తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Dccb : సడలిన విశ్వాసం.. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం….!

Khammam DCCB : సడలిన విశ్వాసం.. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం….!

HT Telugu Desk HT Telugu

27 January 2024, 13:47 IST

google News
    • Khammam DCCB News: ఖమ్మం డీసీసీబీ హస్తం పార్టీ ఖాతాలోకి వెళ్లింది. శనివారం చేపట్టిన ఓటింగ్ లో…. మెజార్టీ డైరెక్టర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఓటింగ్ వేసినట్లు తెలిసింది. అధికారికంగా ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.
ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం.!
ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం.!

ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం.!

Khammam DCCB News: ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కూరాకుల నాగభూషయ్యపై విశ్వాసం సడలిపోయింది. ఆయనపై అవిశ్వాస తీర్మానమే నెగ్గింది. ఖమ్మం డిసిసిబి చైర్మన్ పై ఈనెల 11వ తేదీన ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వి. వెంకటాయపాలెం సొసైటీలో డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానాన్ని అధికారులకు అందజేసిన విషయం తెలిసిందే. కాగా పదిహేను రోజుల కాలవ్యవధి తర్వాత డీసీవో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో చైర్మన్ పై మోపిన అభియోగ తీర్మానమే నెగ్గింది. సొసైటీలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా 11 మంది డైరెక్టర్లు బల నిరూపణ సమావేశానికి హాజరయ్యారు. కాగా హాజరైన 11 మంది సభ్యులు ముక్తకంఠంతో చైర్మన్ నాగభూషయ్య పై మోపిన అభియోగానికి కట్టుబడి ఓటు వేసినట్లు తెలుస్తోంది.

హాజరుకాని చైర్మన్..

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా ఉన్న కూరాకుల నాగభూషయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వి వెంకటాయపాలెం కో- ఆపరేటివ్ సొసైటీలో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా అందులో 11 మంది మాత్రమే డీసీవో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమావేశానికి హాజరవ్వడం, వారందరూ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చినవారే కావడం గమనార్హం. కాగా చైర్మన్ కూరాకుల నాగభూషయ్య తో పాటు మరొక డైరెక్టర్ హాజరు కాకపోవడంతో వార్ వన్ సైడ్ అన్నట్లు అక్కడ పరిస్థితి మారింది.

15 రోజుల తర్వాత నేరుగా సొసైటీకి..

వి. వెంకటాయపాలెం సొసైటీ చైర్మన్ నాగభూషయ్య పై అవిశ్వాసం మోపిన 11మంది డైరెక్టర్లు నోటీసు ఇచ్చిన వెనువెంటనే మాయమయ్యారు. కాంగ్రెస్ అధినాయకత్వం వారిని హుటాహుటిన క్యాంపునకు తరలించింది. గడిచిన 15 రోజులపాటు వారు ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ విహార ప్రాంతాల్లో చెక్కర్లు కొడుతూ గడిపారు. కాంగ్రెస్ పెద్దల ఆదేశానుసారం గ్రామానికి చెందిన కీలక నాయకుడు, ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు యరగొర్ల హనుమంతరావు.. 11 మంది డైరెక్టర్లతో కూడిన ఈ శిబిరానికి నాయకత్వం వహించారు. కాగా అవిశ్వాసంపై బల నిరూపణ సమావేశం ఏర్పాటు చేసిన శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు నేరుగా 11మంది సభ్యులు సొసైటీ వద్దకు రెండు కార్లలో వచ్చి హాజరవ్వడం ఆసక్తిని కలిగించింది. ఇందులో ఏ ఒక్కరు జారిపోకుండా చూసుకునే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ హనుమంతరావుకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఆ మేరకు ఆయన కనుసన్నల్లోనే 11 మంది డైరెక్టర్లు అవిశ్వాస ఓటింగ్ లో పాల్గొనడం గమనార్హం.

ఫలితాన్ని కోర్టుకు సమర్పిస్తాం - డీసీవో

కో-ఆపరేటివ్ సొసైటీ నుంచి 11 మంది సభ్యులు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చిన నేపథ్యంలో 15 రోజుల గడువు అనంతరం శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ విజయకుమారి పేర్కొన్నారు. ఈమేరకు సభ్యులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమై ఓటింగ్ నిర్వహించారు. అయితే సభ్యుల ఓటింగ్ ఫలితాన్ని కోర్టు ఆదేశాల మేరకు తాము వెల్లడించలేమని స్పష్టం చేశారు. సమావేశ తీర్మాన అంశాన్ని కోర్టుకు సమర్పించడం జరుగుతుందని వివరించారు. చట్టపరమైన పరిమితులు ఉన్న నేపధ్యంలోనే 30వ తేదీ వరకు ఈ ఫలితాన్ని బహిర్గతం చేసే అవకాశం లేదని తెలిపారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న కూరాకుల నాగభూషయ్య వి వెంకటాయపాలెం సొసైటీ పరిధిలో చేసిన అభివృద్ధి శూన్యమని డైరెక్టర్లు రావూరి సైదుబాబు, రావెళ్ళ శ్రీనివాసరావు ఆరోపించారు. అనేక పర్యాయాలు తాము మొర పెట్టుకున్నప్పటికీ ఆయన తీరు మారలేదని అందుకే అవిశ్వాసాన్ని ప్రకటించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలిపారు. ఆయన చెబుతున్నట్లు ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడులు, ప్రమేయం లేనేలేవని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగానే తాము నాగభూషయ్య పై అవిశ్వాసం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.

పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్..

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక నామినేటెడ్ పదవులను ఎంజాయ్ చేస్తున్న నేతలు ఒక్కొక్కరుగా పదవీచ్చితులు అవుతున్న పరిస్థితితో ఖమ్మంలో గులాబీ గూడు చెదిరిపోతోంది. ఇప్పటికే రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ తో పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సుడా చైర్మన్ పదవులను ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే డీసీఎంఎస్ చైర్మన్ పై సైతం అనర్హత వేటు వేయగా డీసీసీబీ చైర్మన్ కూడా బల నిరూపణలో ఓడిపోయి పదవిని కోల్పోతున్నారు. ఇక కొత్తగూడెం, ఇల్లందు కార్పొరేషన్లలోనూ సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే జిల్లా కేంద్రంలోని ఖమ్మం కార్పొరేషన్ లోనూ పాగా వేసేందుకు కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది. ఇలా వరుస పరిణామాల నేపధ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ చెల్లాచెదరు అవుతోంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

తదుపరి వ్యాసం