తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yellandu Politics: కాంగ్రెస్ చైర్మన్‌పై బీఆర్ఎస్ అవిశ్వాసం.. 5న విశ్వాస పరీక్ష

Yellandu Politics: కాంగ్రెస్ చైర్మన్‌పై బీఆర్ఎస్ అవిశ్వాసం.. 5న విశ్వాస పరీక్ష

HT Telugu Desk HT Telugu

31 January 2024, 7:07 IST

google News
    • Yellandu Politics:  తెలంగాణలో కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాలక వర్గాలపై అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే ఇల్లందులో మాత్రం సీన్‌ రివర్స్‌ అయ్యింది. 
ఇల్లందులో కాంగ్రెస్‌ ఛైర్మన్‌పై బిఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల అవిశ్వాసం
ఇల్లందులో కాంగ్రెస్‌ ఛైర్మన్‌పై బిఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల అవిశ్వాసం

ఇల్లందులో కాంగ్రెస్‌ ఛైర్మన్‌పై బిఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల అవిశ్వాసం

Yellandu Politics: తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల తంతు సాగుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మాత్రం ఇందుకు భిన్నంగా తీరు కనిపిస్తుంది. ఇల్లందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపొందిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డి. వెంకటేశ్వరరావు మొన్నటి ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయన వైఖరి నచ్చని కౌన్సిలర్లు ఆయనపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ఈమేరకు అధికారులు ఫిబ్రవరి 5వ తేదీన సమావేశాన్ని నిర్వహించి విశ్వాస పరీక్ష నిర్వహించబోతున్నారు.

క్యాంపులో 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు..

ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం పై బల పరీక్ష తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చైర్మన్ డివీకి వ్యతిరేకంగా 19 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి అవిశ్వాస నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ఫిబ్రవరి 5న ఇల్లెందు మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ప్రియాంక నిర్ణయించారు.

తేదీ ఖరారైన వెంటనే ప్రత్యేక క్యాంపునకు తరలిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి రకరకాల బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తున్నాయి. ఓ పక్క పోలీసులను ఉపయోగించి పాత కేసులను తిరగదోడుతున్న క్రమంలో కౌన్సిలర్లు వారి భర్తలకు పదే పదే ఫోన్లు చేసి పోలీసు స్టేషన్ కు పిలుస్తున్నట్లు వాపోతున్నారు.

మరో పక్క తమ కుటుంబ సభ్యుల వ్యాపారాలపై సంబంధిత శాఖల నుంచి నోటీసులు ఇవ్వడం.. సోదాలు చేయించడం ద్వారా ఒత్తిడి పెంచే చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. విశ్వాస పరీక్షలో చైర్మన్ డివీకి అనుకూలంగా ఓటు వేయకపోతే.. తరువాత ఇబ్బందులు పడతారని అధికార పార్టీ నేతలు, ముఖ్యుల నుంచి క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులకు తరచూ ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారు.

ఇలాంటి పరిణామాలతో అప్రమత్తమైన బీఆర్ఎస్ పార్టీ.. అవిశ్వాస తీర్మానం పై ప్రత్యేక సమావేశం సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరింది. ఈ మేరకు క్యాంపులో ఉన్న కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖ వారికి అందజేశారు. తమకు పలు రకాల బెదిరింపులు వస్తున్నాయని.. ఫిబ్రవరి 5న సంఘ విద్రోహ శక్తులు.. తమను సమావేశానికి రాకుండా అడ్డుకునే ప్రమాదం ఉందని కౌన్సిలర్లు ఆ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

విశ్వాస పరీక్ష సందర్భంగా తమ పార్టీ నుంచి విప్ జారీ అయినందున తాము ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన బందోబస్తు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలెక్టర్, ఎస్పీలను కోరారు. మొత్తానికి ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస ప్రక్రియ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

తదుపరి వ్యాసం