Yellandu High Drama : ఇల్లెందు మున్సిపాలిటీలో హైడ్రామా-వీగిపోయిన అవిశ్వాసం, ఎమ్మెల్యేతో సహా 17 మందిపై కేసు
05 February 2024, 21:53 IST
- Yellandu High Drama : ఇల్లందు మున్సిపాలిటీలో సోమవారం ఉదయం నుంచి హైడ్రామా కొనసాగింది. ఎట్టకేలకు కాంగ్రెస్ తన పంతం నెగ్గించుకోగా బీఆర్ఎస్ అవిశ్వాసం వీగిపోయింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారని ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కేసు నమోదైంది.
ఇల్లెందు మున్సిపాలిటీలో హైడ్రామా
Yellandu High Drama : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరింది. ఇల్లందు మునిసిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం విధితమే. కాగా సోమవారం అవిశ్వాస బల నిరూపణ సమావేశం నిర్వహించిన క్రమంలో అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొత్తం మీద అధికార కాంగ్రెస్ పార్టీ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఛైర్మన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం రోజుకో మలుపు తిరిగింది. ఏ క్షణంలో ఏ కౌన్సిలర్ ఏ గ్రూపునకు మారతాడో అర్థం కాని పరిస్థితితో రాజకీయ గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో స్పెషల్ మీటింగ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని హైకోర్టు సీఎస్, డీజీపీ, కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. బీఆర్ఎస్ తరుపున మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న డి. వెంకటేశ్వరరావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఛైర్మన్ పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు రెడీ అయ్యారు.
అవిశ్వాసంలో హైడ్రామా
మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ నుంచి 19 మంది కౌన్సిలర్లు, ముగ్గురు ఇండిపెండెంట్లు, న్యూడెమొక్రసీ, సీపీఐ నుంచి ఒక్కొక్క కౌన్సిలర్ గెలుపొందారు. ఇందులో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అవిశ్వాసం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసింది. పార్టీ నుంచి వెళ్లిపోయిన ఛైర్మన్ ను గద్దెదించేందుకు బీఆర్ఎస్ నేతలు పక్కా ప్లాన్ చేసుకున్నారు. ఛైర్మన్ పై పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే ఒక్కో కౌన్సిలర్ కు దాదాపు రూ.25 లక్షల వరకు ఆఫర్ ఇస్తున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. ఇక కాంగ్రెస్ లో చేరిన ఛైర్మన్ డి. వెంకటేశ్వరరావు పదవిని కాపాడేందుకు అధికార పార్టీ ముఖ్య నాయకత్వం పక్కా ప్రణాళిక రచించినట్లు స్పష్టం అవుతోంది. అవిశ్వాసానికి మద్దతు తెలిపిన 17 మంది కౌన్సిలర్లు గత వారం రోజులుగా గోవా, కర్నాటక రాష్ట్రాల్లో క్యాంపుల్లో గడిపారు. అవిశ్వాసం సందర్భంగా నిర్వహించనున్న స్పెషల్ మీటింగ్ కు కనీసం 17 మంది కౌన్సిలర్లు అటెండ్ కావాల్సి ఉండగా హై డ్రామా నెలకొంది.
వీగిపోయిన అవిశ్వాసం
ఈ క్రమంలో 17 మంది మద్దతు తమకుందని చెబుతున్న బీఆర్ఎస్ లీడర్లకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ఎంతో చాకచక్యంగా పావులు కదిపింది. వారిలో కనీసం ఒకరిద్దరినైనా మీటింగ్ కు రాకుండా చేస్తే కోరం పూర్తి కాదని, దీంతో అవిశ్వాసం నీరు గారే అవకాశం ఉందని స్కెచ్ వేసింది.
అనుకున్నట్లే జరిగింది..
ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాసం నేపథ్యంలో ముందుగా ఊహించినట్లే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవిశ్వాసాన్ని నెగ్గించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయకత్వంలో ప్రయత్నాలు సాగించగా, అధికార కాంగ్రెస్ పక్షం హైడ్రామాకు తెరలేపింది. గడిచిన కొద్ది రోజులుగా రహస్య శిబిరాల్లో గడిపిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం ఉదయం అవిశ్వాస సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 19 మంది అవిశ్వాస తీర్మానాన్ని పెట్టగా అందులో 17 మంది ఛైర్మన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే అవిశ్వాసం నెగ్గి ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తన పదవిని కోల్పోయే అవకాశం ఉండేది. కాగా శిబిరం నుంచి అవిశ్వాస సమావేశానికి హాజరైన కౌన్సిలర్లలో మూడో డివిజన్ కు చెందిన నాగేశ్వరరావు కనిపించకపోవడం హై డ్రామాకు కారణమైంది. ఓపక్క అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం 144 సెక్షన్ ను విధించినప్పటికీ ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సమావేశ వేదిక వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే కౌన్సిలర్ కిడ్నాప్ ఉదంతం బీఆర్ఎస్ అవిశ్వాస కూటమిలో ఆందోళనకు కారణమైంది. కాగా కౌన్సిలర్ భార్య తన భర్తను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారంటూ అక్కడ ఆందోళనకు దిగడం గమనార్హం. ఎమ్మెల్యే కోరం కనకయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పెద్దలు ఛైర్మన్ వెంకటేశ్వరరావు పదవిని కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే కిడ్నాప్ ఉదంతం చోటుచేసుకుంది. మొత్తం మీద 17 మంది కౌన్సిలర్లలో ఒకరు సమావేశానికి రాకపోవడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల అవిశ్వాసం వీగిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లు స్పష్టమవుతుంది.
ఎమ్మెల్యేపై కేసు నమోదు
అయితే కౌన్సిలర్ నాగేశ్వరరావు భార్య వెంకటలక్ష్మి... తన భర్తను కిడ్నాప్ చేశారని ఎమ్మెల్యే కోరం కనకయ్యతో సహా 17 మందిపై ఫిర్యాదు చేసింది. కౌన్సిలర్ నాగేశ్వరరావును మున్సిపల్ సమావేశానికి రాకుండా అడ్డుకున్నారని కేసు పెట్టారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు 17 మందిపై కేసు నమోదు చేశారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం