Yasangi Crops : ఎన్నికలు, వడగండ్ల ఎఫెక్ట్..! నత్తనడకన యాసంగి సాగు
21 December 2023, 21:54 IST
- Yasangi Cultivation in Nizamabad: తెలంగాణలోని చాలా జిల్లాల్లో యాసంగి సాగు ఆలస్యమవుతోంది. తుపాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలతో సాగు నత్తనడకన నడుస్తోంది.
తెలంగాణలో వరి సాగు
Yasangi Cultivation in Nizambad : అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవల కురిసిన వడగండ్ల వానతో నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగు ఆలస్యమవుతోంది. ఇప్పటి వరకు వరి సాగు కేవలం 21 శాతమే అయ్యింది. సాధారణంగా డిసెంబర్ నెలాఖరుకు 60 శాతం సాగు అయ్యేది. అయితే ప్రస్తుతం సాగు ఆలస్యమయితే పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల రైతాంగం నష్టపోయే ప్రమాదముందని వ్యవసాయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ యేడు యాసంగి సాగులో మొత్తం 5,03,741 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 3,95,871 ఎకరాల్లో సాగు అయ్యే కానుంది. సాధారణంగా రబీ సీజన్‌లో వరి సాధారణ సాగు కేవలం 2,81,619 ఎకరాలు మాత్రమే. కానీ గడిచిన రెండు సంత్సరాలుగా యాసంగిలో వానాకాలం సీజన్ మాదిరిగా వరి పంట సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. నిజామాబాద్ సాగు పంటలకు జీవనాధారమైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్‌లో నీరు నిండుగా ఉండటంతో రైతాంగం వరి సాగుకే మొగ్గుచూపుతున్నారు. ఆరుతడి పంటలు నామమాత్రంగానే సాగవుతున్నాయి.
ఈ రబీ సీజన్‌లో వరి తరువాత 23 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 22 వేల ఎకరాల్లో శనగలు, 14 వేల ఎకరాల్లో నువ్వులు, 27 వేల ఎకరాల్లో ఎర్రజొన్నలు, 8,500 ఎకరాల్లో సజ్జలు, 5 వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగవుతాయని అంచనా వేశారు.
సాధారణంగా జిల్లాలో బోధన్, బాన్సువాడ ప్రాంతాల్లో రెండు వారాలు ముందుగా, సిరికొండ, జక్రాన్‌పల్లి తదితర మండలాల్లో రెండు వారాలు ఆలస్యంగా సాగు ప్రారంభమయ్యేది. బోధన్ డివిజన్‌తో పాటు బాన్సువాడ డివిజన్‌లోని పలు మండలాల్లో సెటిలర్లు సాగు ముందుగా వేసి.. కోత సమయంలోనే నేరుగా వ్యాపారులకు పంటలు విక్రయిస్తారు. కోత కోయడం, ఆర బెట్టడం వ్యయప్రయాసలు లేకుండా పంట అమ్మకం చేస్తారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల వల్ల సాగు ఆలస్యమయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల్లో పెద్దఎత్తున ప్రచారాలు జరిగాయి. ద్వితియశ్రేణి నాయకత్వం అంతా పల్లెల్లో ప్రచారం నిర్వహించారు. కొంతమంది గ్రామాల నుంచి వచ్చి పట్టణాల్లో తమ పార్టీకి, నాయకుడికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఇక మిచ్‌గావ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురిసన వడగండ్ల వానతోనూ సాగు ఆలస్యమయ్యింది. చాలా ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంబాలు పడిపోవడంతో మరమ్మతులు చేయడంలో జాప్యం జరిగింది. ఈ ప్రభావం కూడా సాగుపై పడింది.
21 శాతమే వరి సాగు..
జిల్లాలో 3,95,871 ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 59,657 ఎకరాల్లో మాత్రమే పంట సాగు అయ్యింది. వరి పంట సాగు ఆలస్యమైతే కోత సమయాల్లో అకాల వర్షాలతో రైతులు నష్టపోయే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. పైగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండలు ముదిరితే భూగర్భజలాలు అడుగంటి పంటలకు నీరందదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట సాగులో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక వరి తరువాత 14 వేల ఎకరాల్లో సాగు కావాల్సిన నువ్వులు ఇంకా ప్రారంభించేదు. పొద్దు తిరుగుడు 41 శాతమే సాగయ్యింది. అయితే మొక్కజొన్న అధికారుల అంచనాలకు మించి సాగయ్యింది. మొక్కజొన్నసాధారణ సాగు 16 వేల ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 21,775 ఎకరాల్లో సాగు అయ్యింది. ఇంకా సమయం ఉండటంతో అధికారుల అంచనాలు వేసి 23 వేల ఎకరాలకు మించి సాగయ్యే అవకాశముంది.
రిపోర్టింగ్ : భాస్కర్, నిజామాబాద్ జిల్లా