5 నుంచి 6 అడుగుల ఎత్తును కలిగి ఉంటాయి. బరువు సుమారు 550 కేజీల వరకు ఉంటుంది. అంతేకాకుండా గంటకు 80 కిమీల వేగంతో పరుగెత్తగలవు. సహజసిద్ధంగా వేటాడలేవు కానీ జింక, అడవిపంది మాంసాన్ని ఇష్టపడతాయి.

జీవితకాలం.. 

అన్నీ బాగానే ఉన్నా, లైగర్లకు ఉండే భారీకాయం, స్వేచ్ఛగా తిరగలేక ఒకచోట బందీ చేసి ఉంచడం తదితర కారణాల చేత అవి ఒబేసిటీ లాంటి అనారోగ్య సమస్యల బారినపడతాయి. ఇవి వ్యాధులను కూడా తట్టుకోలేవు, సంతానాన్ని ఉత్పత్తి చేయలేవు. ఒక లైగర్ జీవితకాలం 15 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది.

ఇదిలా ఉంటే, లైగర్ సంకరజాతికి మరొకరకం అంటే మగపులికి, ఆడసింహానికి క్రాస్ బ్రీడ్ చేయడం ద్వారా 'టిగాన్' అనే సంకరజాతి ఉద్భవిస్తుంది. ఇవి చూడటానికి సింహం తలతో జూలు ఉండి, శరీరం పులిని పోలి ఉంటుంది. అయితే ఇవి వీటి జన్మకారకుల కంటే తక్కువ పరిమాణంలో మరుగుజ్జులా ఉంటాయి.

తదుపరి వ్యాసం